Home రాజకీయాలు నన్నపనేని రాజకుమారి పురుష ప్రేమ!

నన్నపనేని రాజకుమారి పురుష ప్రేమ!

65
SHARE

ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ నన్నపనేని రాజకుమారి.. పురుషులపై ప్రత్యేక అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు! దీనికి కారణమైన అంశం.. శ్రీకాకుళంలో భార్య చేతిలో దాడికి గురైన వ్యక్తికి సంబందించిన స్పందించిన సందర్భంగా మాట్లాడిన రాజకుమారి.. మగాళ్లపై జరుగుతున్న దాడులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోనని తమ తల్లితండ్రులకు చెప్పే ధైర్యం చేయలేని స్త్రీలు.. కట్టుకున్న భర్తను మాత్రం చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో మరో అడుగు ముందుకేసిన రాజకుమారి… పురుషుల రక్షణ కోసం ఒక కమిషన్ ఉండాలని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా స్పందించిన రాజకుమారి… ఉత్తరాంధ్రలో విజయనగరంలో భర్తను చంపించిన భార్య ఘటన, శ్రీకాకుళం జిల్లాలో భర్తపై హత్యాయత్నం వంటి ఘటనలు విస్తుగొలిపాయని వ్యాఖ్యానించారు. అనంతరం వాటన్నింటికీ కారణం కూడా పసిగట్టిన ఆమె… ఇలాంటి దాడులు జరగడానికి టీవీ సీరియల్స్‌ కారణం అని, వాటి ప్రభావం వల్లనే మహిళల్లో నేర ప్రవృత్తి పెరుగుతోందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సీరియల్స్‌ మీద కూడా సెన్సార్‌ పెట్టాలని ఆమె డిమాండ్‌ చేశారు.

ఇంతవరకూ బాగానే ఉంది, మహిళలపై అయినా, పురుషులపై అయినా దాడులు జరిగితే కచ్చితంగా స్పందించాలి!! కానీ… గుంటూరు జిల్లాలో, సెక్రటేరియట్ కు, చంద్రబాబు అద్దె ఇంటికి అత్యంత సమీపంలో మహిళలపైనా, బాలికలపైనా లైంగిక దాడులు జరిగినప్పుడు వైకాపా నాయకులు వెళ్లిన ఎప్పటికో కానీ.. నన్నపనేని రాజకుమారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ హోదాలో అందరికంటే ముందుగా స్పందించలేని విషయం ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. బాబు హయాంలో ఇప్పటివరకూ మహిళలపై జరిగిన అకృత్యాలు, పసుపు జెండాలు మెడలో వేసుకున్న వ్యక్తులు చేసిన మరెన్నో దారుణాలపై కూడా ఇప్పటికైనా విచారణ జరిపించి, శిక్షించాలని కోరుతున్నారు. పురుషుల రక్షణకు కమిషన్ ఉండాలని తపనపడుతున్న ఆమె… మహిళల రక్షణ విషయంలో కూడా కాస్త ఆలోచించాలని, ఈ దిశగా చంద్రబాబుకు సూచనలు చేయాలనేది పలువురి డిమాండ్!!

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… టీడీపీ నేతలు ఈ మధ్యకాలంలో “నేరం మాది కాదు” అనే సాకులు బాగానే వెతుక్కుంటున్నారు అనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ రోజు పురుషులపై దాడులు జరిగితే దానికి కారణం టీవీ సీరియల్స్ అని నన్నపనేని చెబుతుండగా… గతంలో మహిళలపై జరుగుతున్న దాడులకు కారణం… పోర్న్ సైట్స్ అని చంద్రబాబు స్పందించారు!! అధికారంలో ఉన్నవారు కూడా పరిష్కారాలు మాని, సాకులు వెతుక్కునే పనికి పూనుకుంటే.. ఎలాగ!!