Home రాజకీయాలు ఈ మాట రమణతో చెప్పించు బాబు!

ఈ మాట రమణతో చెప్పించు బాబు!

SHARE

ఏ రోటి కాడ ఆ పాట అనే సామెతకు కొత్త వెర్షన్ తీసుకొచ్చి అదే సిద్దంతాన్ని నమ్ముకుని ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు.. అదే.. రెండు కళ్ల సిద్దాంతం! ఈ సిద్దాంతం పేరు చెప్పి ఇప్పటికే ఏపీ వాసులను అడ్డంగా ముంచేయడం కీలక భూమిక పోషించిన చంద్రబాబు మరోసారి అదే సిద్దాంతాన్ని నమ్ముకుని, రెండు రాష్ట్రాల ప్రజలను వంచిస్తున్నారు! ఇందుకు వేదికైంది.. నవ నిర్మాణ దీక్ష! ఈ దీక్ష పేరు చెప్పి బాబు మొదలెట్టిన “ప్రభుత్వ ఖర్చులతో టీడీపీ ఎన్నికల ప్రచారం”… మరోసారి ఈ రెండు కళ్ల సిద్దాంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.

తెలంగాణ టీడీపీ మహానాడులో.. కేవలం బీజేపీని మాత్రమే విమర్శించి, కేసీఆర్ ఊసెత్తే సాహసం చేయని చంద్రబాబు… మరోసారి రాష్ట్ర విభజన, ఏపీకి జరిగిన అన్యాయంపై తనదైన రెండు నాళుకల ధోరణిని అవలంబిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న బాబు… రెండు జాతీయ పార్టీలు ఏపీకి తీరని ద్రోహం చేశాయని చెబుతూ.. జూన్ 2 చీకటి రోజని చెప్పుకొస్తున్నారు. రాష్ట్ర విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందని మొదలుపెట్టిన బాబు… అస్తులు తెలంగాణకు.. అప్పులు ఏపీకి ఇచ్చారన్నారు. నాడు ఏమైంది.. ఈ నాళుగేళ్లు ఏమైంది.. ఈ రాష్ట్రం పై ఉన్న ప్రేమ చంద్రబాబూ? అని ప్రశ్నిస్తున్న జనాలకు మాత్రం.. తాను మరోసారి కేంద్రప్రభుత్వం చేతిలో మోసపోయానని తన అసమర్ధతనను, తన చేతకాని తనాన్ని నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్నారు.

జూన్ 2 ని చీకటి దినం అని చెబుతున్న మాటలను.. టి. టీడీపీ అధ్యక్షుడు రమణతో చెప్పించే సాహసం బాబు చేయగలరా అనేది ఇక్కడ ప్రశ్న! నిజంగా రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగితే.. తెలంగాణ ఏర్పడటం వల్లే ఏపీ నష్టపోతే.. అందులో చంద్రబాబు పాత్ర ఏమీ లేకపోతే.. తెలంగాణలో తమ నాయకులతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఘనంగా చేయమని పిలుపునివ్వడం ఎందుకు? ఏపీకి వచ్చి.. ఇది బ్లాక్ డే అని చెప్పడం ఎందుకు? ఇవన్నీ గ్రహించిన వారు మాత్రం… తెలంగాణలో తెలంగాణ పాట, ఆంధ్రలో తెలంగాణకు వ్యతిరేకంగా పాట పాడుతూనే ఉన్న చంద్రబాబు పద్దతి ఇప్పుడు తారాస్థాయికి చేరిందని తెలంగాణవాదులతో పాటు.. ఏపీ వాసులు కూడా విమర్శించడం గమనార్హం!!