Home రాజకీయాలు బీజేపీలోకి సుజనా చౌదరి జంప్‌ నిజమేనా?

బీజేపీలోకి సుజనా చౌదరి జంప్‌ నిజమేనా?

SHARE

తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు.. బాబు ఆర్థిక వ్యవహారాల్లో కీ రోల్ గా పేరున్న మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి పార్టీ మారబోతున్నారన్న వార్త ఆ పార్టీ నేతల్లో గుప్పుమంది. టీడీపీలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఎంతో సన్నిహితంగా ముఖ్యంగా పార్టీ ఆర్థిక వ్యవహారాల్లో కీలకపాత్ర పోషించే సుజనా చౌదరి పార్టీ  ఇంతకాలం కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన సుజనా చౌదరి మంత్రివర్గం నుంచి బయటకొచ్చిన కొద్ది రోజుల తర్వాత కాలం నుంచి ఆయన బీజేపీలో చేరబోతున్నారని టీడీపీ వర్గాల్లో చర్చోపచర్చలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన కుమారుడు లోకేష్ కు కూడా అత్యంత సన్నిహితంగా ఉంటున్న సుజనా చౌదరి బీజేపీలో చేరడమేంటన్న అంశంపైనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరి పార్టీ మారాలన్న ఆలోచన వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉండొచ్చని టీడీపీలోనే బలంగా వినిపిస్తోంది.  చంద్రబాబును కాదని ఏ పనీ చేయని సుజనా చౌదరి ఉన్నట్టుండి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకోవడం పట్ల రాజకీయవర్గాల్లో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుజనా చౌదరి కేంద్రంలో మంత్రిగా కొనసాగినన్ని రోజులు చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకున్నారు.  కేబినేట్ హోదాలో ఉన్న అశోక గజపతి రాజుకన్నా కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్న అనేక విషయాలకు సంబంధించి సుజనా చౌదరి ద్వారానే చంద్రబాబు సమాచారం తెప్పించుకునే వారని పార్టీ వారు చెబుతుంటారు. పైగా 2009, 2014 ఎన్నికల సందర్భంలో పార్టీ ఆర్థిక లావాదేవీల నిర్వహణలో సుజనా చౌదరి కీలక పాత్ర పోషించారని అంటారు. అలాంటి సుజనా చౌదరి బీజేపీలో చేరడంలోని ఆంతర్యమేంటన్న చర్చ సర్వత్రా మొదలైంది.

రాజకీయంగా సుజనా చౌదరి ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ పాల్గొనలేదు. పైగా ఆయన చేరికవల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీకి పెద్దగా ఒరిగే అదనపు ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. ఢిల్లీ స్థాయిలో బీజేపీకి చెందిన కొందరు ముఖ్య నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న సుజనా చౌదరి చేరికను స్థానిక బీజేపీ నాయకత్వం అంతగా పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ ఆయన బీజేపీలో చేరడానికి సిద్ధపడటం వెనుక బలమైన కారణం ఏదో ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది. నాలుగేళ్ల పాటు కేంద్రంలో బీజేపీతో అధికారం పంచుకున్న చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో ప్రత్యేక హోదా అంశంపై ప్రజల ఆగ్రహజ్వాలల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. పైకి అలా చేసినప్పటికీ చంద్రబాబు ఇప్పటికీ బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవలి టీటీడీ పాలక మండలి నియామకం విషయంలో కూడా ఆ విషయం బయటపడింది. గత సంప్రదాయాలకు విరుద్ధంగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక మంత్రి సుధీర్ మునగంటివార్ భార్యను టీటీడీ పాలక మండలి సభ్యురాలిగా నియమించడం కూడా అందులో భాగంగానే జరిగిందని చెబుతున్నారు.

భవిష్యత్తు అవసరాలు, బీజేపీతో దూరం జరగడం ఇష్టం లేని చంద్రబాబు ముందస్తు రాజకీయ ఆలోచన మేరకే  అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరిని బీజేపీలోకి పంపిస్తున్నారని టీటీపీలోని కొందరు కీలక నేతలు ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.