Home రాజకీయాలు పెళ్లాల మొహాలు చూడటం అవలేదా?

పెళ్లాల మొహాలు చూడటం అవలేదా?

554
SHARE

ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు పసుపు చొక్కాలు ధరించి, పచ్చ ఫ్లకార్డులు చేతపట్టి, తమ ఎంపీ పదవులకు ఏమాత్రం నష్టం రాకుండా, రాజినామాల ఊసే లేకుండా కాలం గడిపి, ఫోటోలకు ఫోజులిచ్చి కాలం గడిపిన సంగతి తెలిసిందే. పార్లమెంటు సమావేశాల్లో వైకాపా నేతలు చేసిన అవిశ్వాస తీర్మాణానికి.. తాము కూడా అవిశ్వాసం పెడుతున్నామని కలరింగ్ ఇచ్చి కాలయాపన చేసి చల్లబడిన సంగతి తెలిసిందే. అనంతరం ఈనెల 6వ తేదీన ఢిల్లీలో పార్లమెంటు ముగిసిపోయింది. మరి తర్వాత ఏమి జరిగింది…?

పార్లమెంటు సమావేశాలు ముగిసిన అనంతరం టీడీపీ ఎంపీల డ్రామాలకు కూడా తెరపడిపోయింది. ప్రధాని ఇంటి ముట్టడి అంటూ ఒకపూట హడావుడి చేసిన టీడీపీ ఎంపీలు పీచే ముడ్ అంటూ రాష్ట్రానికి తిరిగి వచ్చేశారు. అనంతరం వైకాపా ఎంపీలు వెనక్కు తగ్గేది లేదని ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆ సంగతి అలా ఉంటే… హస్తిన నుంచి అమరావతికి రాగానే బస్సు యాత్ర అని చెప్పుకొచ్చారు. దీనిపై స్పందించిన జేసీ దివాకర్ రెడ్డి… “మా పెళ్లాల మొహాలైనా చూస్కోవద్దా” అంటూ మీడియాపై విరుచుకుపడ్డారు.

సరే… మానవతా దృక్పదంతో అది కూడా కరెక్టే కదా అని సర్ధుకున్నారు జనం! ఆ పెళ్లాల మొహాలు చూసుకోవాలి అని సదరు ఎంపీలు భావించడం తప్పుకాదని భావించారు. అలా సదరు ఎంపీ గారు చెప్పి ఇప్పటికి పదిరోజులు ముగిసింది. అయినా టీడీపీ ఎంపీలు ఇప్పటివరకూ చడీ చప్పుడూ లేకుండా ఉన్నారు. తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాత్రం ఒకరోజు రైల్వే స్టేషన్ లో హడావిడి చేసి “ఉన్నాం” అని చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన్ని మినహాయిస్తే… మిగిలిన టీడీపీ ఎంపీలంతా హస్తిన పర్యటన అనంతరం ఏమైపోయారు.. పెళ్లాల మొహాలు చూడటాలు ఇంకా పూర్తి కాలేదా.. పదిరోజులుగా పెళ్లాల మొహాలు చూసుకుంటూనే గడిపేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తపరుస్తున్నారు ప్రజలు!

టీడీపీ ఎంపీలకున్న చిత్తశుద్ధి ఇదేనా అనేది ప్రజల ప్రశ్నగా ఉంది. ఢిల్లీలో హోదా గురించి పోరాడుతున్న వైకాపా ఎంపీల ముందు తొడలు కొట్టి మీసాలు మెలేసిన టీడీపీ ఎంపీల పౌరుషం ఇప్పుడేమైంది? హస్తిన నుంచి రాగానే పెళ్లాల మొహాలు చూడటానికని ఇళ్లకు వెళ్లిన టీడీపీ ఎంపీలు ఇప్పుడు ఎక్కడ? వారి పెళ్లాల మొహాల సంగతి సరే.. ఇక్కడ ప్రజల పరిస్థితి గురించి ఆలోచించరా? వారి మొహాలు ప్రజలకు ఎలా చూపించాలని అనుకుంటున్నారు? నిన్న మొన్నటివరకూ ఢిల్లీలో హడావిడి చేసిన నేతలు అసలు తాడో పేడో తేల్చుకోకుండా అమరావతికి ఎందుకు వచ్చినట్లు? రమ్మన్నవారికి జ్ఞానం లేదా లేక పిలవగానే ఎగేసుకుంటూ వచ్చినవారికి బాధ్యత లేదా? చూసిన మొహాలు చాలు.. ఇకనైనా హోదా పోరాటంలో అంతా కలిసికట్టుగా సీరీయస్ గా పోరాడండి అని ప్రజలు ఆ ఎంపీలకు పిలుపునిస్తున్నారు!!