Home రాజకీయాలు ఆ విషయంలో మౌనమే బెటర్ బాబు!

ఆ విషయంలో మౌనమే బెటర్ బాబు!

SHARE

కర్ణాటక పరిణామాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ దాన్ని ఆదర్శంగా తీసుకుని ఆ రాష్ట్ర గవర్నర్‌ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా వ్యవహరించాలి.. గవర్నర్ ల వ్యవస్థ కర్ణాటక సాక్షిగా దుర్వినియోగం అవుతుంది.. రాజకీయ కాంక్ష కోసం రాష్ట్రాలను బీజేపీ భ్రష్టు పట్టిస్తుంది.. ప్రజాస్వామ్యానికి ఇది చెడ్డపేరు తీసుకొస్తుంది.. రాజ్యాంగాన్ని అవహేళన చేయడం బీజేపీకి మంచిది కాదు.. ఇలాంటి మాటలన్నీ మరేనాయకుడైనా అన్నారంటే అతిశయోక్తి కాకపోవచ్చేమో కానీ… ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు! ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు బాబుపై ప్రశ్నల వర్షాలు కురిపిస్తూ సెటైర్స్ వేస్తున్నారు.

గవర్నర్ వ్యవస్థ భ్రష్టు పట్టించడం గురించి చంద్రబాబు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని కొందరు ధ్వజమెత్తుతుంటే.. కర్ణాటక పరిణామాలతో దేశంలో ప్రజాస్వామ్యం పతనమవుతోందని బాబు ఆవేదన వ్యక్తం చేయడం మామూలు హాస్యం కాదని మరికొందరు సెటైర్స్ వేస్తున్నారు. నెటిజన్లు అన్నారని, సోషల్ మీడియాలో సెటైర్స్ పడుతున్నాయని కాదు కానీ… ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోవడం, అప్రజాస్వామిక చర్యలకు పాల్పడటం వంటి విషయాల గురించి.. చంద్రబాబు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదనే కామెంట్స్ మాత్రం బలంగా వినిపిస్తున్నాయి.

మచ్చుకు ఒక ఉదాహరణ తీసుకుంటే… 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల్ని తన పార్టీలో అనైతికంగా, అప్రజాస్వామికంగా చేర్చుకున్న చంద్రబాబు.. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం అత్యంత దారుణమనే చెప్పాలి. పైగా అనైతికంగా పక్క పార్టీనుంచి లాక్కున్న వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టిన చరిత్ర బాబు సొంతం. ఇక వైకాపా ఎమ్మెల్యేలను స్పీకర్ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక 1995లో ఎన్టీఆర్‌ కు వైశ్రాయ్‌ హోటల్‌ వేదికగా చేసిన పని.. నాడు గవర్నర్, స్పీకర్‌లను అప్రజాస్వామికంగా తనకు అనుకూలంగా ఉపయోగించుకుని సీఎం పీఠం ఎక్కడం.. ఇలా తవ్వుకుంటూ పోతే బాబు గతం మొత్తం బయట పడుతుంది. ఈ విషయంలో బాబు ఏమాత్రం మైకుల ముందుకు రాకుండా.. మౌనంగా ఉంటేనే బెటరని పలువురు అభిప్రాయపడుతున్నారు.

దేశంలో జరిగే ఏ విషయంపై అయినా స్పందించే అవకాశం, అర్హత బాబుకు ఉండొచ్చు కానీ… ఇలాంటి ప్రజాస్వామ్యం, స్పీకర్ – గవర్నర్లను అప్రజాస్వామికంగా ఉపయోగించుకోవడం వంటి విషయాలపై మాత్రం ఎంత సైలంట్ గా ఉంటే అంత బెటరనేది పలువురి సూచనగా ఉంది!!