Home రాజకీయాలు నందమూరివారికి సమాధానం జేసీతో చెప్పించారా?

నందమూరివారికి సమాధానం జేసీతో చెప్పించారా?

SHARE

టీడీపీ మహానాడు నేటితో ముగుస్తున్న సందర్భంగా.. చంద్రబాబు చెప్పాల్సిన మాటలు, చెప్పలేని మాటలు, కొన్ని విమర్శలకు సమాధానాలు పరోక్షంగా ఇతర నాయకులతో చెప్పించే పనికి పూనుకున్నారు! ఇందులో భాగంగా… ఈమధ్య కాలంలో అత్యంత బలంగా వినిపిస్తున్న విమర్శల్లో ఒకటి… టీడీపీకి నిజమైన వారసులు నందమూరి వారని, ఈ పార్టీ నందమూరి వారి సొంతం అని! రామారావుకి వెన్నుపోటు పొడిచి, పార్టీని సొంతం చేసుకున్నారని! ఈ విమర్శలకు ఎప్పటినుంచో సమాధానాలు చెప్పాలని భావించినా.. సమాధానం చెప్పే సాహసం చేయలేదు చంద్రబాబు అండ్ టీడీపీ నేతలు. ఈ విమర్శలపై మాత్రం మౌనాన్నే తమ బాషగా చేసుకున్నారు. కానీ… తాజా మహానాడులో ఏదో రూపంలో ఆ విషయాలు బయటకు చెప్పించేశారు చంద్రబాబు!

ఈమధ్య కాలంలో కొడాలి నాని, వంశీల దగ్గర నుంచి మొదలు పెడితే… తాజాగా మోత్కుపల్లి వరకూ అంతా చేసే విమర్శ.. ఇది నందమూరి తారకరామారావు పెట్టిన పార్టీ.. ఆయన ఆలోచనల మేరకే ఈ పార్టీ నడవాలి, ఆయన ఆలోచనల మేరకే పార్టీ విధివిధానాలు ఉండాలని.. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి చేజిక్కించుకున్న పార్టీ ఎప్పటికైనా ఆయన వారసుల చేతికి వెళ్లాలని లేదా.. ఈ పార్టీలో నందమూరి వారసులకు పెద్దపీట వేయాలని! ఈ క్రమంలో ఇక ఈ బాదలు పడలేకో, లేక ఏదోలా తన కడుపులో విషయం.. కొంతమంది కార్యకర్తలకైనా చెప్పించాలని ప్రయత్నించిన బాబు… అందుకు సరైన వ్యక్తిగా జేసీ దివాకర్ రెడ్డిని ఎంచుకున్నట్లు కనిపిస్తుంది!

ఇందులో భాగంగా మహానాడులో మైకందుకున్న జేసీ దివాకర్ రెడ్డి… “మీ కుటుంబంలో వచ్చిన సంక్షోభాన్ని సరిదిద్దుకుని, మీ స్వశక్తితో, మీరు ఎంతో కష్టపడి, ఎంతో చెమటోడ్చి పార్టీని కాపాడుకున్నారు.. ఇది మీ కష్టార్జితం.. ఈ పార్టీ మీ సొంత పార్టీ, ఈ పార్టీ మీ ఆస్తి” అని చంద్రబాబుతో జనాల సాక్షిగా చెప్పేశారు. టీడీపీ చంద్రబాబు కష్టార్జితమని, ఇది బాబు ఆస్తి అని చెప్పవలసిన అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చిందనేది జేసీనే చెప్పాలి. ఎన్టీఆర్ ఫోటోకి దండేసిన టీడీపీ నేతలు, ఆయన విగ్రహం పక్కనే నిలబడి.. ఈ పార్టీ చంద్రబాబు ఆస్తి అని చెప్పడం ఎంత అనైతిక చర్యో వారే ఆలోచించుకోవాలి అనే కామెంట్స్ వినిపితున్నాయి.

అక్కడితో ఆగని జేసీ… భవిష్యత్తులో నారా లోకేస్ ముఖ్యమంత్రి అయితే తప్పేమిటని, అతను కేపబుల్ కాదా అని ప్రశ్నించడానికి సైతం వెనుకాడలేదు! ఈ విషయాలన్ని గమనించిన వారు మాత్రం… ఇక ఈ దెబ్బతో అయినా తెలుగుదేశానికి నందమూరి వారికి ఏమీ సంబందం లేదని, ఇది పూర్తిగా నారావారి సొంత ఆస్తి అని చెప్పించే పనికి బాబే పూనుకున్నారో లేక, అధినేత మెప్పుకోసం జేసీ ఈ పలుకులకు తెరతీశారో తెలియదు కాని… ఈ కామెంట్స్ పై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి!