Home రాజకీయాలు ముద్రగడ – మోత్కుపల్లి… ప్లాన్ ఇదేనా?

ముద్రగడ – మోత్కుపల్లి… ప్లాన్ ఇదేనా?

122
SHARE

ఏపీలో రాజకీయాలు రసవత్తర ప్రచారానికి తెరతీస్తున్నాయి. ఇందులో భాగంగా చంద్రబాబు అసమర్ధతపైనా, పెట్రేఇపోయిన అవినీతిపైనా, అటకెక్కించిన హామీలపైనా తన పాదయాత్రలో జగన్ విరుచుకుపడుతుంటే… మరో వైపు టీడీపీ పాతమిత్రుడు పవన్ కల్యాణ్.. బాబు పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. మరోపక్క బీజేపీ సైతం బాబు అసమర్ధతపైనా, అవినీతిపైనా విమర్శల దాడులు ఎక్కుపెడుతున్నాయి. ఈ రాజకీయాల మధ్య గత కొన్ని రోజులుగా పెద్దగా కనిపించని కాపు నాయకుడు ముద్రగడ తాజాగా టీడీపీ నుంచి బహిష్కృతుడైన సీనియర్ నేత మోతుకుపల్లి నర్సింహులును ఆయన నివాసంలో కలిశారు! దీంతో ఏపీలో బాబుకు మరో బల్లెం దిగబోతుందని ప్రచారం జరుగుతుంది.

ఈ మధ్యకాలంలో చంద్రబాబుపై ఈ రేంజ్ లో వ్యక్తిగతంగా విమర్శలు గుప్పించిన వాళ్లు, ప్రశ్నించవాళ్లు లేరనే రేంజ్ లో మోత్కుపల్లి చెలరేగిపోతున్నారు. బాబును టార్గెట్ చేస్తూ ఫైరవుతున్నారు. ఇదే క్రమంలో గతంలో ముద్రగడ కూడా ఇదే రేంజ్ లో బాబుపై నిప్పుల వర్షాలు కురిపించేవారు. తాజాగా వీరిద్దరూ కలవడం రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది. ఈ భేటీలో మోత్కుపల్లి పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపిన ముద్రగడ.. ఏపీలో కాపు ఉద్యమం – చంద్రబాబు దుర్మార్గపు పాలనపై తమ పోరాటానికి మోతుకుపల్లి మద్దతును కూడా కోరారు. ఇందులో భాగంగా మోత్కుపల్లి ఏపీలో పర్యటించాలని, యాత్ర చేపట్టాలని ముద్రగడ కోరారట. అందుకు తమ పూర్తి సహాయం అందిస్తామని మోత్కుపల్లి సానుకూలంగా స్పందించారని తెలుస్తుంది!

దీంతో రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో కులసమీకరణాలు పీక్స్ కి చేరిపోనున్నాయి. బాబు చేసిన దుర్మార్గ పాలన, అసమర్ధ పరిపాలన, అవినీతి పాలనకు వ్యతిరేకంగా అన్ని రకాలుగా ప్రత్యర్ధులు సిద్దపడుతున్నారని తెలుస్తుంది. ఏపీలో బలమైన సామాజిక వర్గాల్లో ఒకటైన కాపు సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉన్న ముద్రగడకు, దళితుల్లో కీలకమైన వర్గానికి చెందిన సీనియర్ నేతగా పేరున్న మోత్కుపల్లి తోడై.. ఏపీలో పర్యటించడం ద్వారా చంద్రబాబును మరింత ఇరకాటంలో పెట్టేందుకు అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో రాబోయే ఎన్నికల నాటికి బలమైన ఓటు బ్యాంకు ఉన్న ఈ రెండు సామాజిక వర్గాలు బాబుకు దూరం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఇప్పటికే దాదాపుగా దూరమయినట్లు చెబుతున్న ఆ రెండు సామాజిక వర్గాలు మరింత దూరం జరిగే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!!