Home రాజకీయాలు మాటలకు, చేతలకు మరీ ఇంత తేడానా బాబు?

మాటలకు, చేతలకు మరీ ఇంత తేడానా బాబు?

SHARE

రాజకీయాల్లో మన నేతలు చెప్పే మాటలకు విలువలు పోయి చాలా కాలమే అయ్యిందని జనాలు చెప్పుకుంటున్న రోజులివి. వారు చెప్పేవి శ్రీరంగ నీతులే కానీ.. చేసేవి మాత్రం “ఆ” పనులు అని నేరుగా చెప్పేస్తున్నారు జనం! ఈ క్రమంలో తాజాగా తాను చెప్పే మాటలకు, చేసే పనులకు ఏమాత్రం పొంతన ఉండదని నిరూపించే పని మరోసారి చేశారు చంద్రబాబు. తానుచేస్తే శృంగారం అన్న చందంగా బాబు తాజాగా బంద్ లు, రాస్తారోకోలపై స్పందించారు.

వివరాళ్లోకి వెళ్తే… ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటాలు వైకాపా పోరాటాల ఫలితంగా ఉదృతమవుతున్నాయి. హోదా సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీలన్నీ దీక్షలు, నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 16న ఏపీ బంద్ కు పార్టీలన్నీ పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో చంద్రబాబు తనదైన ప్రత్యేక శైలిలో స్పందించారు. బంద్ లు, రాస్తారోకోలు చేస్తే రాష్ట్రానికి నష్టం అని ఎవ్వరూ ఊహించని ప్రకటన చేశారు. తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి సంగతి బాబు మరిచారో ఏమో తెలియదు కానీ… ప్రజాస్వామ్యంలో బంద్ లు చేయడం ఒకరకమైన నిరసన అనేసంగతి మరిచారేమో! ఆ సంగతులు అలా ఉంటే… పోరాటాలు ఎక్కడ చేయాలి అనే విషయంపై స్పందించారు బాబు!

“ఢిల్లీ వెళ్లి మోడీపై పోరాటం చేయాలి కానీ… రాష్ట్రంలో రాస్తారోకోలు చేస్తే ఏం వస్తుంది” అని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు! వైకాపా సభ్యులు ఢిల్లీ వేదికగా పోరాడుతుంటే వెటకారం, విజ్ఞత మరిచిన వ్యాఖ్యలు చేసిన బాబు అండ్ కో… అమరావతిలో సైకిల్ పై తిరుగుతూ పసుపు జెండాలు ఎగరేసుకుని ర్యాలీలు చేస్తున్నారు. దాన్ని ప్రత్యేక హోదా పోరాటంగా చెప్పుకొస్తున్నారు. ఇదే క్రమంలో ఈనెల 21న అన్ని జిల్లాల్లోనూ సైకిల్ యాత్రలు చేపట్టి హోదా పోరాటం చేయాలని పిలుపునిస్తున్నారు. ఇక్కడే బాబు తెలివి తేటలు బహిర్గతమవుతున్నాయి.

దేశం మొత్తం చర్చించుకునేలా రాష్ట్ర బంద్ నిర్వహిస్తే రాష్ట్రానికి సమస్య అని, అయినా ప్రత్యేక హోదా పోరాటం ఢిల్లీలో చేయాలి కానీ గల్లీల్లో ఏమిటి అని ప్రశ్నిస్తున్న బాబు… ఊర్లలో సైకిల్ యాత్రలు చేపట్టి హోదా గురించి పోరాడాలని పిలుపునివ్వడం హాస్యాస్పదం కాక మరేమిటి. తన ఎంపీలతో రాజినామాలు చేయించి, వైకాపా ఎంపీల మాదిరిగా పోరాడాలని ప్రజలు కోరుకుంటుంటే… బస్సు యాత్ర పేరున రాబోయే ఎన్నికల ప్రచారం మొదలుపెడదామని తన ఎంపీలను అమరావతికి రప్పించేసుకున్న బాబు.. హోదా పోరాటం ఢిల్లీలో చేయాలని చెప్పడంపై సర్వత్రా విమర్శలు, వ్యంగ్య బాణాలు వ్యక్తమవుతున్నాయి. అసలు బాబు చెప్పే మాటలకు, చేసే పనులకు ఏమైనా సంబందం ఉందా? జనాలు వెర్రివాళ్లు అనేది బాబు అభిప్రాయమా? బాబు మాటలకూ చేతలకూ మరీ ఇంత తేడానా?