Home రాజకీయాలు జాగ్రత్త పవన్… బావ చూస్తున్నాడు!

జాగ్రత్త పవన్… బావ చూస్తున్నాడు!

SHARE

టాలీవుడ్ లో కాకరేపుతున్న శ్రీ రెడ్డి.. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యిందనే చెప్పాలి. ఈ విషయం అటు తిరిగి ఇటు తిరిగి మెగా ఫ్యామిలీని తాకడం.. అనంతరం నాగబాబు వచ్చి తన తమ్ముడు దమ్మున్న మగాడని చెప్పడం తెలిసిందే. మామూలుగా కూడా సినిమా ఇండస్ట్రీకి సంబందించి కొన్ని విషయాల్లోనేకానీ, మెగా ఫ్యామిలీకి సంబందించి కానీ నాగబాబు స్పోక్స్ పర్సన్ గా వ్యవహరిస్తుంటారు!! ఈ క్రమంలో పవన్ పై కామెంట్స్ వచ్చేసరికి నాగబాబు స్పందించడం పెద్ద విషయం ఏమీ కాదు. అయితే.. ఈ వ్యవహారంలో ఎవ్వరూ ఊహించని రీతిగా అల్లు అరవింద్ స్పందించారు. పవన్ ను ఏమైనా అంటే ఊరుకునేది లేదన్న సంకేతాలు ఇచ్చారు. దీంతో కొత్త కొత్త విశ్లేషణలు మొదలయ్యాయి.

మెగా ఫ్యామిలీలో అల్లు అరవింద్, అల్లు అర్జున్ లకు పవన్ కు మధ్య కాస్త గ్యాప్ ఉందని కామెంట్స్ వినిపిస్తుంటాయి. ఇది వాస్తవమే అనే చిన్న చిన్న సందర్భాలు కూడా అప్పుడప్పుడూ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ అగుపడుతుంటాయి. ఈ క్రమంలో ఉన్నఫలంగా అల్లు అరవింద్.. పవన్ విషయంలో జోక్యం చేసుకుని, మీడియా ముందుకు రావడం పట్ల సినిమా ఇండస్ట్రీలో కంటే రాజకీయంగా కొత్త విశ్లేషణలకు దారులు తెరుచుకున్నాయి.

కాస్త గతానికి వెళ్తే… చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ అనతికాలంలోనే కాలగర్భంలో కలిసిపోవడానికి అల్లు అరవింద్ పోకడలే కారణం అని అప్పట్లో కామెంట్స్ వినిపించాయి. ప్రతీ విషయాన్ని వ్యాపార దృక్పథంతో చూస్తారనే పేరున్న అరవింద్.. ప్రజారాజ్యం పార్టీ వ్యవహారాన్ని కూడా అలానే చూశారని, ఎన్నికలకు ముందు అనంతరం జరిగిన పరిణామాలకు, వచ్చిన ఫలితాలకు ఆయనే ప్రధాన కారణం అని మెగా ఫ్యాన్స్ కూడా చెవులు కొరుక్కునేవారు! అయితే… అది గతం! మరి ప్రస్తుతం చిరంజీవి తమ్ముడు పవన్ కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టాడు.. జనాల్లో తిరిగే ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ క్రమంలో పవన్ వైపు, పవన్ పార్టీవైపు అల్లు అరవింద్ చూస్తున్నారా అనే దిశగా విశ్లేషణలు జరుగుతున్నాయి. ప్రసుతం ఏపీ రాజకీయాల్లో వైకాపా దూసుకుపోయే పరిస్థితులు కనిపించడం, నాటి కాంగ్రెస్ కు పట్టిన గతే రేపు టీడీపీకి పట్టే పరిస్థితులు కనిపించడంతో కనీసం ఎన్నో కొన్ని ఓట్లో సీట్లో జనసేనకు రాకపోతాయా.. అలాంటప్పుడు పవన్ కు కూడా దగ్గరవ్వడం బెటరనే ఆలోచనలు అల్లు అరవింద్ చేస్తున్నారేమో.. అందుకే ఉన్నఫలంగా మైకట్టుకుని పవన్ తరుపున వకాల్తా పుచ్చుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఒక వేళ ఈ అభిప్రాయాలే నిజాలైతే మాత్రం.. ఇదే ఆలోచన అల్లు అరవింద్ చేస్తుంటే మాత్రం.. కచ్చితంగా పవన్ చాలా జాగ్రత్తగా ఉండాలనేది పవన్ ఫ్యాన్స్ లో కొందరి మాటగా ఉంది! పవన్ ఏ విషయంలో అల్లు అరవింద్ ని అక్కున చేర్చుకున్న పర్లేదు, రాసుకుపూసుకు తిరిగినా పర్లేదు కానీ… పార్టీ విషయంలో మాత్రం వేలు పెట్టనివ్వొద్దని వారు సూచిస్తున్నారు! ఇది పార్టీకి ఏమాత్రం శ్రేయస్కరం కాదనేది వారి మనోగతంగా ఉంది!! మరి ఈ విషయంలో చిరు చేసిన ఆలోచనలే పవన్ కూడా చేస్తాడా? లేక.. జనసేన మరో ప్రజారాజ్యం కాకుండా జాగ్రత్త పడతారా అన్నది వేచి చూడాలి!!