Home రాజకీయాలు ఆనం ఫిక్స్… సందేశం ఇదేనా?

ఆనం ఫిక్స్… సందేశం ఇదేనా?

SHARE

నాటి పరిస్థితుల ప్రభావమో, ఆశల కారణమో తెలియదు కానీ… రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా, నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించిన వ్యక్తిగా ఉన్న మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం జరిగిన ఎన్నో పరిణామాలు ఆనం రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తున్నాయనే కామెంట్స్ కూడా వినిపించాయి! అయితే అనంతర పరిణామాలు, టీడీపీలో ఆనంకి ఇస్తున్న విలువ, జిల్లా రాజకీయాల్లో రోజు రోజుకీ తగ్గుతున్నట్లు కనిపిస్తున్న పలుకుబడి పరిణామాల నేపథ్యంలో అంతా ఊహించినట్లుగానే జరిగింది.. ఆనం సైకిల్ దిగిపోతున్నారు!! సైకిల్ దిగిపోతున్న ఆనం.. ఎన్నో సందేహాలు ఇచ్చే అవకాశం ఉందనేది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది!!

ప్రస్తుతం రామనారాయణ రెడ్డి టీడీపీలో ఏమాత్రం సంతోషంగా లేరని తాజా పరిస్థితితులను బట్టి అర్థమవుతోంది. అయితే ఈ ఆనం.. టీడీపీని వీడాలని తీసుకున్న నిర్ణయం నేటిది కాదని, ఎప్పటి నుంచో ఈ ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది. నిజానికి కొద్దినెలల ముందే వీరు టీడీపీ లోంచి బయటకు వచ్చేద్దామని అనుకున్నా కానీ… ఇంతలోనే ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్యం క్షీణించడం, అనంతరం మరణించడంతో పార్టీ మారడం ఆ సమయంలో సరైంది కాదని రాం నారాయణ రెడ్డి తన నిర్ణయాన్ని వాయిదా వేశారు. అయితే… వివేకానందరెడ్డి మరణించి రెండు నెలలు గడిచిపోవడంతో రాంనారాయణ రెడ్డి ఇక టీడీపీ నుంచి బయటకు రావడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

అయితే… నెల్లూరులో టీడీపీని బలపరిచే క్రమంలో రామనారాయణ రెడ్డికి మంత్రిపదవి, వివేకానంద రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని గతంలో చంద్రబాబు వాగ్దానం చేశారు.. కాని మొండిచేయి చూపించారు. ఇద్దరికీ తాను చెప్పింది చేసే అవకాశాలున్నప్పటికీ నెల్లూరు జిల్లా గ్రూపు రాజకీయాల కారణమో ఏమో కానీ.. ఆ పని చేయలేకపోయారు చంద్రబాబు. దీంతో రామనారాయణ ఈమధ్య టీడీపీ మినీ మహానాడులోనే తన అసంతృప్తిని, అసహనాన్ని నేరుగా బయటపెట్టారు! బాబు పరిపాలనపట్ల 80శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అధికారులు చెప్పడంలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. ఇదే క్రమంలో తమ 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇన్ని అవమానాలు మునుపెన్నడూ పడలేదని కూడా ఆనం స్పష్టం చేశారు! ఈ క్రమంలో రెండు రోజుల కిందట రాజీనామా లేఖను బాబుకు అందచేసినట్లు తెలుస్తోంది!

అయితే… ప్రస్తుతం ఆనం రాంనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు, సన్నిహితులు తమ కార్యకర్తలతో అంతరంగిక చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఆనం వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాను వైసీపీలో చేరుతానని వైఎస్ జగన్ తో ఆనం ఇప్పటికే అధికారికంగా కూడా చర్చలు జరిపారని, వారి రాకను జగన్ సాదరంగా ఆహ్వానించారని సమాచారం. దీంతో… సీనియర్లకు, చంద్రబాబుని, ఆయన మాటలను నమ్మి టీడీపీ లో చేరిన చాలా మంది సీనియర్ల పరిస్థితి ఇలానే ఉందని, వారు కూడా జరిగిన అవమానాలు ఇక చాలని.. ఏ క్షణమైనా నిర్ణయించుకుని జగన్ చెంతకు చేరే అవకాశాలున్నాయని ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుస్తుంది!!

ఇప్పటికే రాష్ట్రంలో రోజు రోజుకీ పడిపొతున్న పార్టీ ప్రతిష్ట, రోజు రోజుకీ పెరిగిపోతున్న అవినీతి ఆరోపణలు, ఇదే క్రమంలో రోజు రోజుకీ జనాలకు మరింత దగ్గరైపోతున్న జనాలు.. హోదా రాకపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబే అని ఇప్పటికే జనాల్లోకి వెళ్లిపోయిన సంకేతాల నడుమ… ఇలాంటి సీనియర్లు పార్టీని వీడే ఆలోచనలు, నిర్ణయాలు.. బాబుకు దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాయి అంటున్నారు విశ్లేషకులు!!