Home రాజకీయాలు బాబుకు కునుకు లేకుండా చేసిన ప్రత్తిపాటి!

బాబుకు కునుకు లేకుండా చేసిన ప్రత్తిపాటి!

SHARE

పొగడ్తల్లో పీక్స్ కి వెళ్లాలని, ఎక్కువ మార్కులు కొట్టేయాలని చేసిన ప్రయత్నంలో భాగమో లేక చాలామంది టీడీపీ నేతల్లో ఉన్న అభిప్రాయమో తెలియదు కానీ… చంద్రబాబుని తగ్గించి, లోకేష్ ను ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు టీడీపీ నేతలు! పొరపాటునో, కావాలనో కానీ అప్పుడప్పుడూ అవకాశం చిక్కినప్పుడల్లా ఈ అభిప్రాయాన్ని బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి సంఘటన తాజాగా గుటూరు జిల్లాలో జరిగింది! ఈ సంఘటన అనంతరం లోకేష్ ఫ్యాన్స్ ఫుల్ కుషీ అయిపోతుంటే… బాబు ఫ్యాన్స్ మాత్రం తెగ ఫీలయిపోతున్నారట!

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని ఒక గ్రామంలో తాజాగా నందమూరి తారకరామారావు, చంద్రబాబు తండ్రి ఖర్జూర నాయుడుల విగ్రహాలను ఏర్పాటుచేశారు టీడీపీ కార్యకర్తలు! ఎన్టీఆర్ అంటే సరే అనుకోవచ్చు కానీ.. చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడు విగ్రహం ఎందుకు పెట్టించారా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. బహుశా… బాబు వంటి మహానాయకుడిని దేశానికి అందించినందుకు కృతజ్ఞతగా అలా ఏర్పాటు చేసి ఉండొచ్చు!! ఈ విగ్రహాలను లోకేష్ ఆవిష్కరించారు. అనంతరం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడారు.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్!

ఆ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు… “అతిచిన్న వయసులో లోకేష్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు” అని చెప్పుకొచ్చారు! ప్రస్తుతం టీడీపీ నేతల్లో ఈ విషయం భారీ చర్చనీయాంశం అవుతోంది. మంత్రి గారే అంత మాట అన్నాక మిగిలిన చోటా మోటా నేతలు ఊరుకుంటారా.. వారు కూడా చెలరేగిపోయి భజన చేసేశారు! సరే వారి భక్తి, వారి భ్రమ అలా ఉందని కొంతమంది సరిపెట్టుకుంటే… మిగిలిన జనాలు మాత్రం కొన్ని సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

చంద్రబాబు ఇంకా ఆరోగ్యంగానే ఉన్నారు.. చంద్రబాబు ఉన్నంతకాలంలో టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సీఎం కుర్చీ వదిలి పక్కన కూర్చుంటారని అనుకోలేం. ఈ క్రమంలో లోకేష్ అతిచిన్న వయసులోనే ముఖ్యమంత్రి కాబోతున్నారు అని ప్రత్తిపాటిలాంటి వారు చెప్పడాన్ని లైట్ తీసుకోలేం! ఒక వేళ లోకేష్ ఒత్తిడి మేరకు బాబును జాతీయ రాజకీయాల్లోకి పంపేసి, రాష్ట్ర రాజకీయాల్లో లోకేష్ చక్రం తిపాలని అనుకుంటున్నారా అనేది మరో సందేహంగా ఉంది! అదే జరిగే మరింత మంచిదని రాజకీయ ప్రత్యర్ధులు చెప్పడం ఇక్కడ గమనార్హం!! ఏది ఏమైనా… ఈ మాట మాత్రం బాబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందనడంలో సందేహం లేదనేది బాబు అతిసన్నిహితుల మాట!!

బాబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి అల ఉంచితే… అతిచిన్న వయసులో ముఖ్యమంత్రి అనే విషయంలో కూడా ప్రత్తిపాటి అజ్ఞానం పరిపూర్ణం అనే కామెంట్స్ దానికి అనుగుణంగా రావడం కొసమెరుపు. భారతదేశ చరిత్రలో ఎం.ఓ. హసన్ ఫరూఖ్.. తన 29వ ఏటనే పాండిచ్చేరీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం 34ఏళ్ల వయసులో ప్రఫుల్ కుమార్ మహంత అస్సాం ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. సీనియర్ పొలిటీషియన్ శరాద్ పవార్ విషయానికొస్తే ఆయన తన 38వ ఏట మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. సరిగ్గా ఇదే వయసులో అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ లెక్కన చూసుకుంటే ఫరూఖ్ వయసుకంటే ప్రస్తుతం లోకేష్ వయసు ఎక్కువ, ప్రపూల్ కుమార్ కంటే కూడా ఎక్కువే.. ఇక మిగిలింది అఖిలేష్ యాదవ్ కంటే తక్కువ!! ఈ లెక్కన చూసుకుంటే ప్రత్తిపాటికి దేశ చరిత్రపై ఏమాత్రం అవగాహన లేదని అర్ధం అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బహుశా పుల్లారావు చదివిన బీకాం లో హిస్టరీ, పాలిటిక్స్ లేకపోవడమే దీనికి కారణం అయ్యి ఉండొచ్చు!!