Home రాజకీయాలు సింగం సింగిల్ గా వస్తుంది!

సింగం సింగిల్ గా వస్తుంది!

SHARE

తమ అసమర్ధతను, తమ చేతకానితనాన్ని ఇతరులపై బురదజల్లడానికి ఎంచుకున్న విమర్శల్లో టీడీపీ నేతలు ఆరితేరిపోయారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఢిల్లీలో మోడీ.. ఏపీలో బాబు.. అభివృద్దే అభివృద్ది అని చెప్పుకుని తిరిగారు టీడీపీ నేతలు. నాలుగేళ్లు దోస్తు మేరా దోస్తు అనుకుంటూ తిరిగారు, తెరవెనుక లాలూచీ రాజకీయాలతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు. ఏమి జరిగిందో ఏమో… వాళ్లల్లో వాళ్లకు ఏమి తేడాలు వచ్చాయో ఏమో కానీ.. తాజాగా విడిపోయారు. పేరు ప్రత్యేక హోదాది అయినా… 2019లో ఏపీలో అత్యధిక సీట్లు బీజేపీ అడిగిందని, అందుకు బాబు ఒప్పుకోలేదని, అదే వారి మధ్య వైరానికి కారణం అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.. అది వేరే విషయం. ఈ క్రమంలో చేయాల్సిందంతా వీరు చేసి జగన్ పై బురద జల్లుతున్న పరిస్థితితులు గత కొన్ని రోజులుగా ఏపీలో నెలకొన్నాయి. ఈ క్రమంలో వైకాపా అధినేత జగన్ పై విమర్శలు చేస్తున్నవారికి, చెప్పాల్సిన సమాధానాలన్నీ ఒక్క మాటల్లో చెప్పేశారు వైకాపా నేతలు!

గత కొంత కాలంగా.. తాము చేసిన అసమర్ధ పాలన బురదను సైతం జగన్ కు ఆపాదించే నీచమైన రాజకీయాలకు తెరలేపిన టీడీపీ నేతలు… బీజేపీతో జగన్ కలిసి పోయారని, రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నారని, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఇలాంటి అనైతిక కబుర్లు చెప్పిన టీడీపీ నేతలకు వైకాపా నేతలు వాచిపోయే షాక్ తో కూడిన సమాధానం ఇచ్చారు! ఈ సమాధానం విన్న తర్వాత అయినా.. నీతి కలిగిన రాజకీయాలు చేసే వారెవరైనా ఇక జగన్ పైనా, వైకాపా పైనా అలాంటి విమర్శలు చేయరనే అనుకోవాలి.

విషయానికొస్తే… నెల్లూరులో వైసీపీ చేపట్టిన “వంచనపై గర్జన”కు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందె. ఈ క్రమంలో దీక్షకు ముఖ్య అతిధిగా పాల్గొన్న వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ… రాష్ట్రానికి జరిగిన అన్యాయ నేరం మొత్తం మోడీపై వేసేసి, బాబు తప్పించుకుందామనుకుంటున్నారని ఫైరయ్యారు. అటు ప్రధాని మోడీ, ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కలిసి.. ఈ ఇద్దరు నేతలు ఏపీ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. మోడీని వైకాపా నేతలు విమర్శించడం లేదన్న టీడీపీ విమర్శలకు ఈ దెబ్బతో చెక్ పడినట్లయ్యింది.

ఇదే క్రమంలో… కర్ణాటక ఎన్నికల అనంతరం చంద్రబాబు అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెప్పిన బీజేపీ ఇప్పుడు ఎందుకు తీసుకోవడం లేదని.. ఈ విషయంలో ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు అంబటి రాంబాబు. దీన్ని బట్టి చూస్తే… టీడీపీ – బీజేపీ లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని, కాని విమర్శలు మాత్రం వైకాపాపై చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మరింత క్లారిటీ ఇచ్చిన అంబటి… బీజేపీతో వైసీపీ కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని, రాబోయే ఎన్నికల్లో వైకాపా ఒంటరిగానే పోటీ చేస్తుందని అంబటి స్పష్టం చేశారు. దీంతో… అధికారం కొసం అడ్డదారులు తొక్కే ప్రసక్తి లేదని, అధికార కోసం అనైతిక పొత్తులకు తాము సిద్దంగా లేమని, తమ పార్టీకంటూ కొన్ని సిద్దాంతాలు, కొన్ని విలువలు ఉన్నాయని వైకాపా నిరూపించుకున్నట్లయ్యిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!!