Home రాజకీయాలు స్క్రిప్ట్ రాస్తే ఆడటానికి పవన్ కల్యాణేం బొమ్మ కాదు

స్క్రిప్ట్ రాస్తే ఆడటానికి పవన్ కల్యాణేం బొమ్మ కాదు

SHARE

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఏర్పాటుచేసిన సభలో పవన్ మాట్లాడుతూ.. టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించారు.  2014 ఎన్నికల్లో టీడీపీకి అనుభవం ఉందని నమ్మానని.. టీడీపీ నుంచి ఏ పదవి, కాంట్రాక్టులు తాను కోరుకోలేదన్నారు. హామీలివ్వడం మాత్రం టీడీపీకి అలవాటైందని ఎద్దేవా చేశారు.

వచ్చే ఎన్నికల్లో తాను గెలుస్తానో లేదో తెలియదని, అయితే ప్రజలను మాత్రం మోసం చేయనని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.  తమకు ఆర్గనైజేషన్ లేదని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు కానీ జనసైనికులంతా ఓ వ్యవస్థీకృత సంస్థలాగ పని చేస్తుందని తెలిపారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నిజంగా అమలవుతాయా అని అడిగితే.. తనను నమ్మాలంటూ ఏపీ సీఎం సూచించినట్లు చెప్పారు.

‘రాజకీయ పార్టీని స్థాపించడంలో చాలా కష్టాలుంటాయి. అంతేందుకు ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు సైతం పార్టీని స్థాపించలేదు. దివంగత నేత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే అందులోకి చంద్రబాబు వెళ్లారు. జనమే నా బలం. హెరిటేజ్‌లాగా నాకు ఓ సంస్థ అంటూ ఏదీ లేదు. అయినా ముందడుగు వేశాను. రెండేళ్లూ పనిచేశాక రాజకీయాలపై అవగాహన వచ్చింది. డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదు. సేవ చేయడానికి వచ్చాను. మీ కష్టాలు అర్ధం చేసుకుంటాను. గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చారు. నెగ్గిన అనంతరం చంద్రబాబు వెనుకబడిన ఉత్తరాంధ్రకు అండగా ఉంటారని భావించా. కానీ అలా జరగలేదు.

పుష్కరాలకు 2వేల కోట్లు ఖర్చు చేశారు. విదేశీ పర్యటనలకు టీడీపీ ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ కిడ్నీ రోగులకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. సోంపేటలో రొయ్యల చెరువు పేరుతో కాలుష్యం చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌లోనూ మొండిచేయి చూపారు. నేను మాత్రం సమస్యల మీద నిజాయితీగా మాట్లాడుతా, పోరాడుతా. ఇప్పటికీ శ్రీకాకుళం ఇంకా వెనుకబడి ఉంది. కిడ్నీ రోగుల కోసం హార్వర్డ్ యూనివర్సిటీ వైద్యులను తీసుకొస్తే ఆ నివేదికను పక్కన పడేసారు. ఇష్టానికి మమ్మల్ని బెదిరిస్తే తిప్పికొడతాం. 3లక్షల మంది మత్స్యకారుల జీవితాలు అగమ్యగోచరంగా ఉన్నాయంటూ’ పవన్ ఆందోళన వ్యక్తం చేశారు.

పవన్‌ ప్రసంగంలోని మరిన్ని అంశాలివే..

 • ప్రత్యేక హోదాపై బీజేపీని కాకినాడలో నిలదీసింది జనసేన పార్టీనే. బీజేపీలోకి అమిత్ షా ఆహ్వానించినా వెళ్లలేదు
 • స్పెషల్ ప్యాకేజీ అంటే సన్మానాలు చేసిందెవరో అందరికీ తెలుసు. ప్రజలను వంచించడంలో చంద్రబాబుకు అపారమైన అనుభవం ఉంది
 • ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు రకరకాలైన మాటలు మార్చారు. ఓటుకు కోట్లు కేసు పేరు చెబితే చంద్రబాబు భయపడుతున్నారు
 • 2019లో 175 స్థానాల్లో పోటీ చేస్తాం.
 • 10-15 సీట్లు పడేస్తే మా వెంట తిరుగుతారని టీడీపీ మమ్మల్ని కించపరుస్తోంది
 • శత్రు వర్గాలకు ఏ సమస్య వచ్చినా సహాయం చేసే వ్యక్తులం
 • టీడీపీ కులాల మధ్య అంతరాలు సృష్టించే యత్నం చేస్తోంది.
 • గంగపుత్రులకు, అడవి పుత్రులుకు అమలు చేయలేని హామీలెందుకు ఇచ్చారు?
 • బీజేపీ చాలా తప్పులు చేసింది. ప్రజలు విశ్వాసం కోల్పోయారు
 • బీజేపీ స్క్రిప్ట్ రాస్తే ఆడటానికి పవన్ కల్యాణేం బొమ్మ కాదు
 • జాయింట్ ఫ్యాక్ట్స్‌ కమిటీ పెట్టి లెక్కలు తేల్చాం. ఎవరిది ధర్మపోరాటం.. టెంట్లో కూర్చుని చేసిది ధర్మ పోరాటమా. రోడ్లపై చేసేది ధర్మ పోరాటం
 • కేంద్రం మోసం చేసింది.. అందుకే అన్ని నియోజకవర్గాల్లో నిరసన
 • 175 నియోజక వర్గాల్లో నిరసన అయ్యాక ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటా..
 • అగ్రి గోల్డ్ వ్యవహారంలో రిఫరెండం పెడతాం. ఆస్తులు విక్రయించి డిపాజిట్ దార్లకు నగదు తిరిగి చెల్లించి న్యాయం చేయాలి