Home రాజకీయాలు బాబు “నిప్పు” అవ్వడం ఇష్టంలేదా తమ్ముళ్లు!

బాబు “నిప్పు” అవ్వడం ఇష్టంలేదా తమ్ముళ్లు!

2835
SHARE

రాష్ట్రవిభజన అనంతరం చంద్రబాబు హైదరాబాద్ కేంద్రంగా పాలన సాగిస్తున్న రోజుల్లో… ఓటుకు నోటు వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అనంతరం బాబు హైదరాబాద్ ని వదిలి విజయవాడకు బయలుదేరడంతోనో ఏమో కానీ.. కాస్త సైలంట్ అయ్యింది. ఇలా చాలా కాలంగా సైలంట్ గా ఉన్న ఈ వ్యవహారం తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చింది. దీంతో ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడేస్తున్నారు.

నిన్నమొన్నటివరకూ కేసీఆర్ పై ఏమాత్రం కామెంట్స్ చేయని టీడీపీ నేతలు… ఈ ఓటుకు నోటు కేసు వ్యవహారం బయటకు రాగానే పోటాపోటీగా మైకుల ముందుకు వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో… తీవ్రమైన కామెంట్స్ కూడా చేసేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, మణిగాంధీలు ఒకడుగు ముందుకేసి.. చంద్రబాబును చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఉద్దేశపూర్వకంగా బాబుని టార్గెట్ చేస్తున్నారని.. ఇది కచ్చితంగా బీజేపీ గేమ్ ప్లానే అని చెప్పుకొస్తున్నారు! సరే.. ఇది రాజకీయ స్టేట్ మెంట్ అనుకుందామనే లోపు… చంద్రబాబుపై ఈగ వాలినా ఆంధ్రప్రదేశ్ అగ్ని గుండం అవుతుందని హెచ్చరిస్తున్నారు! ప్రస్తుతం ఈ కామెంట్స్ టీడీపీలో కూడా హాట్ టాపిక్ గా మారాయి.

ఈ మాటలను సరిగ్గా గమనిస్తే… బాబు అండ్ కో చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని అనిపించకమానదు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడం అనేది.. ఆయన వ్యక్తిగత విషయం! రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా.. కేసుల్లో ఇరుక్కుని శిక్షలు పడితే.. జైలుకి వెళ్లాల్సిందే. వారిపై ఏమైనా అభిమానం జనాలకు ఉంటే.. అప్పుడప్పుడు మాట్లాడుకుంటారు, వీలైనవాళ్లు వెళ్లి పలకరిస్తారు. అంతేకానీ.. రాష్ట్రముఖ్యమంత్రి నేరం చేసినా కూడా శిక్షలు పడకూడదు, ఒకవేల అలాంటివి ఏమైనా జరిగితే అది రాష్ట్ర ప్రజల సమస్య.. దాంతో రాష్ట్రం మొత్తం అగ్నిగుండం అయిపోతుంది అని కామెంట్స్ చేయడం ఎంతవరకూ సబబో తమ్ముళ్లే చెప్పాలి.

ఇక్కడ మరో విషయం ఏమిటంటే… చంద్రబాబుని చంపాలని చూస్తున్నారట!! ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా.. చట్టం ముందు అంతా సమానమే! ఈ విషయంలో ఇరుక్కున్న కేసులు విచారణకు వచ్చినంతమాత్రాన్న చంపడానికి చూస్తున్నారనడం ఆ టీడీపీ నేతల అజ్ఞానం కాక మరేమిటి! ఈ కేసును ఇలా వదిలేసేకంటే… ఒకసారి విచారణ ఎదుర్కొని నిర్దోషిగా బయటకు వస్తేనే బాబు నిప్పవుతారు తప్ప… ఇలా తప్పించుకుని తిరిగినంత కాలం నిప్పు కాదు.. తుప్పు, ఫాదర్ ఆఫ్ పప్పు అవుతారనే విషయం తమ్ముళ్లు ఎందుకు గమనించడం లేదు!!