Home ప్రత్యేకం మచ్చపోతుంది… బాబుకు ఇదే సువర్ణావకాశం!

మచ్చపోతుంది… బాబుకు ఇదే సువర్ణావకాశం!

SHARE

అవకాశాలు అస్తమానంరావు.. అవి వచ్చినప్పుడే వినియోగించుకోవాలి.. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలాంటి సువర్ణావకాశమే వచ్చింది. ఇంతకాలం తనపై ఉన్న ముద్రను చెరిపేసుకోవడానికి.. తనకూ సత్తా ఉందని నిరూపించుకోవడానికి మునుపెన్నడూ రానంత రెంజ్లో ఒక సువర్ణావకాశం బాబుకు వచ్చింది. అది స్వయంకృతాపరాధం వల్ల వచ్చిందా.. లేక పరిస్థితుల ప్రభావం వల్ల వచ్చిందా అనే విషయం కాసేపు పక్కన పెడితే.. తన నాలుగు దశాబ్ధాల రాజకీయ చరిత్రలో తనకంటూ గొప్పగా చెప్పుకునే అవకాశం వచ్చింది.. అదే 2019 ఎన్నికలు!

అవును… బాబుపై ఇంతకాలం ఉన్న అతిపెద్ద భారీ విమర్శ.. ఉప ఎన్నికలా, సార్వత్రిక ఎన్నికల అనే తేడా లేకుండా.. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చేయలేరు అని. 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తికి ఇది కచ్చితంగా అవమానకరమైన విషయమే. గతంలో కమ్యునిస్టుల రూపంలోనో, బీజేపీ రూపంలోనో, మహా కూటమి పేరు చెప్పో బాబు ఎవరో ఒకరి అండతో గట్టెక్కి.. ఏరు దాటాక వారిని దూరం పెడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీతో పొత్తు తాను చేసిన చారిత్రక తప్పిదం అన్న చంద్రబాబే… వెళ్లి వాళ్ల పంచన చేరిన వైనం 2014లో అంతా చూశారు. సరే అప్పుడు రాష్ట్రం విడిపోయిందని, మోడీ మేనియా పనిచేస్తుందని, కాంగ్రెస్ అన్యాయం చేసింది కాబట్టి మోడీని నమ్ముకున్నానని చెప్పుకుని సర్ధుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇంటికెళ్లి కూడా మద్దతు తీసుకున్నారు.

అయితే… కాలం మారింది, మరో సారి మరలా ఎప్పుడూ కలవనంత దూరంలో బీజేపీ కి టీడీపీకి చెడిండి! ఇక జనసేన ఒంటరి పోరుకు తహతహలాడుతుంది. ఏపీ రాజకీయాల్లో ఆటలో అరటిపండుల్లా మిగిలిపోతున్నారు అనే విమర్శను మూటగట్టుకున్న కమ్యునిస్టుల పరిస్థితి ప్రస్తుతానికి చెప్పేలా లేదు. ఈ క్రమంలో రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది కాబట్టి.. ఇంక చంద్రబాబుకు ఏమాత్రం నీతి ఉన్నా కూడా వాళ్లతో కలిసే అవకాశాలు లేవని ఏపీ వాసుల నమ్మకం. పైగా టీడీపీ పెట్టిందే… కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కాబట్టి… బాబు అంత అనైతిక చర్యకు పూనుకుంటారని అనుకోరు తమ్ముళ్లు. ఈ క్రమంలో కచ్చితంగా ఇది బాబుకు సువర్ణావకాశమే.

తన అనుభవంతో.. 2014 నుంచి ఇప్పటివరకూ చాలా బాగా అభివృద్ది చేశామని చంద్రబాబు చెప్పుకుంటున్న క్రమంలో.. తన పరిపాలననే మిత్రపక్షంగా భావించి.. 2019లో చంద్రబాబు ఒంటరిగా జనాల్లోకి వెళ్లాలని, ఈసారైనా ఒంటరిగా పోటీచేసి, చరిత్రలో తనపై ఉన్న మచ్చను తొలగించుకోవాలని చంద్రబాబు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఎందుకంటే… ఇంత దౌర్భాగ్యమైన విమర్శ వారి నాయకుడికి ఉంటే.. అది వారికి మాత్రం సంతోషం కాదు కదా! అయితే… బాబు వారి మాటలు వింటారా.. తనకు అంత ధైర్యం, ఆత్మవిశ్వాసం, సామర్ధ్యం ఉన్నాయని నమ్ముతారా? లేక.. తనకు తోడు లేకపోతే ఈదలేను, గట్టెక్కలేను అని ఎవరొకరి పంచన చేరిపోయి, తనపై ఉన్న మచ్చను ఇంక జీవితాంతం ఉంచుకుంటారా అనేది వేచి చూడాలి!!