Home రాజకీయాలు కర్ణాటక ఫలితాలపై బాబు మార్కు కామెంట్!

కర్ణాటక ఫలితాలపై బాబు మార్కు కామెంట్!

SHARE

ప్రపంచంలో ఎక్కడ ఏ విషయం జరిగినా.. దానివల్ల తనకు క్రెడిట్ రావాలని.. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ పని జరగడానికి తానే కారణం అని చెప్పుకోవడంలో ఏమాత్రం వెనకాడరు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. జనాలు ఏమనుకుంటారు అనే విషయం ఆయనకు ఏమాత్రం పట్టదు.. నవ్వి పోదురుగాక అయినా సరే తాను తగ్గేది లేదని బాబు ఆలోచనగా కనిపిస్తుంటుంది. నాలుగేళ్లు బీజేపీతో స్నేహం చేసిన బాబు… వారు రాబోయే ఎన్నికలో ఏపీలో కాస్త ఎక్కువ సీట్లు అడిగే సరికి.. హోదా పేరు చెప్పి దూరం పెట్టారని కామెంట్స్ వస్తున్న తరుణంలో.. బీజేపీతో శతృత్వం అంశం తెరపైకి తెచ్చారు. అది రాష్ట్ర ప్రయోజనలాకోసం అని కలరింగ్ ఇస్తున్నారు. ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా బీజేపీ దేశంలో ఎక్కడ ఓడిపోయినా ఆ క్రెడిట్ తనదే అని చెప్పేసుకుంటున్నారు!

రసవత్తరమైన రాజకీయ పరిణామాల నడుమ కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ ల కూటమి అధికారం చేపట్టింది! అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి.. కేవలం 38సీట్లు వచ్చిన జేడీఎస్ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవడానికి, అక్కడ జరిగిన రాజకీయాలు వేరు.. రాజకీయ పరిస్థితులు, పరిణామాలు పూర్తిగా వేరు. ఈ క్రమంలో అక్కడేదో బీజేపీకి 38సీట్లు మాత్రమే వచ్చాయి అన్న రేంజ్ లో బాబు కలరింగ్ ఇచ్చుకుంటున్నారు. కర్ణాటక ప్రజలు బీజేపీని ఓడించారు అనేది బాబు వాదనగా ఉంది.

కర్ణాటకలో ఉన్న తెలుగు వారికి తాను పిలుపునిచ్చానని, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీకి బుద్ది చెప్పాలని కోరానని, తన పిలుపు మేరకు కర్ణాటకలో ఉన్న తెలుగువారు బీజేపీకి అధికారం రాకుండా చేశారని చెప్పుకొచ్చారు. అసలు కర్ణాటకలో తెలుగువారు బాబు మాట వింటే… అక్కడ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎందుకు అవతరించిందో బాబే చెప్పాలి. పైగా అక్కడ జేడీఎస్ అధికారంలోకి రావడానికి తన పాత్ర కీలకమని, దేవెగౌడను ప్రధాని చేయాలని తానే గతంలో తీర్మాణించానని చెప్పుకొస్తున్నారు.

వినేవాడు ఆంధ్రుడైతే చెప్పేవాడు చంద్రబాబు అన్న చందంగా చెలరేగిపోతున్న బాబు… కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కారణం తానేనని, తన పిలుపు విన్న వారని చెప్పడం ఆశ్చర్యం కాక మరేమిటి!!