Home రాజకీయాలు బాబు చేలో మేస్తుంటే.. ఆది గట్టున మేస్తాడా!?

బాబు చేలో మేస్తుంటే.. ఆది గట్టున మేస్తాడా!?

SHARE

అధినేత ఎలాంటివాడైతే.. ఆయన కనుసన్నల్లోని నేతలు అలా ప్రవర్తిస్తుంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఎలా ప్రవర్తిస్తుంటారో అచ్చు అలాగే ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా ప్రవర్తిస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో దళితులపై చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలు చేసినప్పుడు కూడా.. తర్వాత కొన్ని రోజులకే ఆది నారాయణ రెడ్డి సైతం దళితులపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. అప్పట్లోనే వీరిద్దరిపై దళిత సంఘాలు, ప్రజలు విమర్శల వర్షాలు కురిపించారు. ఇదే క్రమంలో ప్రతి విషయంలోనూ బాబునే ఫాలో అవ్వాలనుకుంటున్నారో లేక బాబు అనుంగ శిష్యుడి ఖాతాలో చేరిపోయి, ఇలాంటి పనులకు ఒడిగడుతున్నారో తెలియదు కానీ… వీది రౌడీలకు, సినిమాలో విలన్లకు తామేమీ తీసిపోమని నిరూపించే ప్రయత్నం చేశారు ఆదినారాయణ రెడ్డి ఫ్యామిలి!

వివరాళ్లోకి వెళ్తే… కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దదండ్లూరు గ్రామంలో ఇటీవల ఏపీఎస్పీ కానిస్టేబుల్ సంపత్ వివాహం జరిగింది. ఈ వివాహ వేడుక మే 25న జరగ్గా.. ఆ కార్యక్రమానికి ఎంపీ అవినాష్ రెడ్డితోపాటు మరికొందరు నేతల్ని ఆహ్వానించారు. అయితే.. ఆ సమయానికి అవినాష్ రెడ్డి ఢిల్లీలో ఉండటంతో పెళ్లికి వెళ్లటం సాధ్యం కాలేదు. ప్రస్తుతం ఏపీలో ఉన్న ఆయన.. తాజాగా ఆయన కొత్త దంపతుల్ని పలుకరించి శుభాకాంక్షలు చెప్పేందుకు బయలుదేరారు. దీంతో… ఎంపీ అవినాష్ రెడ్డి గ్రామంలోకి వస్తే తమ అధిపత్యానికి గండి పడుతుందని భావించిన ఏపీ మంత్రి ఆది కుటుంబ సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.. తమ రాజనీతిని బయట పెట్టారు.

అవినాష రెడ్డి గ్రామంలోకి వస్తున్నాడని తెలుసుకున్న మంత్రి తనయుడు సుధీర్ రెడ్డి ఆ గ్రామంలో వీరంగానికి పాల్పడ్డారు. తమకు తెలీకుండా, చెప్పకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఊళ్లోకి ఎలా ఆహ్వానిస్తారంటూ… కొంతమంది రౌడీ మూకల్ని వెంటేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సానుభూతిపరుల ఇళ్లపైనా, ఆస్తుల పైనా దాడులకు తెగబడ్డారు. అనంతరం ఎంపీని ఆహ్వానించిన సంపత్ ఇంటికి వెళ్లి.. వారి ఇంటి ముందు వేసి ఉన్న షామియానాను, ఇంట్లోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్దిలో ముందుకు పోతుంది అని చంద్రబాబు కబుర్లు చెబుతున్న రోజుల్లో, ఒక ఎంపీ, ఒక గ్రామానికి వెళ్లాలంటే నెలకొన్న పరిస్థితులు బాబు పాలన ఎలా ఉందో చెబుతున్నాయి.

దీంతో… ఆది అనుచరుల పాత్రను పోషిస్తున్నారనే విమర్శను ఎదుర్కొన్న పోలీసులు, గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయంటూ ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన అనుచరుల వాహనాల్ని ఊళ్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అందరిని కాకుండా కనీసం ముగ్గురిని అయినా ఊళ్లోకి అనుమతించాలని ఎంపీ అవినాష్ కోరినా కూడా పోలీసులు అందుకు ససేమిరా అన్నారు. ఒక ఎంపీని ఒక గ్రామంలో తిరగడానికి సైతం సహకరించలేని, పరిస్థితులు కల్పించలేని విషయం..ది పోలీసుల చేతకాని తనం అనుకోవాలా.. సుధీర్ రెడ్డి రౌడీ ఇజం గొప్ప తనం అనుకోవాలా.. బాబు పాలనలో జరుగుతున్న నియంతృత్వ పోకడల ప్రభావం అనుకోవాలా అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకాలం ప్రజల్లోకి వెళ్తున్న జగన్ ను, వైకాపా నేతలను అడ్డుకోవడానికి అన్ని రకాలుగా చంద్రబాబు ఎన్నిరకాలుగా ప్రయత్నించారో చూసిన జనం, ప్రస్తుతం ఆదినారాయణ రెడ్డి విధానాన్ని చూసిన తర్వాత… బాబు చేలో మేస్తుంటే.. ఆది గట్టున మేస్తాడా? అని జనాలు చెప్పుకుంటున్నారు. కాగా… చింతమనేని విషయంలో బాబు చర్యలు తీసుకుని ఉంటే.. నేడు ఆది ఇలా రెచ్చిపోయే వారు కాదనేది మరో వర్గం వాదన!