Home రాజకీయాలు వైఎస్సార్‌ చరిత్రాత్మక పాదయాత్రకు 15 ఏళ్లు

వైఎస్సార్‌ చరిత్రాత్మక పాదయాత్రకు 15 ఏళ్లు

SHARE

వైఎస్సార్‌ పాదయాత్ర చేపట్టేనాటికి రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితులు, నిబద్ధతతో చేసిన యాత్ర ఆయన్ను ఆవిష్కరించిన తీరు, అధికారం చేపట్టిన తొలి నిమిషాల నుంచి పదవిలోనే మరణించిన ఆఖరి క్షణాల వరకు ఆయన సాగించిన పాలనా.. ఇవన్నీ తెలుగునాట మరుపునకు రాని ఓ చరిత్ర! ప్రజాస్వామ్య పాలనకు ఓ సువర్ణాధ్యాయం. అభివృద్ధి–సంక్షేమం జోడు గుర్రాల స్వారీ సాగిన స్వర్ణయుగమది. రాష్ట్రమేదైనా.. తదుపరి పాలకులకు వైఎస్సార్‌ పరిపాలనే ఓ ‘బెంచ్‌మార్క్‌’ అన్న భావన స్థిరపడింది.

చరిత్ర కలిగిన ఎందరో నాయకులకన్నా వైఎస్సార్‌ని భిన్నంగా నిలబెట్టే అంశాలు రెండు! ఒకటి, ఆయనకు ప్రజల పట్ల ఉండే అవ్యాజమైన ప్రేమ–నిబద్ధత. రెండు ఆయన మాటలు, చేతలు, మొత్తం నడతపై ఉన్న అపార నమ్మకం–విశ్వసనీయత! ఈ రెండే వైఎస్‌ను చరిత్ర మరవని జననేతగా మలిచాయి. ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముందు రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దుర్భరం. రైతు కన్నీళ్లతో వ్యవసాయం అడుగంటింది. పనుల్లేక చేతి వృత్తులు కునారిల్లాయి. ఉద్యోగ–ఉపాధి అవకాశాల్లేక యువత నిస్తేజమైంది.

తప్పు దారిన సాగిన ఆర్థిక సరళీకరణ విధానాలు, ఉరుముతున్న ప్రపంచీకరణ, రాష్ట్రాన్ని నాటి సీఎం చంద్రబాబు ప్రపంచబ్యాంకు ప్రయోగశాల చేసిన తీరు వెరసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిద్రమైంది. రాజకీయ నాయకులు ప్రజలకు ఏ భరోసా ఇవ్వలేకపోతున్నారు. సరిగ్గా అదే సమయంలో వైఎస్సార్‌ పాదయాత్రకు సిద్ధమయ్యారు. నేరుగా ప్రజల్నే కలవడం, విభిన్న సమాజాల వారి ఇబ్బందుల్ని, కష్ట–నష్టాల్ని స్వయంగా చూడటం, వారి కష్టాల్లో పాలుపంచుకోవడం, సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషించడం, జనానికి అండగా ఉంటానని భరోసా కల్పించడం.. ఏప్రిల్‌ 9, 2003 చేవెళ్లలో ప్రారంభమైన వైఎస్సార్‌ చరిత్రాత్మక పాదయాత్ర!!