Home రాజకీయాలు లాజిక్ మరిచిన జేసీ… అది కబ్జా చేసిన ఆస్తి!

లాజిక్ మరిచిన జేసీ… అది కబ్జా చేసిన ఆస్తి!

72
SHARE

మహానాడు చివరి రోజున మిగిలిన నేతల సంగతి కాసేపు పక్కన పెడితే… జేసీ దివాకర్ రెడ్డికి పూనకం వచ్చింది. భజన అంటే ఎలా ఉండాలో, ఏ రేంజ్ లో ఉంటే దన్ని వీర భజన అంటారో.. లైవ్ లో చూపించారు జేసీ! చంద్రబాబు.. దేశానికి ప్రధానమంత్రి కావాలి.. చంద్రబాబుకున్నంత దూరదృష్టి సమకాలికుల్లో ఎవ్వరికీ లేదు.. పీఎం అయ్యే అన్ని అర్హతలు చంద్రబాబుకి ఉన్నాయి.. అని ఆపకుండా భజన చేశారు. అక్కడితో ఆగారా… ‘లోకేష్‌కు సీఎం అయ్యే అన్ని అర్హతలున్నాయి. లోకేష్‌ ముఖ్యమంత్రి అవుతారు. దీనికి ఆయన సమర్థుడే అని మరోకటి వదిలారు! అవన్నీ కాసేపు పక్కన పెడితే… టీడీపీ అనేది చంద్రబాబు సొంత ఆస్తి అని లాజిక్ మరిచి మాట్లాడారు జేసీ!

ఆరునూరైనా.. నూరు ఆరైనా.. ఎప్పటికీ తెలుగు దేశం పార్టీ అనేది చంద్రబాబు సొంత ఆస్తి కాదు! ఎందుకంటే… చంద్రబాబును ఎన్టీఆర్‌ తన రాజకీయ వారసుడిగా ఏనాడూ ప్రకటించలేదు. అదే విదంగా తన తరువాత పార్టీ బాధ్యతలు చంద్రాబాబును తీసుకోవాలని కోరలేదు.. తీసుకుంటారని ఏనాడూ చెప్పలేదు. కాబట్టి… పార్టీ స్థాపించిన వ్యక్తి ప్రమేయం లేకుండా జరిగిన ఇది అధికారిక ఆస్తికాదు!! జేసీకి కూడా తెలిసిన కొన్ని వాస్తవాలు మాట్లాడుకుంటే… ఎన్టీఆర్‌ పై దౌర్జన్యం చేసిన చంద్రబాబు తన కుటిల రాజకీయ ఎత్తులతో పార్టీని బలవంతంగా కబ్జా చేశారని చెప్పుకోవాలి. అంతే తప్ప ఇది కష్టపడి సంపాదించిన ఆస్తి కాదు.. కబ్జా ఆస్తి!

ఇక్కడ జేసీ చెప్పిన మరో మాట… పార్టీ కోసం చాలా కష్టపడి బాబు నిర్మించారు అని!! ఇక్కడ గమనించాల్సింది ఒక విషయం ఏమిటంటే… ఎవరైనా ఒక వ్యక్తి ఒకరి ఆస్తిని కబ్జా చేసి… దాని చుట్టు గోడకట్టి, దానిపై కరెంటు కంచె పెట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ.. అందులో పంటలు పండించు కుంటు వచ్చిన ఫలాలు అనుభవిస్తూ ఉంటే… “పాపం ఆయన ఎంత కష్టపడి గోడ కట్టాడు, ఎంత కష్టపడి పంటపండిస్తున్నాడు.. కాబట్టి అది తన సొంత ఆస్తే” అంటారా? అత్యంత దౌర్భాగ్యమైన లాజిక్ అది!! టీడీపీ చంద్రబాబు ఆస్తి, దానికోసం చంద్రబాబు చాలా కష్టపడ్డారని జేసీ చెప్పిన లాజిక్ కూడా అలాంటిదే!