Home రాజకీయాలు బాబుతో “మహానటుడు”!

బాబుతో “మహానటుడు”!

SHARE

ఏపీలో రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కుతుంటే.. దానికి అనుగుణంగానే రాజకీయ విమర్శలు మరింత వేడెక్కిస్తున్నాయి. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ టీడీపీలో కొందరు నేతలు మైకుల ముందుకు వచ్చి తెగ విమర్శలు చేస్తూ ఉండేవారు. అధికారం తమ వద్ద ఉండి కూడా… వైకాపా అధినేత జగన్ పై గాలి మాటల విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకునేవాళ్లు! అయితే.. నిన్న మొన్నటివరకూ ఒక మోస్తరు సైలంటు గా ఉన్న వైకాపా నాయకులు వాయిస్ పెంచుతున్నారు. వారూ వీరూ అనే తేడాలేమీ లేకుండా… వైకాపా నాయకులందరూ చంద్రబాబుపై డిఫరెంట్ డిఫరెంటుగా విమర్శల బాణాలు ఎక్కిపెడుతున్నారు! తాజాగా బాబుపై కొత్త కొత్త విమర్శలు, సెటైర్లు పడటానికి వేదికైంది.. వంచనపై గర్జన దీక్షా వేదిక!

తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం హోదాని తాకట్టు పెట్టి, ఏపీ ప్రజలను వంచించిన చంద్రబాబు… హోదా క్రెడిట్ జగన్ కు వచ్చేస్తుందేమో అనే భయంతో.. గత కొంతకాలంగా హోదా హోదా అని మైకుల్లో హోరెత్తిస్తున్నారు. ఈ వంచనకు వ్యతిరేకంగా దీక్షకు దిగిన వైకాపా నేతలు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనపై విమర్శల వర్షాలు కురిపించారు. వీరిలో కోలగట్ల వైఎస్సార్‌సీసీ నాయకులు వీరభద్రస్వామి స్పందిస్తూ… బాబుపాలన మొత్తం “దోచుకో – దాచుకో పథకం” ప్రకారం సాగుతోందని… తండ్రి చంద్రబాబు దోచేస్తుంటే, ఆయన కొడుకు లోకేష్‌ దాన్ని దాచేస్తున్నారని ఆరోపించారు. ఇదే సందర్భంలో మరింత వాయిస్ పెంచిన ఆయన… చంద్రబాబు గొప్ప నటుడని, ఆయనతో “మహా నటుడు” సినిమా తీయాలని అభిప్రాయపడ్డారు!

అనంతరం మైకందుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. 2014 సమయంలో మోడీతో బాబు చేసిన స్నేహం, ఇప్పుడు రాహుల్ కు రాస్తున్న ప్రేమ లేఖలపై తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక‍్తి అని.. ప్రధాని నరేంద్ర మోదీ బాత్‌ రూం నుంచి కాంగ్రెస్‌ పార్టీ జాతీయధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బెడ్‌రూంలోకి వెళ్లాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తి పార్టీ ఫిరాయింపులపై మాట్లాడటం హాస్యాస్పదం అని తెలిపారు!

ఇదే క్రమంలో నవనిర్మాణ దీక్ష పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాకు తెరతీశారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం విమర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన తమ్మినేని… ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, నాలుగేళ్లు ఏపీ ప్రజలను మోసం చేసి, ఇప్పుడు హోదా రాగం అందుకుని బీజేపీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు!

అనంతరం… ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు నీతి, నియమాలు లేవని.. కేవలం కుట్ర పూరిత రాజకీయాలు చేయడమే ఆయనకు అలవాటంటూ ఫైరయ్యారు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రస్తుతం గత్యంతరం లేని పరిస్థితుల్లో కాంగ్రెస్‌ నేతలకు చంద్రబాబు దగ్గరవుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిరుద్యోగ భృతి పై పెద్ది రెడ్డి స్పందించారు. కేవలం 10 లక్షల మందికి చంద్రబాబు నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారని.. ఆ 10 లక్షల మంది టీడీపీ కార్యకర్తలేనని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా పోరాటానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రమే అని పెద్ది రెడ్డి నొక్కి వక్కానించారు!

ఇదే క్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ… నవ నిర్మాణ దీక్ష పేరుతో చంద్రబాబు మళ్లీ కొత్త నాటకాలు మొదలుపెట్టారని విమర్శించారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాను ఉక్కుపాదంతో అణిచివేసిన చంద్రబాబు.. నేడు హోదా కావాలంటూ కూనిరాగం తీస్తూ మరోసారి ప్రజలను వంచించేందుకు తయారవుతున్నాడని ఆరోపించారు.