Home సినిమా రివ్యూ మెహబూబా సినిమా రివ్యూ

మెహబూబా సినిమా రివ్యూ

SHARE

రేటింగ్ : 2.25/5

బ్యానర్ : పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్

నటీనటులు : ఆకాష్ పూరి, నేహా శెట్టి

దర్శకత్వం, స్క్రీన్ ప్లే, నిర్మాత : పూరి జగన్నాథ్

నిర్మాత : పూరి కనెక్ట్స

సంగీతం : సందీప్ చౌత

సినిమాటోగ్రఫర్ : విష్ణు శర్మ

ఎడిటర్ : జునైద్‌ సిద్ధిఖీ

దర్శకుడు పూరీ జగన్నాథ్ అంటే ఆయన డైలాగ్స్, టేకింగ్ ప్రేక్షకులను మైమరిపిస్తాయి. పూరీ చెప్పిన ప్రేమకథలు విశేషంగా ఆకట్టుకొన్నాయి. తనదైన శైలిలో చిత్రాలను తెరకెక్కించే విలక్షణ దర్శకుడు పూరీ.. ఇలాంటి నేపథ్యంలో తన కుమారుడు ఆకాష్ పూరీని హీరోగా, నేహా శర్మ అనే అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ పూరీ రూపొందించిన చిత్రం మెహబూబా. పూరీ కనెక్ట్, పూరీ టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ ప్రేమ కథా చిత్రం మే 11 రిలీజైంది. ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో రూపొందిన ఈ చిత్రం పూరీ జగన్నాథ్‌కి సక్సెస్‌ను అందించిందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ

రోషన్ ( ఆకాష్ పూరీ) అమితమైన దేశభక్తి కలిగిన యువకుడు. సైన్యంలో చేరాలనే తపనతో ఉంటాడు. స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ చేయడమంటే చాలా ఇష్టం. కానీ చిన్నతనం నుంచే కొన్ని జ్ఞాపకాలు రోషన్‌ను వెంటాడుతుంటాయి. హిమాలయాలతో తనకు అవినాభావ సంబంధం ఉందనే భావనతో ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో చదువుకోవడానికి వచ్చిన పాకిస్ఠానీ అమ్మాయి అఫ్రీన్ (నేహా శెట్టి) పరిచయం అవుతుంది. ఓ సందర్భంలో ఆఫ్రీన్‌‌ను రక్షిస్తాడు. ఆ తర్వాత ఏదో చెప్పలేని బంధం తమ మధ్య ఉందనే ఫీలింగ్ ఇద్దరిలోనూ ఏర్పడుతుంది. ఈ క్రమంలో హియాలయాలకు వెళ్లిన రోషన్‌కు ఆఫ్రీన్ రూపంలో ఉన్న ఓ అమ్మాయి శవం మంచు కొండల్లో లభ్యమవుతుంది. అప్పుడు ఆఫ్రీన్‌ డైరీలో లభ్యమైన సమాచారం ఆధారంగా తమది గత జన్మ బంధమని తెలుసుకొంటాడు.

నటీనటులు

ఇప్పుడిప్పుడే రెండు పదుల వయసు దాటుతున్న కొత్త హీరో ఆకాష్ పూరి యాక్టింగ్ స్కిల్స్ గురించి పూర్తి స్థాయి జడ్జ్ మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. కాని తనదే కీలక పాత్ర కాబట్టి దృష్టి మొత్తం తన మీదే ఉంటుందని తెలిసే ఆకాష్ పూరి తనలో బెస్ట్ ఇవ్వడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. ఇది సింపుల్ లవ్ స్టొరీ కాదు. అలాంటివి వర్క్ అవుట్ కావని తెలిసే పూరి ఈ సారి క్లిష్టంగా అనిపించే ఇండో పాక్ నేపధ్యాన్ని తీసుకున్నాడు. అందులోనూ హీరో దేశం కోసం పోరాడే సైనికుడు. చాలా బరువునే మోసాడు ఆకాష్ పూరి. ఇంకా టీనేజ్ తాలుకు లేతదనం మొహంలో స్పష్టంగా కనిపిస్తున్న ఆకాష్ పూరిలో ఒక ప్రేమికుడు కనిపించాడు అంటే అది అతని కష్టానికి ఫలితమే. ముఖ్యంగా పాకిస్తాన్ కు వెళ్ళినప్పుడు తన ప్రేమ ను అక్కడి పెద్దలకు ఎక్స్ ప్రెస్ చేసే సీన్ లో యూత్ తో విజిల్స్ కొట్టించుకుంటాడు.

ఇక హీరొయిన్ నేహా శెట్టి లుక్స్ పరంగా ఓకే కానీ మరీ గొప్ప అందగత్తె కాదు. ఇలాంటి కథకు పరిచయం లేని ఫ్రెష్ బ్యూటీ అయితేనే ప్రేక్షకులు కథలోని ఆత్మకు కనెక్ట్ అవుతారు కాబట్టి పూరి తీసుకున్నాడు కాని తను చాలా యావరేజ్ బ్యూటీ. నటనకు వేరియేషన్స్ చూపించే అవకాశం ఉన్నా వాడుకోలేదు. హావభావాల్లో ఇంకా బేసిక్ స్టేజిలోనే ఉన్న నేహ శెట్టి దాని మీద దృష్టి పెడితే మంచిది.

షియాజీ షిండే పూరి సినిమా అంటే చాలు ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తాడో అర్థం కాదు. హీరో తండ్రిగా పావలాకు రూపాయి చేసి చూపించాడు. మురళి శర్మది కూడా ఇదే తంతు కాని కొంతలో కొంత నయం.

