Home రాజకీయాలు ఫ్యాన్ కిందకి కన్నా… వెయిటింగ్?

ఫ్యాన్ కిందకి కన్నా… వెయిటింగ్?

86
SHARE

అవకాశవాదం అనేది రాజకీయాలనుంచి పుట్టింది అన్నా అతిశయోక్తి కాదేమో!! ఏరు దాటాక తెప్ప తగలేయడం అనే సామెత రాజకీయ నాయకుల నుంచి పుట్టిందేమో!! గతంలో వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగి.. ఆయన మరణానంతరం స్వల్పకాల ప్రయోజనాలకోసం కక్కుర్తిపడి గోడ దూకిన పలువురు నేతలు మరళా జగన్ వైపు చూస్తున్నారనే కథనాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన పలువురు సీనియర్ నేతలు.. అనంతర కాలంలో జగన్ తో కలిసి నడవలేదు. ఎవరి బ్రతుకు వారు చూసుకుని వేరే జెండాల కిందకు చేరిపోయారు. ఓడలు బల్లవుతాయి బల్లు ఓడలవుతాయి అన్న చందంగా పరిస్థితులు మారిపోయాయి. గతంలో వైఎస్సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనాల దగ్గర సంపాదించుకున్న పేరు, పోరాడే నాయకుడనే మాట తాజాగా జగన్ సంపాదించుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర విభజన అనంతరం వేరే జెండాలకిందకు చేరిన పలువురు సీనియర్లు.. ఇప్పుడు జగన్ కోసం ఎదురుచూస్తున్నారట.. ఫ్యాన్ కిందకు చేరిపోవాలని చూస్తున్నారట.

ఎవరు అవునన్నా కాదన్నా.. ప్రస్తుతం టీడీపీకి వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి! ఈ క్రమంలో భవిష్యత్తు జగన్ దే అని గమనించిన పలువురు సీనియర్లు.. ఫ్యాన్ కిందకు చేరాలని భావిస్తున్నారట. వీరిలో వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగి మంత్రిగా కూడా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ… జగన్ పార్టీలో చేరడానికి ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. ఇదే క్రమంలో మరికొందరు సీనియర్లు సైతం జగన్ వెంట నడవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారట. అయితే.. వీరంతా జగన్ పిలుపు కోసం, జగన్ సిగ్నల్ కోసం చూస్తున్నారని సమాచారం!

దీనికి రెండు కారణాలు చెబుతున్నారు విశ్లేషకులు! ఒకటి ప్రస్తుతం ఏపీలో రాష్ట్ర విభజన అనంతరం అటు కాంగ్రెస్ కు కానీ, ప్రత్యేక హోదా విషయంలో ఇటు బీజేపీకి కానీ మనుగడ ఉండకపోవచ్చని తెలుస్తుంది. ఈ క్రమంలో గత సార్వత్రిక ఎన్నికల్లో బాబు చేసిన హామీలకు.. వాటిని నెరవేర్చాలని అనే ఆలోచన చేయకపోవడం తో టీడీపీ పరిస్థితి కూడా ప్రశ్నార్ధకం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ దశలో జగన్ మాత్రమే వారికి దిక్కుగా కనిపిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు!! మరి ఈ విషయంలో జగన్ అభిప్రాయం ఎలా ఉందనేది తెలియాలంటే కాస్త సమయం వేచి చూడాలి మరి!!