Home రాజకీయాలు అది వెధవల ఆలోచన.. బాబు సర్కార్‌పై కల్లం నిప్పులు

అది వెధవల ఆలోచన.. బాబు సర్కార్‌పై కల్లం నిప్పులు

653
SHARE

అమరావతి పేరుతో సాగుతున్న కుంభకోణంపై మరో మాజీ సీఎస్ అజయ్ కల్లం గళమెత్తారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజధాని పేరుతో భారీగా అవినీతి జరుగుతోందన్నారు. ఏపీలో అవినీతి పెరిగి వ్యవస్థలన్నీ కూలిపోయాయన్నారు.

ప్రజల్లో దీనిపై ప్రశ్నించే తత్వం పెరగాలన్నారు. పెద్దపెద్ద భవనాల పేరుతో ప్రజలను పిచ్చివాళ్లను చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రభుత్వమే రియల్‌ వ్యాపారానికి దిగిందని ఇది ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. అన్ని ఒకే చోట ఉండాలన్నది సరికాదని.. విజయవాడ, విశాఖ, కర్నూలుకు అభివృద్ధి, పాలన విస్తరించాలన్నారు.

అన్ని శాఖలు, అన్ని భవనాలు ఒకే చోట నిర్మిస్తే బ్రోకరిజం చేసుకునే వారికి మాత్రమే అనువుగా ఉంటుందని.. ప్రజలకు పెద్దగా ఉపయోగం ఉండదన్నారు. పెద్ద సిటీలు కడితే పెద్దపెద్ద కంపెనీలు వస్తాయనుకోవడం తెలివితక్కువ వారు చేసే ఆలోచన అన్నారు.  యూఎస్‌లో మైక్రోసాప్ట్‌ కంపెనీ కూడా ఒక చిన్నపట్టణంలో ఉందని గుర్తు చేశారు.   బఫెట్‌ కూడా తన వ్యాపారాన్ని ఒక మారుమూల ప్రాంతం నుంచి నడుపుతున్నారని అజయ్‌ కల్లం వివరించారు.

పెద్దపెద్ద భవనాలు కట్టాలనే పిచ్చి వందల ఏళ్ల క్రితం నుంచే ఉందని.. పేరు కోసం పెద్దపెద్ద భవనాలు కట్టాలన్నది వెధవలు చేసే ఆలోచన అని గతంలో పెద్దలు అభిప్రాయపడ్డారని వివరించారు. భారీ విస్తీర్ణంలో రాజధాని నిర్మాణాలు సరైన విధానం కాదని అంతర్జాతీయ పరిశోధనల్లోనే తేలిందన్నారు.

అలా చేయడం వల్ల ట్రాన్స్‌పోర్టుతో పాటు ఇతర మౌళిక సదుపాయలకు ప్రజలు అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. బ్యూరోక్రాట్స్‌గా తాము కేవలం సలహా మాత్రమే ఇవ్వగలమని అంతిమ నిర్ణయం పాలకుల చేతిలోనే ఉంటుందన్నారు. దక్షిణ భారత దేశంలో ఏదో లోపం ఉందని.. సినిమాకు, నిజ జీవితానికి మధ్య తేడాను గుర్తించడంలో వెనుకబడి ఉన్నామన్నారు.