Home రాజకీయాలు అసమర్ధ అనుభవాన్ని నమ్మమంటున్నారు!

అసమర్ధ అనుభవాన్ని నమ్మమంటున్నారు!

SHARE

బాబు పద్దతి చూస్తుంటే.. ప్రజలు చాలా అమాయకులు అనే ఆయన దైర్యం, నమ్మకం చూస్తుంటే… చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న ఒక కథ గుర్తుకువస్తుంటుంది. అనగనగా ఒక ఊరిలో ఒక బాలుడు పొలంలో ఆవులు మేపుతూ ఉంటాడు. చుట్టూ పొలంలో ఉన్న రైతులను ఆటపట్టించాలని.. పులి పులి అని అరుస్తుంటాడు. దాంతో కంగారు పడిన రైతులంతా కర్రలు తీసుకుని వస్తారు. అది చూసి పగలబడి నవ్వి ఆ బాలుడు.. పులి లేదు గిలి లేదు.. సరదాగా అన్నాను అంటాడు. అది విన్న రైతులు తిట్టుకుంటూ వెళ్లిపోతారు. మరుసటి రోజు కూడా ఆ బాలుడు అలానే అరుస్తాడు.. కంగారు పడి వచ్చిన రైతులను చూసి నవ్వుతాడు. కానీ… ఈ సారి మాత్రం నిజంగానే పులి వస్తుంది.. బాలుడు ఎంత అరిచినా రైతులు రారు.. పులి ఆవులను తినేస్తుంది! ఇందులో నీతి ఏమిటిరా అంటే… అబద్దం చెప్పి జనాలను పిచ్చి వాళ్లను చేయకూడదు అని! అలా చేస్తే.. జరిగేది ఇది అని!!

ప్రస్తుతం బాబు చేస్తున్న హడావిడి కూడా కాస్త అటు ఇటుగా అలానే ఉంది. గత ఎన్నికల్లో బాబు అందరికీ చెప్పిన విషయం… అనుభవం! తనకు పుష్కలమైన అనుభవం ఉందని, ఆ అనుభవంతో రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తానని. ఆ అనుభవం పాలనా సామర్ధ్యానికి సంబందించింది అని నమ్మిన జనం… ఓట్లేశారు! 4ఏళ్లు గడిచింది.. మరోసారి ఎన్నికలు రాబోతున్నాయి. అంటే… ఒక అవకాశం ఇచ్చిన ప్రజలకు, తన అనుభవంతో పాలన సాగించి, రాష్ట్రాన్ని కష్టాల బారినుంచి బయట పడేసి.. ఓట్లడగాలి! అది నిజమైన, అనుభవం కలిగిన నాయకుడి లక్షణం. కానీ… బాబు మాత్రం మరోసారి పులి పులి అని అబద్దపు అసమర్ధ వాదనను తెరపైకి తెస్తున్నారు. అదేమిటంటే… మరో సారి తన అనుభవం!

అవును.. ఇంతకాలం కొత్త రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి, తన పరిపాలనను చూపించి ఓట్లడగడం మానేసి.. తాను సీనియర్ ని కాబట్టి, తన అనుభవం రాష్ట్రానికి అవసరం కాబట్టి.. రాబోయే ఎన్నికల్లో కూడా తననే గెలిపించమని వేడుకుంటున్నాడు!! తాజా ప్రసంగాల్లో బాబు చెబుతున్న మాటలు ఇవే! “కొత్తవారు, అనుభవం లేనివారి మాటలు నమ్మొద్దు.. నేను చాలా అనుభవం కలిగిన నాయకుడిని.. నన్ను ఆశీర్వదించండి” అని! మరోసారి ఆ అబద్దపు మాటనే చెబితే.. ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్దంగా లేరని బాబు గ్రహించకపోవడం ఆశ్చర్యకరమే! గతంలో ఆ అనుభవాన్ని చూపించి ఓట్లు దండుకుని, అసమర్ధుడిగా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. మరోసారి ఆ అసమర్ధ అనుభవాన్ని నమ్మమని బాబు కోరడం చూస్తుంటే… ప్రజలు చాలా అమాయకులు అని బాబు గట్టి నమ్మకంతో ఉన్నట్లు కనిపిస్తుంది!!