Home రాజకీయాలు బాబు భయానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇది!

బాబు భయానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇది!

SHARE

ఒక రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న ఏపార్టీ అయినా విమర్శించాలి అంటే.. సమస్యలను గురించి ప్రస్థావించాలంటే.. ముందుగా ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీని టార్గెట్ చేయాలి. అబ్బే.. అలాంటి సమస్యలేమీ లేవు, పాలన చాలా బాగుంది అంటే గనుక.. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాలి. ఈ రెండూ చేయలేనప్ప్పుడు.. మౌనంగా ఉండటంకంటే బెటర్ ఇంకొకటి ఉండదు. కానీ.. చంద్రబాబు అలాంటి పనులేమీ చేయలేదు. తనదైన రాజకీయ జ్ఞానాన్ని తాజాగా బయటపెట్టే క్రమంలో… తనకు కేసీఆర్ అంటే ఎంత భయమో, ఆ పేరు చెబితే ఎంత వణుకో చెప్పకనే చెప్పారు!

తెలంగాణలో జరిగిన టీడీపీ మహానాడులో చంద్రబాబు నాయుడు తెగ ప్రసంగించారు. హైదారాబాద్ ని తానే అభివృద్ది చేశాను కాబట్టి, టీడీపీ హైదరాబాద్ లోనే పుట్టింది కాబట్టి.. టీడీపీని గెలిపించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలది అంటూ కొత్త లాజిక్కులతో ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ గెలవడం చారిత్రక అవసరమనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరిచిన బాబు… ఆ చారిత్రక అవసరం తెలంగాణ ప్రజలకా, చంద్రబాబుకా అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేకపోయారనుకోండి.. అది వేరే విషయం! ఈ క్రమంలో గతంలో ఎప్పుడు మహానాడు పెట్టినా.. తెలంగాణ ప్రభుత్వంపైనా, కేసీఆర్ పైనా అంతెత్తున లేచే చంద్రబాబు.. ఈసారి మచ్చుకైనా కేసీఆర్ పేరెత్తే సాహసం చేయలేకపోయారు.

తెలంగాణలో మూడోస్థానంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఏకదాటిగా విమర్శించారు. కాంగ్రెస్ ను కూడా పెద్దగా టచ్ చేసింది లేదు. సరే ఆ సంగతులు ఎలా ఉన్నా పర్లేదు కానీ… బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తోందని తెలంగాణలో బీజేపీ అధికారంలో ఉన్నట్టుగా విమర్శిస్తున్న చంద్రబాబు… కేసీఆర్ ప్రభుత్వంపై ఒక్క మాటకూడా మాట్లాడే సాహసం చేయలేకపోయారు. అలా ఎందుకు అనుకోవాలి… పాలన బాగున్నప్పుడు ఎందుకు విమర్శించాలి అనుకుంటే… అలాంటప్పుడు ఇంక టీడీపీని గెలిపించాల్సిన అవసరం ఏముంది. కేసీఆర్ పాలన బాగోనప్పుడు, అవినీతిమయమైపోయినప్పుడు కదా… మరో ప్రత్యామ్న్యాయం అవసరం! అలా కానప్పుడు ఇంక టీడీపీ అవసరం తెలంగాణ ప్రజలకు ఏముంది.

తెరచి చూస్తే.. కాస్త నిశితంగా గమనిస్తే.. తెలంగాణలో సభలు పెట్టినా, ఊరూరా తిరిగినా కూడా ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం.. కేసీఆర్ ను విమర్శించే ధైర్యం చేయలేరు. ఎందుకంటే… ఓటుకు నోటు విషయంలో బాబు పిలక కేసీఆర్ చేతిలో ఉందనేది అందరికీ తెలిసిన విషయమే! ఈ విషయం తెలిసిన బాబు.. కేసీఆర్ ను విమర్శిస్తారని, కనీసం ముఖస్తుతికోసం అయినా ఒక్క మాటైనా అంటారని తమ్ముళ్లు భావించడం అత్యాశే!!