Home రాజకీయాలు పంచముఖ పోటీ.. ఫలితం ఏంటి?

పంచముఖ పోటీ.. ఫలితం ఏంటి?

SHARE

రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏపీలో రాజకీయ పార్టీల పోటీ ఎలా ఉండబోతుంది అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది! ప్రధానంగా వైకాపా, టీడీపీ లే అయినప్పటికీ… ఓట్లు చీల్చే విషయంలో జనసేన, కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు తలో చెయ్యి వేయబోతున్నాయనేది సుస్పష్టం. ఈ క్రమంలో ఓట్ల చీలిక అనేది భారీగా ఉండబోతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే! ఈ క్రమంలో పార్టీల మధ్య స్నేహాలు, మిత్రబందాలు, తీవ్రమైన పోటీ వాతావరణం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు చూద్దాం!

రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ఇలా ఏ ప్రాంతం చూసినా ఏపీలో ఇప్పటికే రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కింది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని చెప్పుకొస్తున్నా కూడా.. ఆ హడావిడి ఇప్పటికే మొదలైంది! దీంతో గత్యంతరం లేక.. టీడీపీ నేతలు పార్టీ పరంగా కాకుండా.. ఎవరి బ్రతుకు వారు చూసుకునే క్రమంలో ఒంటరి ధర్నాలు, సోలో ఫెర్మార్మెన్స్ లు ఇస్తున్నారు. ఆ సంగతులు అలా ఉంటే… ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ప్రత్యేక హోదా నినాదాలు.. కాగ్ నివేదికల లెక్కల ప్రకారం కనిపిస్తున్న పుష్కలమైన అవినీతి.. మహిళలపై రోజు రోజుకీ పెరిగిపోతున్న దాడులు.. ఇసుక మాఫీయాలు.. నిరుద్యోగ భృతి, రుణ మాఫీ కలిపి 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో బాబు చేసిన వాగ్ధానాలు.. నెరవేరని పరిస్థితి.. ఈ వ్యవహారాలన్నీ కలిపి టీడీపీకి రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత నెలకొందనే చెప్పుకోవాలి.

ఈ క్రమంలో టీడీపీకి స్థానిక నేతల వ్యక్తిగత ప్రతిష్ట మేరకే ఓట్లు పడాలి తప్ప… పూర్తిగా పార్టీ పేరుచెప్పి, ప్రస్తుత పాలనను చూసి పడే ఓట్లు ఏమాత్రం ప్రభావం చూపగలిగేవి కావు!! ఇదే క్రమంలో కేవలం ఒక వర్గం ఓట్లను నమ్ముకున్న పార్టీగా కథనాలు వస్తున్న తరుణంలో.. జనసేన చూపగలిగే ప్రభావం ఏమిటనేది కూడా అవసరమైన విశ్లేషణే! తన సామాజిక వర్గ ఓటర్లను, యువతను నమ్ముకుని పవన్ రంగంలోకి దిగుతున్నారనేది తెలిసిన విషయమే. ఈ విషయంలో గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పవన్ ఆశించిన ఓటర్ల శాతం కాస్త ఎక్కువ అని అనుకోవాలి! ఆ ప్రాంతాల్లో జనసేనకు దొరికే నాయకుల వ్యక్తిగత ప్రతిష్ట చాలా ముఖ్యం! దాన్ని బట్టి జనసేన ప్రభావం ఎంతనేది తెలిసే అవకాశం ఉంది! అలా కాని పక్షంలో జనసేన పూర్తిగా.. 2009 సమయంలో లోక్ సత్తా, ప్రజారాజ్యం పార్టీలు చేశాయని చెప్పుకునే పనే చేయడం మినహా ప్రయోజనం ఉండకపోవచ్చు! ఫలితం.. సీట్ల సంగతి దేవుడెరుగు.. ఓట్ల శాతం కూడా ఆశాజనకంగా ఉండకపోవచ్చు!

ఇక చాలా బలంగా ఉన్నామని.. టీడీపీ వల్లే నష్టపోయామని ప్రకటించుకుంటున్న బీజేపీ.. ఏపీలో చూపగలిగే సత్తా భారీస్థాయిలో ఉంటుందని అనుకోలేం! ఏపీలో బీజేపీకి ఉన్న కేడర్ శాతం ప్రత్యేకంగా చెప్పేది కాదు! అడపాదడపా నాయకులు ఉండొచ్చు కానీ.. భారీ కేడర్ ఉందని బీజేపీ నేతలు సైతం బలంగా చెప్పలేని పరిస్థితి. ఎన్నికల నాటికి మోడీకి పెరుగుతున్న వ్యతిరేకత, అనుకూలతలను బట్టి మాత్రమే కాక… ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, రాష్ట్రానికి రావాల్సిన నిధుల ను బట్టి వారి ప్రభావం ఆధారపడి ఉంటుంది.

ఇక కాంగ్రెస్ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. 2014 ఎన్నికల నాటికి రాబోయే ఎన్నికల నాటికి వారి పరిస్థితుల్లో పెద్ద తేడా ఉండకపోవచ్చు. ఓటర్లను, గెలుపోటములను ప్రభావితం చేయగలిగే స్థాయిలో వారి ప్రదర్శన ఉంటుంది అనుకోవడం అత్యాశే!! ఇక వామపక్షాలు కాస్త జనసేనతో కలిసి నడిచే అవకాశాలైతే ఉండొచ్చు.. అలా కానిపక్షంలో వారి ప్రభావం అతి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలెక్కువ!!

ఈ లెక్కన చూసుకుంటే… రాబోయే ఎన్నికల్లో ఎంత పంచముఖ పోటీ అయినప్పటికీ… ఓట్లు బాగా చీలిపోతాయని అని ఎంత అనుకున్నా.. టీడీపీ – వైకాపా ల మధ్య సాగే ప్రధాన పోటీలో.. మెజారిటీ లు కూడా భారీగానే ఉంటాయనేది విశ్లేషకుల అభిప్రాయం. దినదినాభివృద్ధి చెందుతున్న ప్రభుత్వ వ్యతిరేకత.. ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని, అలాంటప్పుడు చీలే ఓట్ల శాతం కచ్చితంగా తగ్గి, వైకాపా కు ప్లస్ అవుతాయనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది.

టీడీపీకి బలమైన ప్రత్యర్ధి, బాబు కాక, సీఎం అభ్యర్ధి కచ్చితంగా జగనే కావడంతో.. వైకాపా సానుబూతిపరులే కాకుండా.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా నేరుగా ఫ్యాన్ గుర్తుకు పడే సూచనలు ఉన్నాయని… జనసేనకు వెయ్యడం వల్ల తమ ఓటు వృథా అని ఫీలయ్యే సగటు ప్రజానికం గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే… రాబోయే ఎన్నికల్లో ఎన్ని ఓట్లు చీలినా.. జగన్ కు బలమైన ఓటు బ్యాంక్ తయారవుతుందనేది పలువురి అభిప్రాయంగా ఉంది!!