Home రాజకీయాలు చంద్రబాబు తప్పుల వల్ల బిసీల ఆత్మాభిమానం దెబ్బతిందా?

చంద్రబాబు తప్పుల వల్ల బిసీల ఆత్మాభిమానం దెబ్బతిందా?

SHARE

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న తప్పుల వల్ల ఒక్కో వర్గం ఆయనకు దూరం అవుతోంది. తాజాగా వెనుకబడిన తరగుతుల వారు చంద్రబాబు తీరుపై విమర్శలు గుప్పిస్తున్న తీరు రాష్ట్ర రాజకీయాలలో ఒక పెను మార్పునకు సంకేతమనే చెప్పాలి. జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఎపిలో ప్రభుత్వ అరాచకాలు, అక్రమాలు, అవినీతి, చంద్రబాబు కుమారుడు లోకేష్ అవినీతిపై తీవ్ర స్థాయి ఆరోపణలు చేసి టిడిపి తో ఉన్న భాగస్వామ్యాన్ని వదలుకున్నారు.

కాపులకు రిజర్వేషన్ ల అంశంపై బిసి వర్గాలలో తీవ్ర వ్యతిరేకత ఉంది. బిసిలకు సంబందించి ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన అనేక హామీలు నెరవేరలేదని బిసి సంఘాల నేతలు చెబుతారు. అసలే ఆ కోపం తో వారు ఉంటే రిటైర్డ్ న్యాయమూర్తి ఈశ్వరయ్య బహిర్గతం చేసిన ఒక లేఖ విషయం తెలుగుదేశం లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇద్దరు బిసి న్యాయవాదులు, ఒక బ్రాహ్మణ న్యాయవాది జడ్జిలు కాకుండా ఉండడానికిగాను చంద్రబాబు వారిపై పలు ఆరోపణలు చేస్తూ కేంద్రానికి లేఖ రాశారు. అందులో లైంగిక వేదింపులు, ఇతర పలు ఆరోపణలు ఉన్నాయి.

సాదారణంగా ఒక ముఖ్యమంత్రి ఇలాంటి ఆరోపణలు చేస్తే కేంద్రం వారికి జడ్జి పదవులు ఇవ్వడం కష్టమే. కాని ఇక్కడ కేంద్ర నిఘా శాఖ ఐబి విచారణ చేసి చంద్రబాబు లేఖలో వాస్తవాలు లేవని తేల్చింది. దాంతో కేంద్రం చంద్రబాబు లేఖను పక్కన బెట్టి ఆ బిసి లాయర్లు, బ్రాహ్మణ లాయర్ కు జడ్జి పదవి ఇచ్చేసింది. ఇది సంచలన విషయమే.

నిజంగానే చంద్రబాబు తప్పుడు లేఖ రాసి ఉంటే బిసి లాయర్లు జడ్జి లు అవుతుంటే అడ్డుపడినట్లు అవుతుంది. ఒక వేళ ఐబి నివేదిక తో చంద్రబాబు విభేదిస్తే దానిని ఖండిస్తూ మళ్లీ లేఖ రాసి ఉండాల్సింది. కాని అలా జరిగినట్లు లేదు. అందువల్ల చంద్రబాబు వీరి విషయంలో అసత్యాలు చెప్పారన్నది రూడి అవుతుంది. ఇది బయటకు వచ్చాక చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన తరగతులను దూరం చేయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ కాని, ఇతర పక్షాలు కాని చంద్రబాబును బిసి లాయర్లకు వ్యతిరేకంగా లేఖ రాయమని చెప్పాయా.. లేదు కదా.

చంద్రబాబు తన మీడియా సమావేశంలో తను రాసిన లేఖ గురించి మాట్లాడకుండా ఏవేవో చెబితే సరిపోతుందా. ఈ విసయం క్రమేపి పెరుగుతూ బిసిలకు చెందిన అన్ని వర్గాలలో తీవ్ర అసంతృప్తి రగిల్చింది. ఇక్కడ వారు ఒక విషయం ప్రస్తావిస్తున్నారు. తనకు కావల్సిన వ్యక్తి ఒకరిపై కేసు ఉన్నా గతంలో ఎలా జడ్జి పదవికి సిఫారస్ చేశారని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం బిసి వర్గాల సెంటిమెంటుగాను, ఆత్మగౌరవంగాను మారుతోంది.

చంద్రబాబు చేసిన చర్యతో వారి ఆత్మాభిమానం దెబ్బతినట్లయిందన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇదే కాకుండా బిసిలలో ఉన్న పలు వర్గాల వారిని ఎస్.సి, లేదా ఎస్టిలలోకి మార్చుతామని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఉదాహరణకు బోయ వర్గానికి ఎస్.టి.హోదా ఇస్తామని అన్నారు. కాని అది జరగలేదు. తన చేతిలో ఉన్నా, లేకపోయినా, ఓట్ల రందిలో ఏది బడితే అది హామీగా ఇచ్చేసి ఆయా వర్గాలను మోసం చేశారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. ఇప్పుడు అవే హామీలు చంద్రబాబు మెడకు చుట్టుకుంటున్నాయి. ఆయా వర్గాలు చంద్రబాబు ప్రబుత్వాన్ని నిలదీసేందుకు సిద్దమవుతున్నాయి.

ఇంత జరిగినా తెలుగుదేశంలోని బిసి మంత్రులు ఎవరూ చంద్రబాబు ను ప్రశ్నించే ధైర్యం చేయలేకపోతున్నారు. చంద్రబాబు సేవలో తరించడానికే యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నేత సైతం వ్యవహరించడం బిసివర్గాలకు తీరని అన్యాయం చేసినట్లుగా ఉంటుంది. పదవుల కోసం వీరు బిసిలను బలి చేయడానికి వెనుకాడరన్న అపకీర్తిని మూటగట్టుకుంటున్నారు. అందుకే జస్టిస్ ఈశ్వరయ్య చేసిన ఆరోపణలకు నేరుగా చంద్రబాబుకాని, యనమల కాని సమాదానం చెప్పకుండా కుట్ర అని చెప్పి ప్రజలను మబ్య పెట్టాలని చూస్తున్నారు. మరి ఆత్మగౌరవం కలిగిన వెనుకబడిన వర్గాల వారు ఎవరైనా ఈ అవమానాన్ని భరిస్తారా!