Home రాజకీయాలు జగన్ – జనం: టీడీపీ ఆత్మవంచన!

జగన్ – జనం: టీడీపీ ఆత్మవంచన!

SHARE

ప్రస్తుతం భారీఎత్తున సాగుతున్న జగన్ పాదయాత్ర టీడీపీ నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది అనడంలో సందేహం లేదు! తాజాగా గుంటూరు, విజయవాడల్లో సాగిన పాదయాత్ర, జగన్ సభలకు భారీగా తరలివస్తున్న జనం, ప్రసంగం మొత్తం పూర్తయ్యేవరకూ ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా, ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా ఓపికగా ప్రసంగం మొత్తం ఆలకిస్తున్న జనం, పాదయాత్రలో రోజు రోజుకీ పెరిగిపోతున్న పాదాల సంఖ్య. వీటన్నింటినీ చూసి టీడీపీ పై జనాల్లో వ్యతిరేకత ఏస్థాయిలో ఉందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. అయితే జగన్ యాత్రలకు, సభలకు భారీగా వస్తున్న జనాలపై టీడీపీ ఆత్మవంచన విశ్లేషణలు చేస్తుందట!

జగన్ సభలకు భారీ ఎత్తున, ఎవరూ ఊహించని స్థాయిలో జనాలు వస్తున్నారు.. జగన్ చెప్పే ప్రసంగం అంతా ఆసక్తిగా, శ్రద్దగా వింటున్నారు. హర్షధ్వానాలు చేస్తున్నారు, మాట మాటకు అరుపులు కేకలు ఈలలతో తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అయితే ఇది కచ్చితంగా టీడీపీపైనా, చంద్రబాబుపాలనపైనా ప్రజల్లో పెరిగిపోతున్న వ్యతిరేకతే అనేది విశ్లేషకుల మాట. ఇదే క్రమంలో స్థానిక టీడీపీ నేతలపై జనాలకు వచ్చిన విసుగు కూడా ఇందుకు కారణం అని వారు చెబుతున్నారు. అయినా కూడా టీడీపీ ఆత్మవంచన దిశగానే ఆలోచిస్తుంది.

ప్రభుత్వంపై అసంతృప్తి.. స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత.. లేకపోతే మార్పు కోసం పరుగులు తీస్తున్న జనం.. ఈ విషయాలను మరిచిన, ఏమాత్రం మెదడుతో ఆలోచించని టీడీపీ నేతలు కొందరు మాత్రం… జగన్ సభలకు జనాలను తరలిస్తున్నారని చెప్పుకుంటున్నారు! ఆత్మవంచనకు ఇంతకు మించి నిదర్శనం ఉంటుందా? స్వచ్ఛందంగా ప్రజలు వచ్చారా? లేక తరలించారా? అనే అంశంపై ఆరా తీసిన టీడీపీ నేతలకు షాకింగ్ రిప్లై వచ్చినా కూడా వారు మాత్రం తాము ఎంచుకున్న మాటలనే అధినేతకు చెప్పుకుని మురిసిపోతున్నారట.

గుంటూరు, విజయవాడల్లో జరిగిన జగన్ సభలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ముఖ్యంగా టీడీపీలో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయంట. అయితే ఈ సభలకు జనాలు వచ్చిన తీరుచూసిన స్థానిక టీడీపీ నేతలు మాత్రం… ఈ ప్రదేశాలలో సాయంత్రం అయిదు నుంచి ఎనిమిది గంటల సమయంలో ఎవరు సభ ఏర్పాటు చేసినా ఆ ప్రాంతం అంతా నిండిపోతుందని, దానికి కారణం మార్కెట్‌ సెంటర్‌లో సాయంత్ర సమయాల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి తమకు అవసరమైన సరుకులు కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తుండటమే అని.. పూలు, ఎరువులు, కిరాణా సామానులు, ఆటోమొబైల్‌ వ్యాపారాలు జరిగే ప్రదేశాలు ఇక్కడ ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ ఎవరు సభ పెట్టినా ప్రజలు అలా నిలుచుండిపోతారని ఆత్మవంచన చేసుకుంటున్నారట!

ఈ విషయం తెలిసిన వైకాపా నేతలు మాత్రం… బాబు అండ్ కో అలానే ఆలోచించుకుంటే తమకు మరింత మేలని మాట్లాడుకుంటున్నారట. గత నాలుగేళ్లుగా చంద్రబాబు పాలనలో ప్రజలు ఎంత విసిగిపోయారు, స్థానిక ఎమ్మెల్యేలపై ఎంత వ్యతిరేకతతో ఉన్నారు వంటి విషయాలపై విశ్లేషణ చేసుకునే సాహసం చేయని టీడీపీ నేతలు… ఇలా జగన్ సభలకు వచ్చే జనాలు, మార్కెట్లో సామానులు కొనుక్కోవడానికని వచ్చి నిలబడిపోయారని చెప్పుకోవడంకంటే ఆత్మవంచన మరొకటి ఉంటుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు!