Home రాజకీయాలు బాలకృష్ణకు మినహాయింపులు ఎలా దక్కాయి!

బాలకృష్ణకు మినహాయింపులు ఎలా దక్కాయి!

SHARE

చట్టం కొందరికి చుట్టమన్న విమర్శకు నిలువెత్తు నిదర్శనం నటుడు బాలకృష్ణ. మనోడైతే ఒక వ్యక్తి తప్పులను కూడా తెలుగు మీడియా ఎలా ఒప్పులుగా చూపిస్తుందన్న దానికి కూడా బాలకృష్ణే నిలువెత్తు సాక్ష్యం. చివరకు ప్రతిపక్ష వైసీపీ కూడా బాలకృష్ణను పసిబాలుడిలా చూసి వదిలేసే పరిస్థితి వచ్చిందంటే టీడీపీ, ఒక వర్గం మీడియా సమాజాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు.

నిజానికి బాలకృష్ణ చేస్తూ వస్తున్న నేరాలు చిన్నవి కాదు. జింకలు కాల్చిన కేసులో సల్మాన్‌ ఖాన్‌ ఇప్పటికీ ముప్పుతిప్పులు పడి మూడు చెరువుల నీరు తాగుతున్నారు. కానీ బాలకృష్ణ ఏకంగా ఒక వ్యక్తిపై కాల్పులు జరిపినా… ఆ తర్వాతి కొద్ది రోజులకు ఆయన ఇంటిలో సెక్యూరిటీ గార్డ్‌ చనిపోయినా ఇక్కడి వ్యవస్థలు స్పందించలేదు.

నాటి ముఖ్యమంత్రి వైఎస్ దయతలిస్తే బాలకృష్ణ ఊచలు లెక్కించకుండా బయటపడ్డారన్నది జగమెరిగిన సత్యమే. కానీ వైఎస్‌ తనకు చేసిన సాయానికి కృతజ్ఞత లేకుండా ఆయన కుమారుడు జగన్‌ జైలుకు వెళ్లినప్పుడు సంబరపడ్డ వారిలో నందమూరి హీరో కూడా ఉన్నారు. ఒక వ్యక్తిని తుపాకీతో కాల్చినా సరే ఈ చట్టం, వ్యవస్థ తనను కనీసం కాలర్‌ కూడా పట్టుకోలేకపోయిందన్న ధైర్యమే కాబోలు.. నాటి నుంచి బాలకృష్ణ తనకుతాను ఒక అతీతమైన వ్యక్తిగా భ్రమిస్తూ సమాజంలో సంచరిస్తున్నారు.

బాలకృష్ణ తప్పు చేసిన ప్రతిసారి ఒక వర్గం మీడియా ఆయనకు వంత పాడే విధానం కూడా ఆమోఘంగా ఉంటుంది. అమ్మాయి కనిపిస్తే కడుపైనా చేయాలని, ముద్దయిన పెట్టాలని ఒక హీరో, అందున ఒక ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ వ్యాఖ్యలు చేస్తే దాన్ని ప్రసారం చేసేందుకు కూడా మీడియాకు మనసు రాలేదు. జనంలోకి వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక అభిమాని చెంపచెల్లుమనిపించి అవమానించినా ఇదేంటి అని ప్రశ్నించే వారు లేరు.

ఇలా తమ బాలకృష్ణ వరుసగా తప్పులు చేస్తుండడం, ఆయన తీరు మారుతుందన్న నమ్మకాన్ని కోల్పోయిన మీడియా ఇటీవల కొత్త తరహా ప్రచారం మొదలుపెట్టింది. బాలకృష్ణ మంచివాడు, పసిపిల్లాడి మనస్తత్వం, ఆయన ఏది మనసులో దాచుకోలేరు.. ఉన్నది ఉన్నట్టు బయటకు చెప్పేస్తారు.. ఆ మంచి లక్షణమే బాలకృష్ణ ఇబ్బందిగా మారిందంటూ కథనాలు ప్రసారం చేస్తూ బాలకృష్ణ చేసే నేరాల తీవ్రతను ప్రజలు తీవ్రంగా భావించకుండా ఒక వర్గం మీడియా చాపకింద ప్రచారం సాగించింది.

నడి రోడ్డు మీద పది మంది సమక్షంలో అభిమానులను పదేపదే బాలకృష్ణ కొట్టి అవమానిస్తుంటే.. బాలయ్య చేతి స్పర్ష తగలడం కూడా ఒక విధంగా అదృష్టమేనని ప్రచారం చేసిన ఘనత కూడా తెలుగు మీడియాకే దక్కుతుంది. బాలకృష్ణ తరహాలోనే ఏ పవన్‌ కల్యాణో, ఏ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డో, మరో హీరోనో ఇలా కొట్టి ఉంటే ప్రైమ్‌ డిబేట్లు పెట్టి ఉతికేయకుండా ఈ టీవీ చానళ్లు నిద్రపోయేవా!.

అంటే బాలకృష్ణ కాల్పులు జరిపినా, అమాయకులను కొట్టినా, అమ్మాయిలకు కడుపు చేసేయండని బహిరంగంగా పిలుపునిచ్చినా .. ప్రతిపక్షాలు కూడా సీరియస్‌గా తీసుకోలేని పరిస్థితి వచ్చిందంటే తెలుగు సమాజంలో చట్టం నడత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాలకృష్ణది పిల్లల మనస్తత్వం అన్న వాదన సరే.. మరి పసి పిల్లలు నేరం చేసినా వారిని జువైనల్‌ హోంకు తరలిస్తారు. మరి ఆరు పదుల వయసున్న అగ్ర నటుడు, ఒక ఎమ్మెల్యే ఇలా వరుసగా తప్పులు చేస్తుంటే మాత్రం చట్టం, సమాజం సర్దుకుపోవడం అంటే ఇది బానిసస్వాభావమే.