Home రాజకీయాలు కాషాయం – కమ్యునిజం.. మధ్యలో పవనిజం!

కాషాయం – కమ్యునిజం.. మధ్యలో పవనిజం!

80
SHARE

ప్రస్తుతం జనసేన అధినేత ప్రణాళికలు ఏమిటో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి! రాబోయే ఎన్నికల్లో 175స్థానాలు పోటీచేస్తానని పవన్ ప్రకటించటం వరకూ ఓకే కానీ.. ఇప్పటికీ రాష్ట్ర కమిటీకే జనసేన పార్టీలో అతీగతీ లేదు. ఇక గ్రామ స్థాయిలో ఓట్లు వేసే జనాలను, ఓట్లు వేయించడంలో కీలక భూమిక పోషించే కార్యకర్తలను సంపాదించుకునే పరిస్థితే ప్రస్తుతానికి కనిపించడం లేదు! ఈ క్రమంలో 175స్థానాలూ పోటీచేస్తామని ప్రకటించారు పవన్. ఎంత తోపు పార్టీ అయినా, ఎంతటి తురుము ఆ పార్టీకి అధినేత అయినా… క్షేత్రస్థాయిలో ఫీల్డింగ్ చాలా ముఖ్యం. ఈ క్రమంలో అటు బీజేపీ – ఇటు కమ్యునిస్టుల మధ్య పవన్ ఊగిసలాడుతున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

పవన్ ఎన్ని స్థానాల్లో పోటీచేస్తారనే అంశం కంటే.. ఎంత బలంగా ప్రజల్లోకి దూసుకుపోతారు అనేది కీలకం. బహిరంగ సభల్లో విజిల్స్ వేయించుకోవడం, చప్పట్లు కొట్టించుకోవడానికి.. పోలింగ్ బూత్ లో ఓట్లు వేయించుకోవడానికి ఉన్న వ్యత్యాసం పవన్ కు తెలియదని అనుకోలేం. అయితే.. పలువురు సీనియర్ ల సూచనల మేరకు ఈ విషయంలో ఒక బలమైన పార్టీతో కలిసి ముందుకు వెళ్లాలని పవన్ బావిస్తున్నారట!

అయితే.. పవన్ బావిస్తున్న ఆ రెండు బలమైన పార్టీల్లో ఒకటి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కాగా.. మరొకటి కమ్యునిస్టు పార్టీ!! రాష్ట్రస్థాయిలో క్షేత్రస్థాయిలో కాస్తో కూస్తో బలమైన కేడర్ ఉన్న కమ్యునిస్టులను నమ్ముకుంటూ ముందుకెళ్తే బెటరని కొందరు సూచిస్తుంటే… ఒక్క ఎంపీ సీటు గెలిచినా అది బీజేపీ సమర్పించుకునేలా మాట్లాడుకుని వారితోనే కలిసి పోటీచేస్తే బెటరని మరికొందరు సూచిస్తున్నారట. పార్టీ ఆర్ధిక పరిస్థితికి కూడా బీజేపీ తోడుగా ఉంటుందనేది వారి లాజిక్కుల్లో ఒకటిగా ఉందట! దీంతో… ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో పవన్ ఉన్నారని సమాచారం!

పోనీ ఇద్దరితోనూ కలిసి ముందుకు వెళ్దాం అంటే… కమ్యునిస్టులకు బీజేపీకి ఏమాత్రం పొసగని పరిస్థితి. ఈ క్రమంలో పవన్ తీసుకోబోయే నిర్ణయం చాలా కీలకంగా మారబోతుందని తెలుస్తుంది. ఈ విషయంలో కమ్యునిస్టులతో రాష్ట్రంలో అంటకాగుతూ.. సెంట్రల్ విషయంలో బీజేపీతో లోపాయకారి ఒప్పందం ఒకటి తెరవెనక చేసుకుంటే బెటరని ఆలోచిస్తున్నారట!! మరి అటు కాషాయం.. ఇటు కమ్యునిజం మధ్యలో పవనిజం ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాలి మరి!!