Home రాజకీయాలు చంద్రబాబు నిరాహార దీక్ష… కొన్ని ప్రశ్నలు?

చంద్రబాబు నిరాహార దీక్ష… కొన్ని ప్రశ్నలు?

159
SHARE

నారా చంద్రబాబు నాయుడు నిరాహార దీక్ష చేయబోతున్నారు! ఈ విషయం బాబుగారే స్వయంగా ప్రకటించారు. అలా అని ప్రత్యేకహోదా పై కేంద్రం ఒక ప్రకటన చేసే వరకూ కాదు సుమా… ఒక్క రోజు మాత్రమే. ఉదయం నుంచి సాయంత్రం వరకూ! ఈ నెల 20న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఆ రోజు సాయంత్రం వరకూ నిరాహారదీక్ష చేయాలని బాబు నిర్ణయించారు.

తాజాగా విజయవాడలోని ఒక బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు… “రాష్ట్రానికి కేంద్రం తీరని ద్రోహం చేసింది. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఈనెల 20న నా పుట్టినరోజు..సాయంత్రం వరకు దీక్ష చేస్తా. ఈనెల 30న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహిస్తాం” అని ప్రకటించారు. ఈ ప్రకటన అనంతరం ఈ విషయం నచ్చితే.. జనాలంతా చప్పట్లు కొట్టాలని కోరారు చంద్రబాబు! అనంతరం ప్రజలను ఒక కోరిక కోరారు చంద్రబాబు.. అదే 25ఎంపీ సీట్లు! అవును… రాబోయే ఎన్నికల్లో 25ఎంపీ సీట్లూ గెలిపిస్తే.. భవిష్యత్తులో కేంద్రంలో చక్రం తిప్పేది తెలుగు దేశం పార్టీ తప్ప మరొకటి కాదు అని బాబు చెప్పుకొచ్చారు.

ఆ సంగతులు అలా ఉంటే… పోరాడటం అనే విషయంపై లైట్ తీసుకున్న బాబు, నేరం నాది కాదు అనే స్థాయికి దిగజారిపోయారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రకరకాల పనులు చేశానని చెబితేనే ఒరిగిందేమీ లేదు. అలాంటిది ఒకరోజు విజయవాడలో కూర్చుని అన్నం తినడం మానేసినంతమాత్రాన్న జనాలకు ఒరిగేదేమిటి.. కేంద్రంపై పెరిగే ఒత్తిడి ఏమిటి? చంద్రబాబే చెప్పాలి.

ఆ దీక్షేదో ఢిల్లీ లో కూర్చుని చేస్తే మంచిది కదా అనే సూచనలు వినిపిస్తున్న తరుణంలో… పోరాడాల్సిన ఢిల్లీ నుంచి తమ ఎంపీలను వెనక్కి పిలిపించుకుని ఎన్నికల ప్రచారం మొదలుపెట్టమని కోరిన బాబు… తాజాగా నిరాహార దీక్ష చేస్తాను, ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ.. నా నిరసన తెలియజేస్తాను.. అని చెప్పడం హాస్యాస్పదం కాక మరేమిటి?

రాష్ట్రంలో బంద్ చేస్తున్న ప్రతిపక్షాలకు మాత్రం… హోదాపై పోరాడాల్సింది ఢిల్లీలో అని సూచించే బాబు… తాను, తమ బృందం మాత్రం రాష్ట్రంలో సైకిల్లపై తిరుగుతూ, ఒకపూట నిరాహార దీక్షలు చేయడాన్ని ఏమని అర్ధం చేసుకోవాలి? వైకాపా ఎంపీలు ఢిల్లీలో ప్రాణాలకు తెగించి ఆమరణ నిరాహారదీక్షలు చేస్తే.. అవన్నీ డ్రామాలు అని కొట్టిపారేసిన బాబు.. తాను ఒక పూట నిరాహారదీక్ష చేయడాన్ని ఏమనాలి? బాబు గారే చెప్పాలి!