Home రాజకీయాలు టీడీపీకి మళ్లీ పవన్ కావాలా?

టీడీపీకి మళ్లీ పవన్ కావాలా?

SHARE

రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మితృలు ఉండరనేది జగమెరిగిన సత్యమే! మరోమాటగా చెప్పుకోవాలంటే.. రాజకీయాల్లో ఏ బందమైనా, ఎలాంటి బందమైనా సాధ్యమే! గతంలో బీజేపీతో కలవడం, తాను చేసిన చారిత్రక తప్పిదం అన్న చంద్రబాబు.. మరోసారి బీజేపీతో జతకట్టడం తెలిసిన విషయమే! ఆ సమయంలో మోడీకంటే గొప్పోడు లేడన్న బాబు.. ఇప్పుడు మోడీ అంత మోసగాడు లేరు అన్నట్లు ప్రకటిస్తున్న సంగతీ చూస్తున్నాం. ఇదే క్రమంలో 2014 ఎన్నికల్లో కలిసి పనిచేసి, తాజాగా తెగ తిట్టేసుకుంటున్నా టీడీపీ – జనసేనలు.. కలుస్తున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి! తాజా పరిస్థితుల నేపథ్యంలో.. టీడీపీ, పవన్ వైపు చూస్తుందనే సంకేతాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి!!

ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడు రాష్ట్రానికి అవసరం… ఇది 2014 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ చెప్పిన మాట! బాబు హయాంలో జరుగుతున్న అవినీతి, స్వయంగా ఆయన పుత్రరత్నం చేస్తున్న బరితెగించిన అవినీతి.. చంద్రబాబు దృష్టికి రావడం లేదా లేక.. వచ్చినా పట్టించుకోవడం లేదా..? ఇది కొన్ని నెలల క్రితం పవన్ మాట! లోకేష్ చేస్తున్న అవినీతికి సంబందించి తనవద్ద పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయని నొక్కి చెప్పారు పవన్! ఇదే క్రమంలో కొన్ని మీడియా చానళ్ల వెనక లోకేష్ ఉండి రూ.10కోట్లు ఖర్చుపెట్టి తనపై మీడియా అత్యాచారం చేస్తున్నారని ఆరోపించిన సంగతీ తెలిసిందే! అయితే ఈ విమర్శలపై లోకేష్ స్పందించిన తీరు.. కొత్త అనుమానాలకు తావిస్తుంది!!

లోకేశ్ అవినీతి మీద తన దగ్గర ఆధారాలు ఉన్నాయని పవన్ వ్యాఖ్యానించిన సందర్భంలో లోకేష్ ఏ స్థాయిలో రియాక్ట్ అయ్యారనేది అందరికీ తెలిసిన విషయమే! అయితే… తాజాగా రూ.10 కోట్ల మీడియా అత్యాచారం పై మాత్రం చినబాబు మాటల్లో వాడి వేడీ పూర్తిగా మారిపోయాయి! తాజాగా తనపై పవన్ చేసిన ఆరోపణలపై స్పందించిన లోకేష్… పవన్ తప్పుడు దారిలో నడుస్తున్నట్లుగా వ్యాఖ్యానించడం మొదలుపెట్టి.. పవన్ ను కొందరు తప్పుడు దారి పట్టించారని.. పవన్ మంచోడని.. ఆయనపై తనకు మంచి అభిప్రాయం ఉందని చెప్పుకొస్తున్నారు!!

ఇక్కడే మొదలవుతున్నాయి అసలు అనుమానాలు! తాజాగా పవన్ విషయంలో లోకేష్ స్పందించిన తీరు… “టీడీపీ చూపు మళ్లీ పవన్ వైపు” అనే సంకేతాలు ఇస్తుందని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో… టీడీపీ పరిస్థితి అత్యంత అద్వాన్నస్థితికి పడిపోతుందనడంలో సందేహం లేదనేవారే ఎక్కువ! ఈ పరిస్థితుల్లో ఇటు వైకాపా అధినేత జనాలకు మరింత చేరువవుతూ.. పూర్తి నమ్మకాన్ని సంపాదించుకుంటున్నారు! ఈ క్రమంలో సినిమా గ్లామర్ అవసరం బాబుకు మరలా వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు! ఈ సమయంలో పవన్ మరలా తోడయితే… కనీసం డిపాజిట్లయినా దక్కుతాయనేది వారి ఆలోచనగా ఉందని తెలుస్తుంది!!

ఇవన్నీ పవన్ పై తాజాగా లోకేష్ స్పందించిన విధానానికి సూచనలు అనేది పలువురి మాటగా ఉంది! పవన్ చాలా మంచోడని, ఆయన్ను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని లోకేష్ స్పందించడం.. లోకేష్ కు పవన్ ఎంత అవసరం అనే విషయం చెప్పకనే చెప్పినట్లయ్యిందనేది మరికొందరి అభిప్రాయం!! ఏమో… రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు!!