Home రాజకీయాలు బాబును చించేశా.. దమ్ముంటే దాడి చెయ్!

బాబును చించేశా.. దమ్ముంటే దాడి చెయ్!

SHARE

ఏమాటకామాట చెప్పుకోవాలంటే చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తిని బాబు ఎందుకు భరిస్తున్నారో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. తాను ఏమి చేసినా బాబు ఏమీ అనరు అనే ధైర్యం చంద్రబాబుకు ఎందుకు ఇచ్చారో ఎవ్వరీకీ తెలియదు! క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలున్న పార్టీ అని మాటకు ముందు ఒకసారి మాట తర్వాత ఒకసారి చెప్పుకునే బాబు కళ్లకు.. చింతమనేని ఎందుకు కనిపించడంలేదో ఎవరికీ అంతుచిక్కని వ్యవహారం. ఇప్పటికే ఎన్నో అరాచకాలకు కారణమైన చింతమనేని.. బాబు ఇస్తున్న భరోసాతో అన్నట్లు మరోసారి అల్లరి చేశారు.

వివరాళ్లోకి వెళ్తే… ఆర్టీసీ బస్సుకు అంటించిన సీఎం చంద్రబాబు బొమ్మ చిరిగిపోవటంపై చింతమనేని చిందులు వేశారు. బాబు బొమ్మ బస్సుపై చిరిగితే బస్సు డ్రైవర్, కండక్టర్ ఏం చేస్తున్నారంటూ కస్సుబుస్సు లాడారు. ఈ విషయంలో ఆర్టీసీ సిబ్బందిపై హడావుడిని ప్రశ్నించిన వ్యక్తిపై చింతమనేని దాడి కూడా చేశారు. ప్రస్తుతం ఈ అతి వ్యవహారం సంచలనంగా మారింది. ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న బాబు ఇమేజ్ ను పూర్తిగా డ్యామేజ్ చేయటానికి చింతమనేని లాంటి నేతలు ఇద్దరు ముగ్గురు ఉంటే సరిపోతుంది అనే మాటకు బలం చేకూర్చేలా ఈ సంఘటన ఉందనడంలో సందేహం లేదు! ప్రభుత్వ సొమ్ము తింటూ సీఎం ఫోటో చిరిగినా పట్టించుకోరా? అంటూ పరుష పదజాలం వాడటం చింతమనేని (అ)జ్ఞానానికి నిదర్శనంగా చెప్పుకుంటున్నారు జనాలు!

ఈ సంగతి అలా ఉంటే… ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ.. చింతమనేనికి డైరెక్టుగా క్లాస్ పీకుతూ సవాల్ విసిరారు. చింతమనేనికి చెప్పుదెబ్బలాంటి ఈ సవాల్ సంచలనంగా మారింది. ఇంతకూ ఆమె చేసిన పని ఏమిటంటే… తాను కావాలనే చంద్రబాబు పోస్టర్‌ ను చించేశానని, దమ్ము, ధైర్యం ఉంటే హనుమాన్‌ జంక్షన్‌కి వచ్చి తనపై దాడి చేయాలంటూ చింతమనేనికి సవాల్ విసిరారు పద్మశ్రీ. అక్కడితో ఆగని ఆమె… చంద్రబాబు తన పెంపుడు కుక్కలను ప్రజలపై దాడికి వదులుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యవహారం అంతా చూస్తే… చింతమనేని లాంటి వ్యక్తులు బాబుకు మేలు చేస్తున్నారా? ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న ఇమేజ్ ను మరింతగా డ్యామేజ్ చేస్తున్నారా? అనే విషయం సుస్పష్టం అవుతుంది. ఇదే అదనుగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్సులపై ఉన్న చంద్రబాబు ఫోటోలను చించడమే మిగిలిన వారు పనిగా పెట్టుకుంటే బాబు, చింతమనేని ఏమి చేయగలరనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఒకపక్క హోదా విషయంలోనూ, గత ఎన్నికల విషయంలో చేసిన హామీలను తుందలోకి తొక్కడంలోనూ జనాలు తమ మనసుల్లోనూ, తాము పెట్టుకున్న నమ్మకాల్లోంచి బాబు ఫోటోను ఎప్పుడో చించేస్తుంటే.. బస్సులపై ఉన్న కాగితాలపై బాబు ఫోటొ చిరిగిందని చింతమనేని లాంటి ఎమ్మెల్యేలు మూర్ఖపు పనులకు దిగడం వారి సంస్కారానికి, వారికి మాత్రమే ఉన్న ప్రత్యేక జ్ఞానానికి నిదర్శనం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదే క్రమంలో కావాలని చించేశా.. దమ్ముంటే తనపై దాడి చేయాలని పిలుపునిచ్చిన పద్మశ్రీకి చింతమనేని ఏమి సమాధానం చెబుతారో వేచి చూడాలి. ఈ విషయంపై చింతమనేని స్పందించి సమాధానం చెబుతారా లేక కొలుగుల్లో దూరిపోతారా అనేది ఆసక్తికరంగా మారింది!! మహిళలపై దాడులు చేయడం చింతమనేనికి, వాటికి సమర్ధించి రక్షించడం బాబుకు కొత్త కాదు కాబట్టి.. ఈ సవాల్ మరింత ఆసక్తికరంగా మారింది!!