Home రాజకీయాలు అత్యాచారాలు ఆపడానికి బాబు చెప్పిన పరిష్కారం!!

అత్యాచారాలు ఆపడానికి బాబు చెప్పిన పరిష్కారం!!

99
SHARE

దేశంలో రోజు రోజుకీ అత్యాచారాలు ఎందుకు పెరిగిపోతున్నాయి? మహిళలపైనా, బాలికలపైనా మానవ మృగాలు ఎందుకు దాడులకు తెగబడుతున్నాయి? ‘దాచేపల్లి’లాంటి ఘటనలు జరగడానికి కారణం ఏమిటి?… ఈ అన్ని ప్రశ్నలకు బాబు ఒక్కమాటలో సమాధానం చెప్పారు! మహిళలపై దాడులు జరగడానికి, అత్యాచారాలు పెరిగిపోవడానికి కారణం.. పోర్న్ వెబ్ సైట్లంట! అవును… ఈ విషయాన్ని స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు! పోర్న్ వెబ్ సైట్లు పెరిగిపోవడం వల్ల అత్యాచారాలు పెరిగిపోతున్నాయనేది బాబు వాదన!!

ఇలా సమస్య ఏమిటో గ్రహించేసిన బాబు… వెంటనే దానికి పరిష్కారం కూడా సూచించేశారు! కంప్యూటర్లలో అశ్లీల (పోర్న్‌) సైట్లు ఓపెన్‌ కాకుండా బ్లాక్‌ చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఒక రాష్ట్రం మొత్తం కంప్యూటర్లలో, మొబైల్ ఫోన్స్ లో కొన్ని లక్షల సంఖ్యలో ఉన్న పోర్న్ సైట్లను బ్లాక్ చేయడం సాధ్యమేనా? ఇది బాబుగారే ఆలోచించుకోవాలి! అలా అని పోర్న్ సైట్లను బ్లాక్ చేయొద్దని కాదు కానీ.. కేవలం ఈ సమస్యకు పరిష్కారం అదే అనే రీతిలో ముఖ్యమంత్రి మాట్లాడటమే ఇక్కడ ప్రజలను ప్రశ్నించేలా చేస్తున్న విషయం! చట్టాలు మెరుగుపరచాలి.. ఎక్కడికక్కడ సీసీ కెమేరాలు ఏర్పాటుచేయాలి.. పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి.. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారికి ప్రభుత్వాలు అండగా నిలవకూడదు.. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి వీలైనంత త్వరగా శిక్షలు పడేలా చూడాలి.. ఇలాంటి పరిష్కారాలు కదా చేయాల్సింది అనేది కొందరి వాదన!

ఆ సంగతులు అలా ఉంటే… బాబు తెగ ఫీలయిపోతున్నట్లు చెబుతున్న ఈ అత్యాచారాలే కాకుండా… మహిళలపై ఎలాంటి దాడులకు తెగబడ్డా కూడా ఆ విషయాన్ని సీరియస్ గా పరిగణించాలి! చింతమనేని ప్రభాకర్ వ్యవహారమే తీసుకుంటే… ఒక ప్రభుత్వ అధికారిణిపై ఎమ్మెల్యేగా ఆయన చేసిన ప్రవర్తన బాబుకు కనిపించలేదా. ఒక మహిళను వివస్త్రను చేసిన టీడీపీ జనాలకు ఏ శిక్షలు పడ్డాయి. కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ విషయంలో ఎంత మందిని దోషులుగా తేల్చారు. ఈ విషయాలన్నీ మరుగునపడేస్తూ, జనాలు మరిచిపోయారనుకుంటున్న బాబు… నేరం మొత్తం పోర్న్ సైట్స్ పై వేయడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. మొదటిరోజునే చింతమనేనివంటి వారిపై బాబు సీరియస్ గా రియాక్ట్ అయ్యి ఉంటే.. ప్రతీరోజూ దినపత్రికల్లో వస్తున్న మహిళలపై దాడులకు సంబందించిన విషయాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఎప్పుడైనా బాబు మాట్లాడి ఉంటే.. ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో!! అనేది మరికొందరి అభిప్రాయంగా ఉంది!