Home రాజకీయాలు ఆంధ్రజ్యోతి – ఆ ఐదుగురు.. మధ్యలో పొసాని!

ఆంధ్రజ్యోతి – ఆ ఐదుగురు.. మధ్యలో పొసాని!

SHARE

తాను చెప్పే విషయం ముక్కు సూటిగా ఉంటుంది.. తిట్టినా, పొగిడినా ఘాటుగానే ఉంటుంది.. సమకాలీన సినీ రాజకీయ అంశాలపై అతను స్పందించే విధానం వైరి వర్గానికి ముచ్చెమటలు పట్టిస్తుంది.. ఇప్పటికే అర్ధం అయ్యి ఉంటుంది.. అతని పేరు పోసాని కృష్ణ మురళి అని! ఏ విషయంపై అయినా తనదైన ప్రత్యేక శైలిలో స్పందించే పోసాని.. తాజాగా అశ్వనీదత్‌, కేఎల్‌ నారాయణ, రాఘవేంద్రరావు, కే నారాయణ, వెంకటేశ్వర్‌ రావు, కిరణ్‌ లను తనదైన శిలిలో ఇరకాటంలో పడేశారు. తెలుగు సినీ పరిశ్రమ సంపూర్ణ మద్దతు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా ఉద్యమానికి ఉంటుందని ఈ ఐదుగురు సినీ పెద్దలు ప్రకటన చేయడాన్ని తనదైన శైలిలో ఖండించారు పోసాని.

వివరాళ్లోకి వెళ్తే… పైన చెప్పుకున్న ఆ ఐదుగురు సినీ పెద్దలు, ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు. కలిసిన వారు కలిసినట్లు ఉండకుండా… టాలీవుడ్ మొత్తం సంపూర్ణ మద్దతు చంద్రబాబు ప్రత్యేక హోదా ఉద్యమానికి ఉంటుందని ప్రకటన చేశారు! ఈ విషయం ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రముఖంగా ప్రచురితమైంది. ఇక్కడే పోసాని ఫైరయ్యారు. ఈ సినీపెద్దలు మర్యాద పూర్వకంగా చంద్రబాబుని కలుసుకోవడంలో ఏమాత్రం తప్పులేదు, వ్యక్తిగతంగా కలుసుకోవడం నేరం కాదు.. కానీ వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని ఇతర సినీ జనాలతో సంప్రదించకుండా.. మొత్తం ఇండస్ట్రీ మద్దతు బాబుకి ఉంటుందని ప్రకటించడం కచ్చితంగా తప్పే అనేది పోసాని సూటి వాదన. అయితే ఇక్కడ ఆంధ్రజ్యోతిని సీన్ లోకి తెచ్చారు పోసాని.

“నాకు తెలిసి రాఘవేంద్రరావు లాంటి పెద్ద మనుషులు అలాంటి స్టేట్ మెంట్స్ ఇస్తారని నేను అనుకోవడం లేదు.. ఆంధ్రజ్యోతి పత్రికే అలా కావాలని అబద్దం రాసి ఉందా, అలా అయితే వెంటనే ఈ వార్తను ఖండించాలని నా మనవి. వెంటనే ఈ ఐదుగురు ప్రెస్ మీట్ పెట్టి, ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆ కథనం తప్పు.. చంద్రబాబుని కలవడం, ఆయన పోరాటానికి తమ మద్దతు ప్రకటించడం మా వ్యక్తిగత విషయం అని ప్రకటించాలి” అని పోసాని తనదైన శైలిలో స్పందించారు. ఈ స్టేట్ మెంట్ రాఘవేంద్రరావు లాంటి పెద్దమనుషులు ఇచ్చారని తాను అనుకోవడం లేదని, పత్రికలోనే తప్పుగా ఉండొచ్చని అభిప్రాయపడిన పోసాని… ఈ విషయంపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.

ఒకవేళ.. హోదా గురించి ఎవరు పోరాడినా తమ మద్దతు ఉంటుందని ఈ ఐదుగురూ భావిస్తే… ఢిల్లీలో ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతున్న వైకాపా ఎంపీలకు సైతం తమ మద్దతు, సానుభూతి ప్రకటించాలని, అలా కానిపక్షంలో ఇది “కుల పిచ్చిగా” ప్రజలు భావించే ప్రమాధం ఉందని పోసాని తేల్చి చెప్పారు. మరి పోసాని సంధించిన ప్రశ్నలపై ఆ ఐదుగురు స్పందిస్తారా లేక ఆంధ్రజ్యోతి పత్రికే ఖండన వేస్తుందా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా… పోసాని ప్రశ్నలపై కచ్చితంగా స్పందించాల్సిన బాధ్యత ఆ ఐదుగురిపై మాత్రం ఉంది అనే చెప్పాలి. అలా కానిపక్షంలో పోసాని వ్యక్తపరిచిన అనుమానాలన్నీ వాస్తవాలని ఒప్పుకున్నవారవుతారు!!

పరిస్థితులను గమనిస్తుంటే.. పోసాని ఫైర్ ని పరిశీలిస్తుంటే.. ఈ విషయంపై అటు ఆంధ్రజ్యోతి కానీ, ఇటు ఆ ఐదుగురు కానీ స్పందించని పక్షంలో వ్యవహారాన్ని మరింత సీరియస్ చేస్తారని అనుకోవచ్చు! అదే జరిగితే ఆ ఐదుగురు గోటితో పోయేదాన్ని గొడ్డలివరకూ తెచ్చుకున్నట్లు అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.