ఇక హీరొయిన్ ని చేసుకునేవాడిగా నాదిర్ పాత్ర వేసిన నటుడి గురించి చెప్పుకోవాలంటే మాటలు చాలవు. హిందిలో మాట్లాడుతూ అతిగా చేయకపోతే తెలుగులో అవకాశాలు ఇవ్వరేమో అన్నంత దారుణంగా చేసాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చే లేడీ ఆర్మీ ఆఫీసర్, అక్కడక్కడ హీరో హీరొయిన్ల తల్లులు ఎవరికి వారు ఈ లైఫ్ టైం అవకాశాన్ని పూర్తిగా వాడుకున్నారు.

సాంకేతిక వర్గం

పూరి జగన్నాధ్ తన పాత పొరపాట్ల నుంచి కొంచెం కూడా నేర్చుకోలేదు. ఇండియా పాకిస్తాన్ లాంటి సున్నితమైన అంశాన్ని స్పృశించినప్పుడు బేసిక్స్ ని పరిగణలోకి తీసుకోవడం చాలా అవసరం.

దశాబ్దాల పాటు హీరొయిన్ శవం మంచు కొండల్లో భద్రంగా ఉండటం, ఒక సంవత్సరం ఇంజనీరింగ్ కోసం పాకిస్తాన్ నుంచి ఆమె ఇండియాకు రావడం, ఏదో పక్కనే ఉన్న పల్లెటూరికి వెళ్లినట్టు హీరో పాకిస్తాన్ కు వెళ్ళడం, ఆర్మీ బోర్డర్ అంటే ఆర్టిఓ చెక్ పోస్ట్ లాగా సిల్లీ గా చూపించడం లాంటి బ్లండర్స్  చాలానే చేసిన పూరి సెకండ్ హాఫ్ మొత్తం నవ్వించాడు. ఇదేదో అమర ప్రేమ కథలా ప్రొజెక్ట్ చేయాలనీ ప్రయత్నించిన పూరి ఎక్కడా ఎమోషనల్ గా టచ్ చేయలేకపోవడం సినిమాని దెబ్బ తీసింది.

ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించుకున్నా ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి పూరి కథనాన్ని నడిపించిన తీరు చూసి ఎందుకు గ్రౌండ్ లెవెల్ కి ఇంకా దిగాజారుతున్నాడు అనే సందేహం కలుగుతుంది. ట్రైలర్ లో చూపించినంత ప్రామిసింగ్ గా సినిమా లేకపోవడం ముమ్మాటికి పూరి తప్పే. హార్ట్ టచింగ్ గా ఉండాల్సిన పునర్జన్మ కథను డ్రాగ్ చేసి పాటలతో విసిగించిన పూరి సందీప్ చౌతా నుంచి కూడా సరైన అవుట్ పుట్ రాబట్టుకోలేదు.మొత్తానికి పూరి మార్క్ ఫెయిల్యూర్ ఇందులో కంటిన్యూ అయ్యింది.

సందీప్ చౌతా సంగీతం అంత గొప్పగా ఏమి లేదు. ఓ రెండు పాటలు పర్వాలేదు అనిపించాయి. రియల్ సతీష్ యాక్షన్ కంపోజింగ్ బాగుంది. విష్ణు శర్మ కెమెరా  విజువల్స్ ని అద్భుతంగా ప్రెజంట్ చేసాడు.

జునైద్ షేక్ ఎడిటింగ్ మాత్రం రెండో భాగంలో తప్పుడు లెక్కలు వేసింది. కథే అలా ఉన్నప్పుడు అతను మాత్రం ఏమి చేయలేడు. నిర్మాతగా పూరి సక్సెస్.. చాలా ఖర్చు పెట్టాడు. అది కంటికి కనిపిస్తుంది. రాజీ పడలేదు కాని ఆకాష్ లాంటి డెబ్యు హీరో మీద ఇంత డబ్బు పెట్టడం అంటే జూదం ఆడటమే.

పాజిటివ్ పాయింట్స్

ఆకాష్ పూరి నటన

కెమెరా పనితనం

రెండు పాటలు

ఇండో పాక్ బ్యాక్ డ్రాప్

నెగటివ్ పాయింట్స్

సిల్లీ కథా కథనాలు

సింక్ కాని పునర్జన్మ థ్రెడ్

సంగీతం

హీరొయిన్ నేహా శెట్టి

ఆర్టిస్టుల ఓవర్ యాక్షన్

చివరి మాట

ప్రేక్షకుల తెలివి తేటలను తక్కువ అంచనా వేసిన ఏ దర్శకుడు అయినా ఇలాంటి కథతో హిట్టు కొట్టడం కాదు కదా కనీసం మంచి ప్రయత్నం చేసారులే అనిపించుకోవడం కూడా అసాధ్యం. పూరి ఆణిముత్యాలు అయిన రోగ్ లాంటి వాటి కంటే బాగుందా అంటే చెప్పడం కష్టం. ఆసిడ్ పడిన రెండు కళ్ళలో ఏది బాగా కనిపిస్తుందో చెప్పమంటే చెప్పగలమా. ఇదీ అంతే. అర్థం చేసుకున్న వాళ్ళకు అర్థం చేసుకున్నంత. పూరి జగన్నాధ్ ఈ సినిమాతో ఫాంలోకి వస్తాడు అని ఆశలు పెట్టుకున్న అభిమానుల ఆశలు నెరవేరడం కష్టం.

ఉతికి ఆరేసిన పునర్జన్మ ఫార్ములా పూరి స్టయిల్