Home రాజకీయాలు దుర్మార్గులకు రాజకీయాలెందుకు?

దుర్మార్గులకు రాజకీయాలెందుకు?

79
SHARE

దుర్మార్గులకు రాజకీయాలెందుకు?

ఏమిటో దరిద్రం… ఈ దేశంలో ఎవరైనా ఏదైనా దుర్మార్గానికి పాల్పడితె.. ముందుగా అతడు ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడు, అధికార పక్షమా, ప్రతిపక్షమా అనే ఆరాలు వెలుగులోకి వెచ్చేస్తుంటాయి. మీడియా కూడా… ఆ నేరస్థుడు పలానా పార్టీకి చెందిన వాడు అని మొదలుపెడుతుంటుంది. దీంతో.. ఆ ఒక్కమాటతోనే ఆ నేరస్థుడికి తెలియకుండానే సగం మద్దతు దొరికేస్తుంది. తమ పార్టీ మనిషి అయితే చాలు.. తమ కులానికో, తమ మతానికో చెందినవాడు అయితే చాలు.. అడ్డదిడ్డంగా తమ మద్దతు, అనాలోచితంగా తమ సానుభూతి ప్రకటించేస్తుంటారు కొంతమంది అనాలోచిత, సంకుచిత స్వాభావ ప్రజలు! దీంతో జరిగిన సంఘటనకు రాజకీయ రంగు పులుముకోవడమే కాదు.. బాదితులకు జరిగే న్యాయంపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది!

తాజాగా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల మైనర్ బాలిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం వైకాపా నేతలు రంగంలోకి దిగి బాదితులకు అండగా ఉండగా.. పార్టీలకు అతీతంగా సమస్యలపై స్పందించాల్సిన ప్రభుత్వం పెద్దలు మాత్రం సైలంటుగా ఉండిపోయారు! ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది! ఈ సమయంలో దొంగలు పడిన ఆరు నెలలకు అన్నట్లుగా స్పందించిన ప్రభుత్వ పెద్దలు, టీడీపీ నేతలు.. సమస్యపై స్పందించిన తీరు తీవ్ర విమర్శల పాలయ్యింది. ఈ ఘాతుకానికి పాల్పడిన సుబ్బయ్య వైసీపీకి చెందిన వాడని మొదలుపెట్టారు.

ఈ విషయం చినికి చినికి గాలివానగా మారడం.. సుబ్బయ్య టీడీపీకి చెందిన వ్యక్తే అని, బాధితులకు వైసీపీ అండగా నిలిచినందుకే తమపై టీడీపీ బురదజల్లుతోందని వైసీపీ నేతలు మండిపడటం తెలిసిన విషయమే! అసలు విషయానికొస్తే… నేరస్తుడు టీడీపీకి చెందిన వాడా,వైకాపా కి చెందిన వాడా అనేది తెరపైకి ఎందుకు వస్తుంది అనేదే ఇక్కడ అసలు విషయం. ఈ ఘటన జరగగానే.. అతడు టీడీపీకి చెందిన వాడు అని తెలియగానే.. అధికార పక్షం ఎందుకు సైలంట్ గా ఉండాలి.. ఆ నిందితుడు వైకాపాకు చెందిన వాడు అని కాస్త గాసిప్స్ బయటకు రాగానే.. మైకుల ముందుకు అప్పుడొచ్చి ఎందుకు స్పందించాలి.. స్పందించే విధానం అదేనా? ఈ విషయాలు అధికార టీడీపీ నేతలు ఎందుకు మరిచిపోతున్నారనేది ఇక్కడ విషయం!

కథువా ఘటనకు బాధ్యత వహిస్తూ… ప్రధానిని రాజీనామా చేయమన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. దాచేపల్లి ఘటనకు ఎందుకు బాధ్యత వహించరు అనేది ఇక్కడ ఎదురవుతున్న మరో ప్రశ్న. అలా అని చంద్రబాబుకు రాజినామా చేసేటంత చిత్తశుద్ధి లేకపోవచ్చు గాక.. కనీసం స్పందించాల్సిన స్థాయిలో కూడా ఎందుకు స్పందించలేదు! ఈ విషయాలపై ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వాలి! ఇచ్చి తీరాలి!! ఎందుకంటే… జరిగింది చిన్న విషయం కాదు! సుబ్బయ్య ఆత్మహత్య చేసేసుకున్నాడు కాబట్టి… ఈ విషయం ముగిసిన అధ్యాయం అనుకుంటే పొరపాటే! ఇది సుబ్బయ్యకు మాత్రమే సంబందించిన విషయం కాదు.. ప్రజలపట్ల, తమ పార్టీలకు సంబందించిన నేరస్థుల పట్ల ప్రభుత్వాలకు ఉన్న చూపులోని వ్యత్యాసానికి సంబందించిన విషయం!

దుర్మార్గాలకు పాల్పడిన వారికి శిక్షించే విషయంలో, ఆ సంఘటనలో బాదితులకు తోడుగా నిలిచే విషయంలో.. పార్టీ కండువాలగురించి ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించాలి! ఈ విషయంలో ఆలోచించాల్సింది ప్రజలు!! పార్టీలు అండగా ఉన్నవారు ఏ నేరాలు అయినా చేయొచ్చా.. అలాంటి పార్టీలకు, ప్రభుత్వాలకు ఎలా బుద్ది చెప్పాలి? అనే విషయాలు ప్రజలంతా ఆలోచించాల్సిన సమయం ఇది! అలాకాని పక్షంలో.. దుర్మార్గులకు ఆయా రాజకీయ పార్టీలు తోడుగా నిలిచి, వారు మరింత చెలరేగి పోయే పరిస్థితి తీసుకొస్తారు!! తస్మాత్ ప్రజా!!