Home రాజకీయాలు బాబు బడాయి కబుర్లు ఇంతపని చేశాయి!

బాబు బడాయి కబుర్లు ఇంతపని చేశాయి!

333
SHARE

ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు వైఖరే ప్రధాన కారణం అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ విషయంలో తన వ్యక్తిగత రాజకీయ స్వార్ధ ప్రయోజనలాకోసం హోదాను, “ప్యాకేజీ” కోసం తాకట్టు పెట్టారనే విమర్శల సంగతి తెలిసిందే. ఈ విమర్శలే వాస్తవాలని బాబు తన మాటలతో ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించిన వైనం! హోదా సంజీవని కాదని, ప్యాకేజీ ముద్దు – హోదా వద్దు అని, ఇలా హోదాను కించపరుస్తూ, హోదా వల్ల కొత్తగా ఒరిగేవేమిటో చెప్పాలని జర్నలిస్టులకు ఎదురు ప్రశ్నలు వేసిన తెలివి బాబు సొంతం. ఈ క్రమంలో… ఆ స్వార్ధ ప్రయోజనాలు కాదు, బాబు రాజకీయ ప్రయోజనాలే కాదు.. మరో అసలు సిసలు కారణం ఉందని చెబుతున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్!

సమకాలీన రాజకీయ అంశాలపై తనదైన శైలిలో విశ్లేషిస్తూ, వివరాలు చెప్పే ఉండవల్లి అరుణ్ కుమార్…ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి గల కారణాల్లో మరో ప్రధాన కారణం ఉందని, దానికి బాబు “అతి” కబుర్లే కారణం అని తేల్చి చెప్పారు. హోదా రాదన్న విషయం చంద్రబాబుకు ఎప్పుడో తెలుసని.. రాని హోదా కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, బాబు పోరాటమంతా వెంట్రుకను వేసి కొండను లాగాలనే ప్రయత్నంలానే ఉందని మొదలుపెట్టిన ఉండవల్లి… ప్రజలను మభ్యపెట్టేందుకే తన పార్టీ ఎంపీలతో నాటకాలు ఆడిస్తున్నారని నిప్పులు చెరిగారు. గత నాలుగేళ్లలో ఏపీకి రూ. 18.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటిస్తే… ఇక హోదా, పన్ను రాయితీలు ఎందుకని వస్తాయని ప్రశ్నించారు.

చంద్రబాబు అసెంబ్లీలో చెప్పిన రూ.18.50 లక్షల కోట్ల పెట్టుబడులు అనేవి, మొత్తం భారతదేశానికి వచ్చే పెట్టుబడులలో 20 శాతానికి సమానమంట. అలా ఒక్క రాష్ట్రమే దేశం మొత్తం తెచ్చుకునే పెట్టుబడుల్లో 20% సాధించినప్పుడు ఇంక హోదా ఎందుకు అనేది కేంద్రం యోచన అయ్యి ఉండొచ్చు అని ఆయన తేల్చేశారు. అంటే… గొప్పలకు పోయి, లేనిపోని హడావిడి చేసి, కాగితాలకే పరిమితమైన లక్షల కోట్ల పెట్టుబడుల గురించి జనాలను ఏమార్చడానికి అసెంబ్లీలో ప్రకటించేసి, స్వపక్ష సభ్యులతో చప్పట్లు కొట్టించేసుకోవడం కూడా హోదా రాకపోవడానికి ప్రధాన కారణం అనేది ఉండవల్లి విశ్లేషణ. బాబు బడాయి కబుర్లు ఇంతపని చేశాయన్నమాట!