Home రాజకీయాలు టీ కప్పులో తుఫాను తగ్గలేదు.. తగ్గేది లేదు!!

టీ కప్పులో తుఫాను తగ్గలేదు.. తగ్గేది లేదు!!

91
SHARE

ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీలో విభేదాలు చాలా చిన్న విషయం.. అఖిల ప్రియకు – ఏవీ సుబ్బారెడ్డికి మధ్య ఉన్న అభిప్రాయబేదాలు టీ కప్పులో తుఫాను వంటివి మాత్రమే.. ప్రజాసేవ విషయంలో వారిద్దరూ పోటీపడుతున్నారే తప్ప వ్యక్తిగత కక్షలు ఏమీ లేవు.. వీరిద్దరూ అధిష్టానం ఏమి చెబితే అది చేస్తారు.. తాజాగా మంత్రి భూమా అఖిలప్రియ, పార్టీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిల మధ్య స్వయంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని చేసిన రాజీ ప్రయత్నం అనంతరం వర్ల రామయ్య మీడియాకు చెప్పిన మాటలివి. అంతా అనుకుంటున్నట్లుగా ఏమీ లేదని.. ఇది కేవలం టీ కప్పులో తుఫాను అని, ఇకపై వీరిద్దరూ పార్టీకోసం పోటాపోటీగా పనిచేస్తారని చెప్పుకొచ్చారు. ఇంతలోనే నివురుగప్పిన నిప్పు మరోసారి బయటకు వచ్చిందని తెలుస్తుంది!

స్వయంగా చంద్రబాబే జోక్యం చేసుకుని రాజీ ప్రయత్నం చేసినా, వారిద్దరూ మీడియా ముందుకొచ్చి ప్రవచనాలు వల్లించినా, ఇది టీకప్పులో తుఫానే అని రామయ్యలాంటి వారు విశ్లేషించినా.. వీరిద్దరి మధ్య ఉన్నది మామూలు గ్యాప్ కాదనేది సుస్పష్టం! ఇందుకు మరో ఉదాహరణ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది! దీనికి కారణం… ఏవీ సుబ్బారెడ్డికి త్వరలో నామినేటెడ్ పదవి ఇవ్వాలని బాబు నిర్ణయించడమేనట! ఏవీకి ఏదైనా పదవి ఇస్తే.. అది తనను అవమానించడమే అనే రేంజ్ లో అఖిల ప్రియ భావిస్తుందని, దీనికోసం ఎంత తీవ్రంగా అయినా స్పందించొచ్చని కథనాలు వస్తున్నాయి.

నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఏవీ సుబ్బారెడ్డికి ఏదైనా పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారట. ఇందులో భాగంగా త్వరలో ఏవీకి నామినేటెడ్ పదవి ఇవ్వాలని అధిష్టానం భావిస్తోందని తెలుస్తోంది. వీలైనంత త్వరలో ఇందుకు సంబంధించి ఆర్డర్ కూడా రావొచ్చని అంటున్నారు. ఈ విషయంపై అఖిల ప్రియ గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.

ఇందులో భాగంగా తన అభిప్రాయానికి భిన్నంగా అధిష్టానం గనక ఏవీ సుబ్బారెడ్డికి ఏదైనా పదవి ఇస్తే.. తక్షణమే అఖిలప్రియ ఒక కీలక నిర్ణయానికి రావడానికి సిద్ధంగా ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేల అలాంటి కీలక నిర్ణయమే తీసుకోవాల్సివస్తే గనక తన వెంటే ఉండాలని అనుచరులకు, అభిమానులకు ఆమె వివిధ రూపాల్లో సందేశాలు పంపిస్తున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

మరి ఈ టీకప్పులో తుఫాను ను చల్లార్చడానికి మరోసారి చంద్రబాబే రంగంలోకి దిగుతారా లోకే.. ఎలా జరిగేది అలా జరుగుతుందని లైట్ తీసుకుంటారో వేచి చూడాలి. ఏది ఏమైనా… ఏవీ సుబ్బారెడ్డికి చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి పదవి ఇచ్చి తీరతారా లేక.. అఖిల ప్రియ నిర్ణయానికి వెనక్కి తగ్గి.. ఏవీని బుజ్జగిస్తారా అనేది త్వరలోనే తెలియొచ్చు!!