Home ప్రత్యేకం మాటలకు చేతలకు ఇంత తేడానా?

మాటలకు చేతలకు ఇంత తేడానా?

85
SHARE

కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్.. అని ఎవరైనా పవన్ విషయంలో వ్యవహరిస్తే, వెంటనే అంతెత్తున లేస్తుంటారు పవన్! తనకు కులాలు మతాలు లేవని, తాను కులమతాలకు అతీతుడిని అని చెప్పుకొస్తుంటారు. ఇదే నిజమైతే అది కచ్చితంగా అభినందనీయమే. కులాన్ని, మతాన్ని పట్టించుకోని వారిని.. కుల చట్రంలోకి లాగాలని ఎవరు ప్రయత్నించినా అది ఏ మాత్రం హర్షనీయం కాదు. అలాంటి ప్రయత్నాల్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే… ఇలాంటి మాటలు చెప్పిన వ్యక్తి చేస్తున్న పనుల్లో ఆ వాసనలు ఏమాత్రం రాకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ… పవన్ మాత్రం ఆ చట్రంలోనుంచి మాటల్లో బయటకు వస్తున్నారు తప్ప చేతల్లో రావడం లేదనడానికి తాజా ఉదాహరణ వెలుగులోకి వచ్చింది.

పవన్ చుట్టూ ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు మాత్రమే ఉన్నారన్నది ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట కాగా.. ఆయనకు సలహాలు ఇచ్చే వారి దగ్గర నుంచి.. ఈ మధ్యనే తన రాజకీయ వ్యూహకర్త అంటూ పరిచయం చేసిన వ్యక్తితో పాటు.. పవన్ తనకు సూచనలు ఇచ్చేందుకు నియమించుకున్న వారిలో అత్యధికులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో కులం విషయంలో పవన్ అదే పనిగా చెప్పే మాటలకు.. చేసే పనులకు మధ్య తేడా కొట్టిచ్చినట్లు కనిపిస్తున్న మాటను పలువురు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.

దీనికి బలం చేకూరేలా తాజాగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా తోట చంద్రశేఖర్ ను నియమిస్తూ పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. తాను తీసుకున్న నిర్ణయానికి సంబంధించి అధికారికంగా ప్రకటనను కూడా విడుదల చేశారు. పరిపాలనాధక్షుడిగా.. పారిశ్రామికవేత్తగా విజయం సాధించినట్లుగా చెప్పే తోట చంద్రశేఖర్ సామాజిక వర్గం ఏమిటనేది అందరికీ తెలిసిన విషయమే. దీంతో మరోసారి పవన్ కు ఆ ముద్ర పడిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఇటీవల కాలంలో పార్టీ నియామకాలన్నీ ఒకే సామాజిక వర్గానికి చెందినవనే విమర్శకు మరింత బలం చేకూరినట్లయ్యింది.

మరి.. పవన్ ఈ విషయాలపై జనాలకు క్లారిటీ ఇచ్చే పనికి పూనుకుంటారా లేక.. తన పంధాలో తాను కొనసాగుతారా అనేది వేచి చూడాలి.