Home రాజకీయాలు మద్దతుపై సగం క్లారిటీ ఇచ్చిన ముద్రగడ!

మద్దతుపై సగం క్లారిటీ ఇచ్చిన ముద్రగడ!

SHARE

కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం తాజాగా మరోసారి కాస్త సంచలన ప్రకటనలే చేశారు! రాబోయే ఎన్నికల్లో ఏపీలో కీలకంగా మారిన కాపు సామాజికవర్గ ఓట్ల విషయంలో అటు పవన్ కల్యాణ్ తో పాటు ఇటు ముద్రగడ ప్రభావం కూడా ఎంతో కొంత ఉంటుంది అనే కామెంట్స్ వినిపిస్తున్న తరుణంలో… రాబోయే ఎన్నికల్లో ముద్రగడ మద్దతు కూడా కీలకమనే చెప్పాలి. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో ముద్రగడ మద్దతు ఎవరికి ఉంటుంది.. ఎవరికి ఉండదు అనే విషయాలపై సగం మాత్రం క్లారిటీ వచ్చింది! అటు జనసేన, ఇటు టీడీపీ మధ్యలో ముద్రగడ అనే కామెంట్స్ గతంలో వినిపించిన తరుణంలో.. తాజా ముద్రగడ వ్యాఖ్యలు కాస్త క్లారిటీ ఇచ్చినట్లే కనిపిస్తున్నాయి.

తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చిన ముద్రగడ… రావడం రావడమే చంద్రబాబుపై ఫైరయ్యారు. చంద్ర‌బాబు గ‌త నాలుగేళ్లుగా కాపు జాతిని మ‌భ్య పెడుతూ కాపుల రిజ‌ర్వేష‌న్ల అంశంపై అబ‌ద్ధాలు చెబుతూ నెట్టుకొస్తున్నార‌ని ఫైరయ్యారు. కేంద్రం నుంచి వ‌స్తున్న నిధుల లెక్క‌ల‌కు సంబంధించి ప్ర‌జాధ‌నం ఎలా ఖ‌ర్చు చేశార‌ని లెక్క‌లు అడిగితే ముఖ్య‌మంత్రికి కోపం వ‌స్తుంద‌ని ఎద్దేవా చేసిన ముద్రగడ.. ప్ర‌త్యేక హోదా అంశాన్ని కూడా చంద్ర‌బాబు నీరు కార్చేయ‌డం వ‌ల్ల‌నే రాకుండా పోయింద‌ని విమ‌ర్శించారు. అనంతరం రాబోయే ఎన్నికల్లో తమ మద్దతు ఏ పార్టీకి అనే అంశంపై సగం క్లారిటీ ఇచ్చారు.

రాబోయే సార్వత్రిక ఎన్నిక‌ల‌కు మూడు నెల‌ల ముందు కాపు జాతి ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా కీల‌క‌ రాజ‌కీయ నిర్ణ‌యం ఉంటుంద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ జాతికి న్యాయం చేసేవారికే తమ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని స్పష్టం చేశారు ముద్రగడ. ఇదే క్రమంలో జ‌న‌సేన పార్టీకి చెందిన కొంత‌మంది నేతలు త‌న‌ను క‌లిశార‌నీ, పార్టీకి సంబంధించి కొన్ని స‌ల‌హాలూ సూచ‌న‌లూ మాత్రం అడిగి తీసుకున్నార‌ని ముద్ర‌గ‌డ చెబుతున్నారు. దీంతో ముద్రగడ కాస్త క్లారిటీ ఇచ్చినట్లే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

రాబోయే ఎన్నికల్లో ముద్రగడ మద్దతు కచ్చితంగా టీడీపీ కి ఉండదని క్లారిటీ వచ్చినట్లే! ఇక వైకాపా – జనసేనల్లో ఎవరికి ముద్రగడ మద్దతు అనేదానిపై సర్వత్రా చర్చ నడుస్తుంది. అయితే… ఈ విషయంలో ముద్రగడ మద్దతు వైకాపాకే ఉంటుందని, జగన్ ను తప్ప మరెవరినీ నమ్మే పరిస్థితుల్లో కాపులు ఉండకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు!! పవన్ విషయంలో కేవలం సూచనలు, సలహాలు మాత్రమే ఉండొచ్చు తప్ప… పూర్తి రాజకీయ మద్దతు ఉండదనేది కూడా విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది!!