Home రాజకీయాలు ఆ విషయంలో జగన్ కు టీడీపీ పరోక్ష మద్దతు!

ఆ విషయంలో జగన్ కు టీడీపీ పరోక్ష మద్దతు!

1166
SHARE

ఈ హెడ్డింగ్ చూసినప్పుడు కాస్త అతిశయోక్తిగానో లేక గాసిప్పులకే గాసిప్పులాంటి విషయమనో అనిపించొచ్చు కానీ… ఇది అక్షరాలా వాస్తవమే అనే విశ్లేషణకు ప్రతిరూపమే ఈ శీర్షిక! డైరెక్టుగా పాయింట్ లోకి వచ్చేస్తే… కేసుల విషయంలో, వైకాపా నేతలు ఆరోపిస్తున్నట్లు జగన్ పై కక్ష సాధిపులో భాగంగా ఏర్పాటుచేసిన కేసుల్లో వాస్తవాలు చాలా దూరంగా ఉండే అవకాశం ఉందని, కేంద్రం అనుకుంటే ఎవరిపై అయినా సీబీఐ ని ఉసిగొల్పి కేసులు పెట్టొచ్చని తాజాగా గుర్తించినట్లు మాట్లాడుతున్నారు టీడీపీ నేతలు! అలా స్పందిస్తున్న వారిలో పలువురు టీడీపీ నేతలతో సహా చంద్రబాబు ఉండటం గమనార్హం!

వైకాపా అధినేత వైఎస్ జగన్ పై కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సీబీఐ ని ఉసిగొల్పి, క్విడ్ ప్రోకో అనే కోణంలో కేసులు వేసింది అనేది వైకాపా నేతల వెర్షన్. నాడూ నేడూ ఈ విషయంలో ఏమాత్రం మార్పు లేకుండా మాట్లాడుతున్నారు వైకాపా నేతలు. అయితే ఈ విషయంలో గతంలో సీబీఐ అంటే చాలా గౌరవప్రదమైన సంస్థ అని, దానిపై ఎవరి ఒత్తిడీ ఉండదని, అది పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని జగన్ కేసుల విషయంలో చిలకపలుకులు పలికిన టీడీపీ నేతలు… తాజాగా మాట మార్చారు! కేంద్ర ప్రభుత్వాలు సీబీఐ ని వారి రాజకీయ కక్ష సాధింపులకు అస్త్రంగా వాడుకుంటుందని ఆరోపిస్తున్నారు.

ఎన్డీఏ నుంచి బయటకు రావడం, మోడీపై నిప్పులు కురిపించడం, బీజేపీ నేతలు రాష్ట్రానికి అన్యాయం చేశారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో… బాబుపై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు దిగబోతుందని, అందుకు సీబీఐ ని వాడబొతుందని, అయినా బెదిరేది లేదని బాబు చెప్పుకొస్తున్నారు. ఇదే క్రమంలో కేంద్రప్రభుత్వాలు ఇలాంటి పనులకు సీబీఐ ని వాడుకోవడం ఈరోజు కొత్తేమీ కాదని చెప్పుకొస్తున్నారు. ఇదే విషయాన్ని వైకాపా నేతలు ఇంతకాలం చెబుతూ ఉంటే చిలిపినవ్వులు నవ్విన బాబు అండ్ కో తమ వరకూ వచ్చే సరికి ఇలా గెంతుతున్నారు. ఇదే క్రమంలో తాజాగా పట్టిసీమపై సీబీఐ విచారణ జరిపించాలన్న.. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలపై జూపూడి ప్రభాకర్ స్పందించారు. సీబీఐ అనేది అధికార పార్టీ జేబు సంస్థేనని ఆరోపించారు. తమ వరకూ వస్తే ఒకరూలు, ఒక వాదన… ఇతరుల విషయంలో మాత్రం మరో వాదన! బాబు అండ్ కో ల రాజనీతి జనాలకు తెలియంది కాదు కానీ… కేంద్రం – సీబీఐ ల విషయంలో మరోసారి వెలుగులోకి వచ్చింది.

ఈ విషయాలన్నీ గమనిస్తుంటే… నాడు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని, సీబీఐని పాముగా వాడుకుని జగన్ పై కేసులు వేసిందనే అభిప్రాయానికి, వాదనకు తాజాగా టీడీపీ నేతలు బలం చేకూరుస్తున్నట్లయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలా పరోక్షంగా జగన్ కు కేసుల విషయంలో టీడీపీ పరోక్ష మద్దతు ఇస్తుందనే విశ్లేషణలు పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో తనవరకూ వస్తేకాని తెలియలేదా బాబు అనే కామెంట్స్ రావడంతోపాటు.. టీడీపీ ఎన్ని కబుర్లు చెప్పినా.. పట్టిసీమపై సీబీఐ విచారణ మాత్రం ఆగదనే సంకేతాలు వినిపించడం కొసమెరుపు!!