Home రాజకీయాలు నేటి అసమర్ధుడు రేపు మాత్రం కాడా?

నేటి అసమర్ధుడు రేపు మాత్రం కాడా?

66
SHARE

ఈ మధ్యకాలంలో ఏ వేదికపై మైకందుకున్నా కూడా చంద్రబాబు అత్యంత ప్రధానంగా చెప్పేమాట… ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే, టీడీపీకి వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు గెలవాలని! ఆ రకంగా ఏపీ ప్రజలు మరోసారి బాబు సమర్ధతపై నమ్మకం ఉంచి (ఒక్కటి కూడా తగ్గకుండా) ఉన్న పాతిక ఎంపీ సీట్లు ఇచ్చి వదిలితే గనుక.. వెంటనే ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని. ఈ విషయంపై తాజాగా జరుగుతున్న రాజకీయ విశ్లేషణల్లో… అసమర్ధత అనే పదం బాగా పాపులర్ అవుతుంది.

వివరాళ్లోకి వెళితే… రాబోయే ఎన్నికల సంగతి, అప్పుడు గెలవబోయే పాతిక ఎంపీసీట్ల సంగతి కాసేపు పక్కన పెడితే. అదంతా హోదా పేరు చెప్పి బాబు చేస్తున్న రాబోయే ఎన్నికల ప్రసంగం అనే విషయం కూడా కాసేపు పక్కన పెడితే… ప్రస్తుతం చంద్రబాబుకు అధికారికంగా, అనధికారికంగా కలిపి 20 ఎంపీ సీట్లున్న మాట వాస్తవం. అంటే… బాబు అడుగుతున్న వాటికంటే 5 సీట్లు మాత్రమే తక్కువ. ఈ విషయం జనాలకంటే బాగా ఎక్కువగా బాబుకే తెలుసు. 20 ఎంపీ సీట్లు అనేది చిన్న విషయం కాదు. ఎలా ఆ నెంబర్ చేరినా కూడా ఏపీ ప్రజలు చంద్రబాబుకు 20 ఎంపీ సీట్లు గెలిపిస్తే… ఏమీ చేయలేకపోయాను, బీజేపీ మోసం చేసింది, నమ్మకద్రోహం చేసింది, కుట్ర రాజకీయం చేసింది అని చెప్పుకొస్తున్న వైనం. రేపు 25 ఇస్తే మాత్రం చేయరని గ్యారంటీ ఉందా?

ఇప్పుడు ఇంకా వైకాపాకి కనీసం ఐదు సీట్లయినా ఉండబట్టి.. ఢిల్లీ వీదుల్లో ప్రత్యేక హోదా నినాదం తారాస్థాయికి చేరింది. అప్పుడే గనుక ఏపీ ప్రజలు బాబు అండ్ కో మాటలు పూర్తిగా నమ్మి మొత్తం ఎంపీ స్థానాలు బాబుకే ఇస్తే గనుక… ఈ రోజు ప్రత్యేక హోదా నినాదం మచ్చుకు కూడా వినిపించేది కాదు!! అంతమట్టుకు అదృష్టమనే అనుకోవాలి. ఈ క్రమంలో హోదా పోరాటం కోసం రండి అని బాబు పిలిస్తే వైకాపా ఐదుగురు ఎంపీలు కూడా రెక్కలు కట్టుకుని వాలిపోతారు.. ప్రాణాలకు సైతం తెగించి (ఆ విషయం ఇప్పటికే నిరూపణ అయిన సంగతి తెలిసిందే) పోరాడగలరు!

ఈ విషయం జనాలకు తెలియదనేది బాబు ఉద్దేశ్యమో లేక తనకు మాత్రమే భారీ స్థాయిలో జ్ఞానం ఉందనే నమ్మకమో కానీ… ఇలాంటి కబుర్లు చెబుతున్నారు. తన అసమర్ధతను.. బీజేపీ మోసంగా అభివర్ణిస్తున్న బాబు… రాబోయే ఎన్నికల అనంతరం మాత్రం తన అసమర్ధతను మరో కేంద్ర ప్రభుత్వంపై నెట్టరని గ్యారెంటీ ఏమైనా ఉందా అంటే? సమాధానం చెప్పే నాధుడే కరువైన పరిస్థితి! ఒకవేల నిజంగా బీజేపీ చంద్రబాబుని మోసం చేసిందనే అనుకుంటే.. రేపు మాత్రం మోసం చేయదని గ్యారెంటీ ఏమిటి? కలిసి పోటీ చేసిన బీజేపీనే మోసం చేసినప్పుడు, కాంగ్రెస్సో, తృతియ ఫ్రంటో చేయదని గ్యారెంటీ ఏమిటి? ఈ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే… కేంద్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఏపీలో టీడీపీకి ఎన్ని ఎంపీ సీట్లు ఇచ్చినా కూడా.. అసమర్ధ చంద్రబాబు ఏపీకి హోదా తేలేరనేది పలువురి అభిప్రాయంగా ఉంది.