Home రాజకీయాలు ఈ జ్ఞానం 2014లో ఏమైంది పవన్?

ఈ జ్ఞానం 2014లో ఏమైంది పవన్?

82
SHARE

జనంకోసం, జనాల కష్టాలు తెలుసుకోవడం కోసం అంటూ జనసేన పోరాట యాత్ర ప్రారంభించిన పవన్ కల్యాణ్… యాత్ర మొత్తం బీజేపీకి తనకు సంబందం లేదు అని చెప్పడానికి ఎక్కువ సమయం కేటాయించవలసి వచ్చింది. ఇదే క్రమంలో టీడీపీ నేతలు, చంద్రబాబు చేస్తున్న ప్రతీ విమర్శపైనా.. బాబు పై పవన్ వ్యంగ్య బాణాలు, సూటైన విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగా బాబు అపార అనుభవంపై పవన్ తనదైన సెటైర్ వేశారు.

చంద్రబాబుకున్న నాలుగు దశాబ్ధాల అనుభవం ఉంది.. అది ఒప్పుకుంటాను.. కాని ఆ అనుభవం ఎందుకు ఉపయోగపడింది.. ఆ అనుభవం ఎందులో ఉంది.. ప్రజలను వంచించడంలోనా.. అవినీతికి పాల్పడటంలోనా అనేది జనసేనాని ప్రశ్నలు! ఇంతవరకూ బాగానే ఉంది కానీ… 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇదే పవన్… అనుభవం ఉన్న నేత రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి.. ఈ పరిస్థితుల్లో అది అత్యవసరం అని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నాలుగేళ్లూ తీసేస్తే.. నాటి ఎన్నికల సమయానికి చంద్రబాబుకు 36ఏళ్ల అనుభవం ఉందనే విషయం పవన్ కు తెలియదా? ఆ అనుభవం మామను వెన్నుపోటు పొడవడం దగ్గరనుంచి మొదలుపెడితే.. జనాలను వంచించడాలతో నిండి ఉందనే విషయం నాడు పవన్ కు తెలియదా? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు పవన్ కు ఎదురవుతున్నాయి. నాలుగేళ్ల క్రితం చంద్రబాబేమీ సచ్చీలుడు కాదు, ఇప్పుడు కొత్తగా మారిపోయిన మనిషి కాదు. నాడు నేడు ఎప్పుడూ చంద్రబాబు రాజనీతిజ్ఞత అందరికీ తెలిసిందే. చంద్రబాబు మోసాలు, వెన్నుపోటుల గురించి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో పవన్ తాజాగా సొంత కుంపటి పెట్టే సరికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు.

పవన్ కు ఇప్పుడొచ్చిన జ్ఞానం.. 2014లోనే ఉండి ఉంటే.. నేడు రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉండేది కాదనేది పలువురి అభిప్రాయంగా ఉంది. నాడు పవన్ వెనకా ముందూ ఆలోచించకుండా చేశారో లేక నాటి పరిస్థితులు అలా ప్రలోభపెట్టాయో ఏమో కానీ.. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గట్టేక్కించే విషయంలో పవన్ ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే మాత్రం.. కచ్చితంగా నేడు రాష్ట్రం ఈ పరిస్థితుల్లోకి నెట్టబడేది కాదనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ఈ విషయాలపై పవన్ జనాలకు చెప్పబోయే క్షమాపణలతో కూడిన సమాధానం ఏమిటో అన్నది వేచి చూడాలి మరి.