Home రాజకీయాలు నో కామెంట్: యత్ర నార్యన్తు పూజ్యంతే…

నో కామెంట్: యత్ర నార్యన్తు పూజ్యంతే…

SHARE

యత్ర నార్యన్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః! యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియాః!!… ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. స్త్రీలకు ఎక్కడ గౌరవముండదో అక్కడ పనులన్నీ వ్యర్థమైపోతాయి! ఈ వాక్యాలు భారతీయుల సొంతం!! అవును.. స్త్రీలను గౌరవించాలి, స్త్రీలను పూజించాలి అని ఇక్కడ చెప్పినంత శబ్ధంతో మరెక్కడా చెప్పరన్నా అతిశయోక్తి కాదేమో! భారతదేశంలో భూమిని సైతం “భూమాత” అని గౌరవిస్తారు. లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతులను ధనానికి, విద్యకు, శక్తికి అధిదేవతలుగా ఆరాధిస్తుంటారు. చిత్రమేమిటో ఇదే భూమాతపై ఉన్న స్త్రీలకు మాత్రం రక్షణ ఉండదు! అందులో నేరప్రవృత్తి కలిగిన వ్యక్తులో, సరైన పెంపకంలో పెరగని యువకులో మాత్రమే కారణం అనుకుంటే పొరపాటే… ఆ నేరాలు చేసి, అత్యాచార ఘటనల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ప్రజాపాలకులు కూడా పుష్కలంగా ఉన్నారు! తాజాగా అసోషియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) తన నివేదికలో ఈ వాస్తవాలు పేర్కొంది.

ఎవరు అవునన్నా కాదన్నా.. ఎంతమంది మేధావులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు తయారైనా.. ప్రజాస్వామ్య దేశం అయిన భారతదేశ భవిష్యత్తు ఎప్పుడూ రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంటుంది. వారు బొమ్మ అంటే బొమ్మ.. బొరుసు అంటే బొరుసు! పార్లమెంటుల్లో వారికి కావాల్సిన చట్టాలు, బిల్లులు.. ఎవరు అవునన్నా కాదన్నా వారు పాస్ చేయించుకోగలుగుతారు. వారు చేయకూడదు అని ఒకసారి ఫిక్సయితే.. ఏది ఎమైనా చేయరు! అయినా కూడా భారతదేశం ప్రజాస్వామ్య దేశమే.. నో డౌట్!!

విషయంలోకి వస్తే… దేశవ్యాప్తంగా గత అయిదేళ్లలో 45 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మహిళలపై అత్యాచార, హత్యా ఘటనల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని.. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న 327 మందికి ప్రముఖ రాజకీయ పార్టీలు గత ఐదేళ్లలో ఎన్నికల్లో పోటీచేయడానికి టికెట్లు ఇచ్చాయని ఏడీఆర్‌ తన నివేదికలో పేర్కొంది. మహిళలపై అత్యాచారం చేసిన వారికి, స్త్రీలపట్ల దుర్మార్గంగా ప్రవర్తించిన వారికి సరైన శిక్షలు పడటం లేదు అని జనాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ఎన్నో రకాలుగా మొత్తుకుంటుంటారు.. కాని వారిలో ఇంతమంది మనల్ని పాలిస్తున్న వారే ఉన్నారని తెలియడం అత్యంత బాదాకరం కాక మరేమిటి? ఇక్కడ.. కంచే చేను మేయడం కాదు.. చేను మేసే కంచెనే, ఆ చేనుకు రక్షణగా పెడుతున్నారు!!

మొన్న నిర్భయ.. నిన్న ఉన్నావా, కథువా ఘటనలు.. రేపు మరొకటి!! భారతదేశంలో మహిళలకు ఉన్న రక్షణ, ఆ రక్షణ పోవడానికి కారణమైన వారికి పడుతున్న శిక్షలు.. నిత్యం వార్తల్లో నానుతూ వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి!! దేశం మొత్తాన్ని భారతమాత అని పిలుచుకునే దేశంలో మహిళలపై అత్యాచారలు, ఆడపిల్ల అని తెలిస్తే పిండంగా ఉండగానే చిదిమేసే జనాలు.. పురుషంకారం అనుకోవాలా, స్త్రీ పక్షపాత సమాజం అని కొటేషన్స్ చదువుకుంటూ తేలు కుట్టిన దొంగల్లా కాలం గడపాలా? ఈ పుణ్యభూమిలో ఏ ఒక్కరోజైనా మహిళలపై అత్యాచార ఘటన వార్త లేని వార్తా పత్రికలు చూసే భాగ్యం ఈ మాతకు లేదా?

భారతదేశంలో ప్రతీ గంటకు ఇద్దరు మహిళలు అత్యాచారానికి గురవుతున్నారనే మాట పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. అధికారిక గణాంకాల ప్రకారం ప్రతి 26 నిమిషాలకు ఒక మహిళ వేధింపులకు గురవుతూ ఉండగా.. ప్రతి 34 నిమిషాలకు ఒక మహిళపై అత్యాచారం జరుగుతోంది. ప్రతీ 99 నిమిషాలకు వరకట్నం కోసం ఒక వధువు బలి అవుతోంది. ఈ లెక్కలు సరిపోతాయి… భరతమాత ఒడిలో ఉన్న మహిళల పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి!

పరిస్థితి ఇలా ఉంటే… ఈ విషయంలో దొంగచేతికే తాళాలు ఇచ్చినట్లుగా, ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికే ఈ రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇచ్చి.. జనాలను పాలించమని చెప్పడం ఎంతవరకూ సబబు! ఈ విషయం పూర్తిగా తెలియని జనం ఓట్లేసి వారిని అందలం ఎక్కించడం మరెంతవరకూ సబబు!! పార్టీలకు, పార్టీల అధినేతలకు బుద్ది లేదని కాసేపు సరిపెట్టుకున్నా, ఓట్లేసే జనాలకు ఏమైంది.. నో కామెంట్.. ఇది ప్రజాస్వామ్య దేశం! వారంతా మన పాలకులు!!

రాబోయే ఎన్నికల్లో అయినా రాజకీయ పార్టీలు అన్నీ.. ఈ విషయంలో ఒక్కతాటిపైకి వచ్చి ఇలాంటి నేరప్రవృత్తి ఉన్నవారికి టిక్కెట్లు ఇచ్చి, మహిళలను మరింత అభద్రతా భావానికి గురిచెయ్యొద్దని ప్రజల మనవి! పార్టీలను చూసి కాకుండా వ్యక్తులను చూసి ఓట్లేయమని ప్రజలకు మనవి! మహిళల రక్షణ విషయంలో మరింత శ్రద్దగా, సీరియస్ గా ఉండమని (ఈ ఆరోపణలు లేని) పాలకులకు మనవి!!

యత్ర నార్యన్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః!…