Home రాజకీయాలు వైసిపి 14, 15 తేదీల్లో పాదయాత్రలు

వైసిపి 14, 15 తేదీల్లో పాదయాత్రలు

SHARE

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన చారిత్రాత్మక ప్రజాసంకల్పయాత్ర ఈనెల 14వ తేదీన 2000 కిలోమీటర్ల మైలురాయిని దాటనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది,  పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని పెంపొందించాలని పార్టీ ఒక కార్యాచరణను రూపొందించింది. నాలుగు సంవత్సరాలలో చంద్రబాబునాయుడు ప్రభుత్వ వైఫల్యాలను, ఎన్నికల హామీలను నెరవేర్చని వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు పాదయాత్రలు చేపట్టాలని పార్టీ పిలుపు నిచ్చింది.

ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక సర్క్యులర్‌ను విడుదల చేసింది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పట్ల జగన్‌కు గల సంకల్పాన్ని, ప్రజల సంక్షేమం కోసం ఆయన చేపట్టబోయే పథకాలను ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియ జేయాలని పార్టీ కోరింది. రెండు రోజుల పాదయాత్ర ముగిసిన తరువాత మరుసటి రోజైన 16వ తేదీన 13 జిల్లాల్లో కలెక్టర్‌లకు పార్టీ తరపున వినతి పత్రాలను సమర్పించాలని కోరింది. ఆ తరువాత పార్టీ నేతలు, శ్రేణులు కలెక్టర్‌ కార్యాలయాల వద్ద బహిరంగ సభలు నిర్వస్తారు. జగన్‌ 2000 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పెద్ద ఎత్తున చంద్రబాబు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని, అదే విధంగా ఎన్నికల హామీలను నెరవేర్చని వైనాన్ని ప్రజలకు వివరించాలని కోరింది.