Home రాజకీయాలు సీఎం స్పీచ్ లు – వినేవాడు లేకపోతే ఏమైనా చెప్పొచ్చు!!

సీఎం స్పీచ్ లు – వినేవాడు లేకపోతే ఏమైనా చెప్పొచ్చు!!

61
SHARE

ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌..ప్ర‌తీరోజూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. జగన్ పాద‌యాత్ర‌లో, పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర‌లో రోజూ ముఖ్య‌మంత్రిని తీవ్రంగా దుమ్మెత్తి పోస్తున్నారు. సీఎం చంద్రబాబు కూడా తానేమీ వారికి తీసిపోని అన్నట్టు ఎదురుదాడికి దిగుతున్నారు. త‌న న‌ల‌భైయేళ్ల రాజ‌కీయానుభ‌వాన్ని ప్ర‌శ్నించిన ప‌వ‌న్కు నాయుడు ఘాటు స‌మాధానం ఇచ్చారు. విజ‌య‌న‌గ‌రం లో జ‌రిగిన న‌వ నిర్మాణ దీక్ష‌ సభలో సీఎం చేసిన కొన్ని ఆస‌క్తిక‌రమైన వ్యాఖ్యలు:.

ఇసుక‌, చెరువుల్లో మ‌ట్టిని ఉచితంగా తీసుకోవ‌చ్చ‌ని తాను ప్ర‌జ‌ల‌కు చెబుతుంటే, దాన్లో అవినీతి చేశానంటూ త‌న‌పై విమ‌ర్శిస్తున్నారని సీఎం అన్నారు. ఇంకా తనకు ఎలాంటి బ‌ల‌హీన‌త‌లు ఉన్నాయ‌ని ప్రజలని అడిగారు.. న‌ల‌భై సంవ‌త్స‌రాల రాజ‌కీయ జీవితంలో ఎప్పుడైనా తాగాన‌నో, సిగరెట్లు కాల్చాన‌నో, అమ్మాయిల‌తో తిరిగాన‌నో, ఎప్పుడైనా విన్నారా త‌మ్ముళ్లూ అని అడిగారు చంద్ర‌బాబు. తానూ చెడు సావాసాలు ఎనాడూ చెయ్య‌లేద‌న్నారు, తనకు ఒక క్ర‌మ‌శిక్ష‌ణ ఉందని ఒక ప‌ద్ధ‌తి ప్రకారం రాజ‌కీయాలు చెయ్యాల‌నుకున్నాన‌నీ, భావి త‌రాల‌కు ఆద‌ర్శం కావాల‌నీ, చిన్న‌చిన్న వ్య‌స‌నాలు బ‌లహీన‌త‌ల‌కు లోనైతే నాయ‌క‌త్వం ఇవ్వ‌లేన‌ని నిశ్చ‌యించుకున్నాను అని సీఎం చెప్పారు.

జైలుకెళ్లిన ఓ గ‌జ‌దొంగ ఊరి పెద్ద మ‌నిషిని తిడితే, ఆ పెద్ద మ‌నిషి ఎంత‌గా బాధ‌ప‌డతాడో అర్థం చేసుకోవాల‌న్నారు; త‌నది అలాంటి బాధే అని చంద్ర‌బాబు చెప్పారు. త‌న‌ను బంగాళాఖాతంలో ప‌డేస్తాన‌నీ, న‌డిరోడ్డు మీద ఉరేస్తానంటూ వారు వాడుతున్న భాష ఎలాంటిదో ప్ర‌జ‌లు చూస్తూనే ఉన్నార‌న్నారు.

ఎంత దిగజారుడు స్పీచ్ ఈ మధ్య కాలం లో వినలేదు….ఈ మధ్య చంద్రబాబు స్పీచ్ లు అన్ని ఇలానే తనపై సింపతీ కలగాలి అన్నట్టే సాగుతున్నాయి. సింపతీ సంగతి ఏమో గాని జనాలు చెవులు మూసుకుని కూర్చోవటం కనపడుతోంది!!