Home రాజకీయాలు లక్ష్మీనారాయణ చెప్పాలనుకున్నది ఏమిటి?

లక్ష్మీనారాయణ చెప్పాలనుకున్నది ఏమిటి?

SHARE

గతకొన్ని రోజులుగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనకు క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, దానికి రెండు నుంచి రెండున్నర నెలల సమయం పడుతుందని చెప్పుకొస్తున్నారు లక్ష్మీనారాయణ. అయితే.. ఈ విషయంలో అటు బీజేపీకి కాని, ఇటు రాష్ట్రంలో టీడీపీకి కానీ లక్ష్మీనారాయణ పరోక్ష మద్దతు ఉండే అవకాశాలున్నాయని రాజకీయవర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యులో ఆయన చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారడమే కాకుండా.. అసలు విషయం తప్ప అన్నీ చెప్పారు, క్లారిటీ మిస్సయ్యింది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి!

విషయంలోకి వస్తే.. ఈ ఇంటర్వ్యూలో సదరు జర్నలిస్ట్ ఏ ప్రశ్న అడిగినా కూడా రెండు నెలల తర్వాత అన్నీ చెబుతాను, అంతా చూస్తారు అని దాటవేసే దోరణిని అవలంభించారు లక్ష్మీనారాయణ. ఇదేమన్నా సినిమా కథనా, ముందే బయటకు వస్తే జనాలకు ఆసక్తి ఉండదు అనుకోవడానికి. ఎందుకు ఉద్యోగానికి రిజైన్ చేశారు అనే ప్రశ్నకు.. సమాజం కోసం అని సమాధానం చెప్పిన ఆయన, పార్టీ పెట్టబోతున్నారా? ఏదైనా పార్టీలో చేరబోతున్నారా? లేక ఏదైనా స్వచ్చంద సంస్థలా పెట్టబోతున్నారా? అనే ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి సమాధానం చెప్పకుండా, పాతపాటే పాడారు. అయితే.. ఇక్కడ జనాలకు మాత్రం ఒక క్లారిటీ ఇస్తూ, తన కంఫ్యూజన్ ని బయటపెట్టారు!

వాస్తవాలు మాట్లాడుకుంటే.. తెలంగాణలో, ఆంధ్రాలో అభివృద్ధి ఏ రాష్ట్రంలో ఎలా ఉందనేది దాదాపుగా చాలామందికి తెలిసిన విషయమే. ఇదే అంశంపై స్పందించిన లక్ష్మీనారాయణ మాత్రం.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అభివృద్ధి పోటాపోటీగా జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా ఆయన ఈ మాట చెప్పడం ద్వారా జనాలకు కొంత సంకేతాన్ని ఇచ్చారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తెలంగాణ సంగతి కాసేపు పక్కనపెడితే… ఏపీలో అభివృద్ధి అంత పోటీపడి మరీ జరిగిపోతుంటే, గ్రామాల్లో తిరుగుతున్న ఆయనకు ఏమి కనిపించినట్లు. అవును… రాష్ట్రంలో అభివృద్ధి ఒక రేంజ్ లో జరుగుతుంది అని చెప్పాలనుకోవడమా, లేక అది అభివృద్దే కాదు.. తానొచ్చి చేస్తాను అని చెప్పడమా అన్న అంశంపై స్పష్టత కరువైంది. ఒక వేళ రాష్ట్రంలో అభివృద్ధి అంత పోటీపడి జరిగిపోతుంటే.. ఇక లక్ష్మీనారయణ లాంటి వారి అవసరం ఏముందనే ప్రశ్న జనాలనుంచి ఎదురవుతుంది! ఈ క్రమంలో తన ప్రచారాన్ని పరోక్షంగా మీడియా వేదికగా ప్రారంభించడం మినహా.. లక్ష్మీ నారాయణ ప్రత్యక్షంగా ఏమి చెప్పాలనుకున్నారన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు!