Home రాజకీయాలు బాబును ఆ రేంజ్ లో హెచ్చరించిన పవన్!

బాబును ఆ రేంజ్ లో హెచ్చరించిన పవన్!

SHARE

రాబోయే ఎన్నికల్లో మొత్తం అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించిన జనసేన అధినేత.. నిన్నటి మిత్రుడు చంద్రబాబుపై గత కొంతకాలంగా విమర్శల వర్షాలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. విభేదాల అనంతరం తన ప్రతి ప్రసంగంలోనూ.. సమర్ధుడు అని నమ్మి గతంలో మద్దతు ఇచ్చామని, కాని ఇప్పుడు మాత్రం పరిపూర్ణమైన అవినీతిలో ప్రభుత్వం కూరుకుపోయిందని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నెలకొన్న బరితెగించిన అవినీతికి బాబు సూత్రదారి అయితే.. చినబాబు పాత్రదారి అన్న రేంజ్ లో పవన్.. టీడీపీని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబుకి హెచ్చరికలు కూడా జారీచేశారు పవన్.

ఉత్తరాంధ్రలో ప్రజలను పవన్ రెచ్చగొడుతున్నారని, ఏపీకి జరిగిన అన్యాయంపై పవన్‌ మాట్లాడారా అని, విభజన సమయంలో పవన్‌ ఏనాడైనా స్పందించారా అని విమర్శల వర్షాలు కురిపిస్తున్న చంద్రబాబుకు అదే రేంజ్ లో పవన్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్.. “ప్రభుత్వం అవినీతినే ప్రజలకు చెబుతున్నాను, ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నానని చంద్రబాబు అంటున్నారు. నేను రెచ్చగొడితే మీరు రోడ్లపై తిరగలేరు” అని హెచ్చరించారు. అవినీతి విషయంలో ప్రభుత్వ వైఖరి కొనసాగితే ఇలాగే తాను సహించబోమని హెచ్చరికలు పంపారు పవన్. ఈ రేంజ్ లో పవన్.. చంద్రబాబుని హెచ్చరిస్తుండటంతో.. జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

ఇదే క్రమంలో బాబు ప్రభుత్వంపై మరిన్ని విమర్శలు, ప్రశ్నలు సంధించిన పవన్… పరిశ్రమల పేరుతో భూములు లాక్కొంటున్నారని.. టీడీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే క్రమంలో భోగాపురం ఎయిర్‌ పోర్టు స్థల సేకరణపై కూడా పవన్ స్పందించారు. ఎయిర్ పోర్టుకు వేల ఎకరాలు అవసరమా? అంటూ పవన్‌ ప్రశ్నించారు. 17వేల కి.మీల రోడ్లు నిర్మించామని బాబు చెప్పుకుంటున్నారే కానీ.. ఇక్కడ అసలు రోడ్లే లేవని ఎద్దేవా చేశారు. బాబు చెప్పుకొస్తున్న అభివృద్ధి సంగతేమో కానీ… చంద్రబాబు ప్రభుత్వం మంచినీళ్లు ఇస్తే చాలని ఇక్కడి ప్రజలు అంటున్నారని పవన్ సెటైర్ వేశారు!

ఈ రేంజ్ లో పవన్ చెలరేగిపోతుంటే… టీడీపీ నుంచి సరైన కౌంటర్ ఇచ్చే నాయకులు కరువవ్వడం కొసమెరుపు! ఏది ఏమైనా చంద్రబాబు అవినీతిపై పవన్ ఎక్కుపెట్టిన బాణాలు ఏ రేంజ్ లో ఫలితాలను ఇస్తాయనఏది వేచి చూడాలి!!