Home రాజకీయాలు బాబు సుడి”గాలి” కబుర్లు!

బాబు సుడి”గాలి” కబుర్లు!

61
SHARE

పుష్కరాల సమయంలో బాబు షూటింగ్ పేరున జరిగిన రచ్చలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతే… అది తొక్కిసలాటవల్ల జరిగింది, ఎంక్వైరీ వేస్తున్నా.. వేశాం! పడవ ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో జనాలు చనిపోతుంటే.. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది.. మరలా ఇలా జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది! ఏ ప్రమాదం జరిగినా, ఎంత మంది అమాయక ప్రజలు మరణిస్తున్నా.. చంద్రబాబు చెప్పే మాటలు నిత్యమూ ఇవే. అయితే.. తాజా పడవ ప్రమాదంపై బాబు.. నేరం నాది కాదు గాలిది అంటున్నారు!!

అవును.. ఇంతకాలం జనాలను, ప్రతిపక్షాలను సాకుగా చూపించి అన్ని విషయాలలోనూ తప్పించుకునే పనికి పూనుకున్న చంద్రబాబు… తాజా ప్రమాధానికి సుడిగాలి కారణం అని చెప్పుకొస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన పడవ ప్రమాదానికి సుడిగాలి కారణం అయితే.. జగన్ మాత్రం తనపై విమర్శలు చేస్తున్నారనేవి బాబు పలికిన తాజా పలుకులు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చెప్పాల్సిన సాకులా ఇవి.. చెప్పే మాటలా ఇవి! ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇచ్చిన సాయంత్రమే ఈ ఘోర ప్రమాదం జరిగిందన్న విషయం బాబు మరిచారా?

ఒకమోస్తరు గాలి వేసినంత మాత్రాన్న మునిగిపోయే పడవలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్స్ ఇస్తున్నారా అనేది బాబే ఆలోచించుకోవాలి. పుష్కరాల్లో షూటింగ్ హడావిడిలో 29 మంది, కృష్ణా నదిలో పడవ మునిగి 22 మంది, తాజా ఘటనలో సుమారు 40 మంది… ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలంటే విలువ లేని ప్రవర్తనవల్ల మరెంత మంది అమాయలు బలైపోవాలో బాబు ప్రభుత్వమే చెప్పాలి. ఈ విషయాలపై పశ్చాత్తాపం ఎలాగూ లేదు సరికదా.. సుడిగాలి కారణం, బోటు నడిపేవారి నిర్లక్ష్యమే కారణం, జనాలు ఎక్కువగా ఎక్కడమే కారణం, నదిలో నీరెక్కువగా ఉండటం కారణం లాంటి కుంటి సాకులు చెప్పడానికి బాబుకు నోరెలా వస్తుందనేది ఇక్కడ పెద్ద ప్రశ్న!

తమ చేతకాని తనంపైనా, తమ నిర్లష్యంపైనా ప్రశ్నించిన వారిపై మాత్రం బాబు ఎదురు విమర్శలు చేయడం ఒక అలవాటుగా పెట్టుకున్నారు. చేజేతులా నిర్లక్ష్యంవల్ల ప్రజల ప్రాణాలు హరించడం, అనంతరం లక్షో రెండులక్షలో చెక్కులు ఇవ్వడం, ఎంక్వైరీ వేయడం.. చేతులు దులుపుకోవడం. లైసెన్సులు లేని డ్రైవర్లు, అనుమతిలేని పడవలు.. చంద్రబాబు అసమర్థ, నిర్లక్ష్య పాలన ఈ చావులకు కారణం కాదా.. ఇవన్నీ సర్కారీ హత్యలుగా సంబోదించడం తప్పా! బాబుగారే ఆలోచించుకోవాలి.. ఈ సుడి”గాలి” కబుర్లు ఇంకెంత కాలం చెబుతారో జనాలు చూడాలి!!