Home సినిమా మహానటి ఆడియో లాంచ్: తాత‌య్య పాత్ర చేసే ద‌మ్ము నాకు లేదు – ఎన్టీఆర్‌

మహానటి ఆడియో లాంచ్: తాత‌య్య పాత్ర చేసే ద‌మ్ము నాకు లేదు – ఎన్టీఆర్‌

67
SHARE

ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన చిత్రం ‘మహానటి’. సావిత్రి పాత్రను కీర్తీ సురేశ్‌ పోషించారు. సమంత, దుల్కర్‌ సల్మాన్, విజయ్‌ దేవరకొండ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్, స్వప్నా సినిమాస్‌పై ప్రియాంకా దత్‌ నిర్మించారు.

హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘‘ఒక గొప్ప విషయాన్ని చెప్పబోతున్నప్పుడు మనకు వెతుక్కోవల్సిన అవసరం ఉండదు. అది నేచర్‌ ఇచ్చేస్తుంది. అలాగే ఆ మహానటి వేషం వేయటానికి కీర్తీని, ఇతర పాత్రలకు దుల్కర్, సమంత, విజయ్‌ వీళ్లందర్నీ తీసుకువచ్చింది. గొప్పవాళ్లు భౌతికంగా మనకి దూరం అవ్వచ్చు కానీ వాళ్ల సౌరభం మన చుట్టూనే ఉంటుంది. సావిత్రిగారే పట్టుబట్టి నా జీవితాన్ని కథగా మలిచి ఓ సినిమా తీయండి అని వీళ్లను ఎన్నుకున్నారు’’ అన్నారు ఎన్టీఆర్‌.

నాకు ఈ ఆడియో ఫంక్షన్‌లో సావిత్రిగారి హుందా గురించి మాట్లాడే అర్హత ఇప్పుడు కాదు.. బహుశా ఎన్ని జన్మలు ఎత్తినా రాదేమో. ట్రూ లేడీ సూపర్‌స్టార్‌ సావిత్రిగారు. ఆవిడ ఔన్నత్యం ముందు ఆమె పేరు కూడా ఎత్తటానికి సరిపోం మనం. ఆవిడ ఎలా పోయారు? అనేకంటే ఆవిడ ఎలా బ్రతికారు అని చూపించే చిత్రం ఇది. కొంతమంది జీవితం తెలుసుకోవటం అవసరం.  కొందరు సాధించిన విజయాల్ని తెలుసుకొని స్ఫుర్తిగా తీసుకోవాలి. అలాంటి కథను తీసుకు వస్తున్నాడు దర్శకుడు నాగీ.

ఈ సినిమా తీయటానికి నాగీకి ఎంత అనుభవం ఉంది అనేకంటే సావిత్రిగారి మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలి. ఈ చిత్రాన్ని తనొక దర్శకుడిగా కంటే అభిమానిగా తీశాడని అనుకుంటాను. తనకు అండగా ప్రియాంకా, స్వప్నా ఉన్నారు. స్వప్నా నా దగ్గరకు వచ్చి, ఈ సినిమాలో తాతగారి (నందమూరి తారక రామారావు) పాత్ర చేయమని అడిగింది. కానీ ఆయన పాత్రను పోషించడం ఈ జన్మలో జరగని పని. నాకు బేసిక్‌గా ఈ చిత్రంలో రామారావుగారి పాత్ర పోషించే దమ్ము లేదు. మనకు తెలిసిన కథలో, ఆ కథలోని వ్యక్తిలాగా నటించడం చాలా కష్టం. అది నటిస్తే జరగదు. జీవిస్తే జరుగుతుంది. కీర్తీ సురేశ్, దుల్కర్‌ సల్మాన్, సమంత, విజయ్‌ దేవరకొండ ఈ నలుగురూ వాళ్ల వాళ్ల పాత్రల్లో జీవించారు.

వైజయంతి  మూవీస్‌ తాతగారి వల్ల మొదలైంది. స్వప్న సినిమాస్‌ నా ‘స్టూడెంట్‌ నెం.1’తో మొదలైంది. ఈరోజు ఇంత గొప్ప సినిమా తీస్తారని అనుకోలేదు. ఈ సినిమాకు పని చేసిన అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ఈ మధ్య ఆడవాళ్ల మీద ఆకృత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక్కసారి ఈ సినిమా చూశాక ఎందుకు మనం మగాళ్లుగా పుట్టాం అని అనుకుంటారు. ఒక స్త్రీ బలమేంటో.. ఆడవాళ్లు తలుచుకుంటే ఏం సాధిస్తారో సావిత్రిగారు చూపించారు. ఇప్పటికైనా ఆడవాళ్లను గౌరవిస్తారని కోరుకుంటున్నాను’’ అన్నారు ఎన్టీఆర్‌.

‘‘సావిత్రిగారి గురించి మాట్లాడే వయసు నాకు లేదు. కీర్తీ ఎంత కష్టపడిందో తెలుసు. ఇందులో పని చేసిన అందరితో నాకు అనుబంధం ఉంది.  ఫస్ట్‌ టైమ్‌ అనిపిస్తోంది నా సినిమాలో నేను లేనే అని. ఇందులో నేనూ యాక్ట్‌ చేయాల్సింది. కుదర్లేదు. నాగీ సినిమాల్లో ఒక నిజాయితీ ఉంటుంది. ఇందులోనూ కనిపిస్తుంది’’ అన్నారు నాని.

కీర్తీ సురేశ్‌ మాట్లాడుతూ– ‘‘నాని ద్వారా  ఈ సినిమా గురించి విన్నాను. నాగీ, స్వప్నా నా దగ్గరకి వచ్చి, నువ్వు టైటిల్‌ రోల్‌ చేయాలన్నారు. నేను సావిత్రిగారి పాత్ర చేయడమేంటి? అనుకున్నాను. కానీ నాగీ కాన్ఫిడెన్స్‌ ఇచ్చారు. మనం సావిత్రిగారికి ఇచ్చే నివాళి అని చెప్పారు. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్‌ నాగీ. సావిత్రిగారు ఎక్కడున్నా మమ్మల్ని ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు.

‘‘గర్వంగా ఉంది. ఇలాంటి సినిమాలో చేసినందుకు. రిస్క్‌తీసుకున్నాను. మొయిన్‌ హీరోయిన్‌ కాదు. కానీ కచ్చితంగా చెప్పాల్సిన కథలో భాగమవ్వాలని ఒప్పుకున్నాను. నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నాను. ఒక సీన్‌ చేసినప్పుడు గ్లిజరిన్‌ వాడలేదు. ఆ సీన్‌ కోసమే డబ్బింగ్‌ చెప్పుకున్నాను. సావిత్రిగారి ప్రొఫెషన్‌లో నేనూ ఉన్నందుకు గర్వంగా ఉంది. వైజయంతి మూవీస్‌ తెలుగు సినిమా షైన్‌ అయ్యేలా చేస్తున్నారు. కీర్తీ ట్రాన్సఫర్మేషన్‌ చూసి షాక్‌ అయ్యాను’’ అన్నారు సమంత.

‘‘వైజయంతి మూవీస్‌లో సినిమా చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్‌. జెమినీగా నా నటన మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు దుల్కర్‌ సల్మాన్‌. ‘‘ఫస్ట్‌ సినిమాతో నాగి నన్ను హిమాలయాలకు తీసుకువెళ్లాడు. మళ్లీ 80లోకి తీసుకువెళ్లాడు. ఇందులో చిన్న పాత్ర చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు విజయ్‌ దేవరకొండ.